Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం | Ganesh Chaturthi 2023: All You Need To Know About Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

Ganesh Chaturthi 2023: వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు!

Published Mon, Sep 18 2023 8:04 AM | Last Updated on Mon, Sep 18 2023 12:24 PM

Ganesh Chaturthi 2023:All You Need To Know About Vinayaka Chaturthi - Sakshi

సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు.

వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం.

ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది.

డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది.

భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై  ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం.

సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం.
సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం.

--మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement