Ganesh Chaturthi 2022: కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం చూశాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. నేరుగా వినాయకుడి దగ్గరకు వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను.
నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసు వంచి, మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు.
‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు.
వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం అంతే వేగంతో పరుగులు తీస్తోంది. భారత రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. నిర్విఘ్నంగా లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడి దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులను దర్శించాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు.
వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని పరవశించారు ఆది దంపతులు.
అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో విజ్ఞానదాయకమైన భారతాన్ని అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. అనితర సాధ్యమైన ఇటువంటి రచనను, కొన్ని యుగాలు గడిచినా ఎవ్వరూ రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది.
కొత్త ప్రదేశాలలో పర్యటిస్తే మనసుకి సాంత్వన కలుగుతుంది కదా. అందువల్ల కొంతసేపు భూలోకంలో సంచరించి వస్తానమ్మా. అవును... ఈ రోజు నా పుట్టినరోజు కదమ్మా! ఈ వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. నీ అనుమతితో భూలోకంలో సంచరించి వస్తానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! ఇంతకాలం నువ్వు మాకు దూరంగా ఉన్నావు కదా.
ఇంక నీ ఎడబాటు భరించలేనురా. నేను కూడా నీ వెంట వస్తాను అని ఆప్యాయంగా కుమారుడిని అక్కున చేర్చుకుని, ‘‘భూలోకవాసులు నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా వీక్షించి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, తల్లిని తన వాహనం మీద కూర్చుండబెట్టి బయలుదేరాడు వినాయకుడు.
వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు మరింత సమాచార సేకరణ కోసం.
భూలోక సంచారం చేస్తూనే వినాయకుడు పార్వతీదేవితో తనకు వ్యాసుడికి మధ్య జరిగిన అనేక అంశాలను ముద్దుముద్దుగా వివరిస్తూ వచ్చాడు. కుమారుని జ్ఞానానికి తల్లి పరవశించిపోసాగింది. అంతలోనే మళ్లీ, ‘నాయనా! నిన్ను రకరకాల రూపాలుగా విగ్రహాలు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నీకు నా మీద ఉండే వాత్సల్యంతో నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు.
నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు కదా. భూలోక వాసులకు నా మీద చనువుతో కూడిన ప్రేమ ఉంది. నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! చిత్రకారులు నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాస్తూనే ఉంటారు. నేనంటే ప్రీతి కనుకనే వారు ఇన్ని విధాలుగా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు’ అన్నాడు వినాయకుడు.
‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్ వినాయకుడిగా కొలుస్తారు, మరి కొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. కొందరు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు’ అని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే అడ్డుతగిలి వినాయకుడు, ‘అంతేనా అమ్మా! కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలోని సిద్ధి, బుద్ధి లక్షణాలను నా భార్యలుగా చేశారు’ అని నవ్వుతూ పలికాడు.
ఆ మాటలకు నారదుడు అడ్డుపడుతూ, ‘అయ్యా! వినాయకా! మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు. నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు.
దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ముద్దుల కుమారుడిగా భావించుకుంటూ, అలంకరిస్తున్నారు. ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు! నిన్ను షోడశ గణపతులుగా పేర్కొన్నారు.
నిరుత్త గణపతి నుంచి మళ్లీ నిరుత్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కొందరు నిన్ను నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు.
‘ఈ సంవత్సరం భాగ్యనగరంలో నన్ను మృత్తిక గణపతిగా రూపుదిద్దారు. ఈ శరీరం పంచభూతాలతో తయారైనదనే వేదాంతాన్ని బోధించటానికే ఈ విగ్రహాల తయారీ. అందుకే అందరూ మట్టితోనే నా రూపం తయారుచేయండి’ అంటూ తల్లి ఒడిలో ఒదిగిపోయాడు లంబోదరుడు. పార్వతీదేవి తల్లి మనసు ఆర్ద్రమైంది. త్వరగా ఇల్లు చేరుకుని కుమారునికి దృష్టి దోషం తగలకుండా, ఉప్పు మిరపకాయలతో ‘ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి’ అంటూ గజాననుడి తల చుట్టూ ముమ్మారులు తిప్పి నిప్పులలో పడవేసింది.
నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తి పాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నామని నలుగురూ అనుకోవడం నాకు బాధగా ఉంటుంది. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నా రూపాన్ని మట్టితోనే తయారుచేసి పూజించండి. నా పేరున కులమతాల కుమ్ములాటలకు దూరంగా ఉండండి. ఇది నా అభ్యర్థన.
– వినాయకుడు, కైలాసం
సృజన రచన– డా. వైజయంతి పురాణపండ
చదవండి: గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
Comments
Please login to add a commentAdd a comment