clay Ganesh
-
మట్టి గణపతే.. మహా గణపతి..
-
Ganesh Chaturthi: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి! అందుకోసం..
Ganesh Chaturthi 2022: కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం చూశాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుంది అనుకున్నాడు. నేరుగా వినాయకుడి దగ్గరకు వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన చేద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే తప్పనిసరిగా వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసు వంచి, మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు ఎప్పుడు సుముహూర్తం నిర్ణయిస్తే అప్పుడే ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు. ‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేతబట్టి, ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యంలో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం అంతే వేగంతో పరుగులు తీస్తోంది. భారత రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. నిర్విఘ్నంగా లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడి దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులను దర్శించాడు. క్షేమసమాచారాలు కనుక్కున్నారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని పరవశించారు ఆది దంపతులు. అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో విజ్ఞానదాయకమైన భారతాన్ని అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. అనితర సాధ్యమైన ఇటువంటి రచనను, కొన్ని యుగాలు గడిచినా ఎవ్వరూ రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొత్త ప్రదేశాలలో పర్యటిస్తే మనసుకి సాంత్వన కలుగుతుంది కదా. అందువల్ల కొంతసేపు భూలోకంలో సంచరించి వస్తానమ్మా. అవును... ఈ రోజు నా పుట్టినరోజు కదమ్మా! ఈ వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా. నీ అనుమతితో భూలోకంలో సంచరించి వస్తానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! ఇంతకాలం నువ్వు మాకు దూరంగా ఉన్నావు కదా. ఇంక నీ ఎడబాటు భరించలేనురా. నేను కూడా నీ వెంట వస్తాను అని ఆప్యాయంగా కుమారుడిని అక్కున చేర్చుకుని, ‘‘భూలోకవాసులు నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారంలో చూసుకుంటున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా వీక్షించి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దగ్గర దీవెనలు అందుకుని, తల్లిని తన వాహనం మీద కూర్చుండబెట్టి బయలుదేరాడు వినాయకుడు. వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు మరింత సమాచార సేకరణ కోసం. భూలోక సంచారం చేస్తూనే వినాయకుడు పార్వతీదేవితో తనకు వ్యాసుడికి మధ్య జరిగిన అనేక అంశాలను ముద్దుముద్దుగా వివరిస్తూ వచ్చాడు. కుమారుని జ్ఞానానికి తల్లి పరవశించిపోసాగింది. అంతలోనే మళ్లీ, ‘నాయనా! నిన్ను రకరకాల రూపాలుగా విగ్రహాలు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నీకు నా మీద ఉండే వాత్సల్యంతో నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు. నీ ఒంటి నలుగు పిండితో నన్ను రూపొందించావు కదా. భూలోక వాసులకు నా మీద చనువుతో కూడిన ప్రేమ ఉంది. నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! చిత్రకారులు నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాస్తూనే ఉంటారు. నేనంటే ప్రీతి కనుకనే వారు ఇన్ని విధాలుగా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు’ అన్నాడు వినాయకుడు. ‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్ వినాయకుడిగా కొలుస్తారు, మరి కొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. కొందరు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు’ అని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే అడ్డుతగిలి వినాయకుడు, ‘అంతేనా అమ్మా! కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాకు పెళ్లి కూడా చేసేశారు, నాలోని సిద్ధి, బుద్ధి లక్షణాలను నా భార్యలుగా చేశారు’ అని నవ్వుతూ పలికాడు. ఆ మాటలకు నారదుడు అడ్డుపడుతూ, ‘అయ్యా! వినాయకా! మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు నారదుడు. నారదుడి మాటలకు ముసిముసిగా తొండం వెనుక నుంచి నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నా పుట్టినరోజు పేరుతో ఎంతో మంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి ముద్దుల కుమారుడిగా భావించుకుంటూ, అలంకరిస్తున్నారు. ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘‘వినాయకా! ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు! నిన్ను షోడశ గణపతులుగా పేర్కొన్నారు. నిరుత్త గణపతి నుంచి మళ్లీ నిరుత్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కొందరు నిన్ను నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారుచేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు. ‘ఈ సంవత్సరం భాగ్యనగరంలో నన్ను మృత్తిక గణపతిగా రూపుదిద్దారు. ఈ శరీరం పంచభూతాలతో తయారైనదనే వేదాంతాన్ని బోధించటానికే ఈ విగ్రహాల తయారీ. అందుకే అందరూ మట్టితోనే నా రూపం తయారుచేయండి’ అంటూ తల్లి ఒడిలో ఒదిగిపోయాడు లంబోదరుడు. పార్వతీదేవి తల్లి మనసు ఆర్ద్రమైంది. త్వరగా ఇల్లు చేరుకుని కుమారునికి దృష్టి దోషం తగలకుండా, ఉప్పు మిరపకాయలతో ‘ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి’ అంటూ గజాననుడి తల చుట్టూ ముమ్మారులు తిప్పి నిప్పులలో పడవేసింది. నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తి పాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. నా పేరున అసభ్యపు పాటలు వింటున్నామని నలుగురూ అనుకోవడం నాకు బాధగా ఉంటుంది. అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నా రూపాన్ని మట్టితోనే తయారుచేసి పూజించండి. నా పేరున కులమతాల కుమ్ములాటలకు దూరంగా ఉండండి. ఇది నా అభ్యర్థన. – వినాయకుడు, కైలాసం సృజన రచన– డా. వైజయంతి పురాణపండ చదవండి: గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే... -
వినాయకుడి విగ్రహాల తయారీ (ఫొటోలు)
-
బ్రహ్మీ మట్టి గణపతి.. ఫ్యాన్స్ ఖుషీ
హాస్య బ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కమెడియన్ బ్రహ్మానందం. ఆయన లేనిదే సినిమాలో కామెడీ లేదు అనేంత పేరును సంపాదించారు. బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పవచ్చు. రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకు ఒక స్పెషల్ క్రేజ్‌ను అందించారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఓ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ మధ్య సినిమాల్లో నటించడం బ్రహ్మనందం తగ్గించేశారు. దీంతో ఇటీవల కాలంలో ఆయన గురించి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. (ఆంజనేయుని ఆనందబాష్పాలు) ఈ క్రమంలో తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు. శనివారం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని బ్రహ్మనందం తయారు చేశారు. తమ స్వగృహంలో తన చేతితో మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీటిని ముందుగా ఎవరూ పోస్టు చేయారో తెలియదు కానీ.. బ్రహ్మీ అభిమానులు తమ ట్విటర్లో షేర్ చేసేస్తున్నారు.. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘బాలీవుడ్ కంటే సౌత్ యాక్టర్స్ బెటర్.. సాంప్రదాయలకు, పండగలకు విలువిచ్చే వ్యక్తి అని కొనియాడుతున్నారు. రియల్ యాక్టర్ బ్రహ్మనందం. బ్రహ్మ ద క్రియేటర్’ అంటూ పొగిడేస్తున్నారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) -
మా షాపుకు వస్తే మట్టి గణపతి ఇస్తాం
సాక్షి, దర్శి: మా షాపునకు వస్తే మట్టి గణపతి ఇస్తామని వినూత్న రీతిలో దర్శికి చెందిన సాగర్ ఫ్యాన్సీ అధినేత కల్లూరి విద్యాసాగర్ రెడ్డి మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. అయితే కొనుగోలు చేసేందుకు షాపుకు వచ్చిన అందరికీ విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొనుగోలు చేసినా చేయక పోయినా తమ షాపుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ విగ్రహాలు ఇస్తున్నామని సాగర్ తెలి పారు. స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి మరీ విగ్రహాలు తీసుకు వెళ్లమని కోరడం గమనార్హం. గతంలో సాగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అప్పట్లో పర్యావరణ పరి రక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. -
ప్రజలు ఎందుకు మారడం లేదు ?
సాక్షి, ముంబై : ముంబై వీధుల్లో ప్రతి ఏటలాగా ఈసారి కూడా దాదాపు రెండు లక్షల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో కేవలం 18 శాతం విగ్రహాలు మాత్రమే మట్టి విగ్రహాలు. మిగతా వన్నీ కూడా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ’ తో చేసినవే. పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పీవోపీ విగ్రహాలకు స్వస్తి చెప్పాలనీ, పర్యావరణానికి మేలు కలిగించే మట్టి లేదా కాగితపు గుజ్జు విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆ విఘ్నేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా ప్రజల్లో ఆశించిన చైతన్యం ఎందుకు రావడం లేదు? కారణాలు ఏమిటీ? ఇదే విషయమై మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేసి అమ్ముతున్న 46 ఏళ్ల వినోద్ విజయ్ నెవ్సేను ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను తయారు చేయడానికి చాలా సమయం పట్టడమే కాకుండా డబ్బు ఖర్చు కూడా ఎక్కువవుతుందని, లాభాలు తక్కువ వస్తాయని చెప్పారు. రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని విక్రయించడం ద్వారా తనకు 300 నుంచి 400 రూపాయల వరకు లాభం వస్తుందని, అదే రెండు అడుగుల పీవోపీ విగ్రహాన్ని అమ్మితే 1200 రూపాయల లాభం వస్తుందని ఆయన చెప్పారు. పైగా మట్టి విగ్రహాలు ఎక్కువగా అమ్ముడు పోవని, ఈ సీజన్లో తాను కేవలం 175 విగ్రహాలను మాత్రమే అమ్మగలిగానని చెప్పారు. అదే ఇతరులు పీవోపీ విగ్రహాలను వెయ్యి వరకు విక్రయించారని చెప్పారు. మరో వృత్తితో కొనసాగుతున్నందున తనకు ఈ మట్టి విగ్రహాల తయారీ పెద్ద భారం అనిపించడం లేదని ఆయన తెలిపారు. వినోద్ విజయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచే స్తున్నారు. ఈ సీజన్లో మాత్రమే మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్ముతుంటారు. వినోద్ విజయ్‌కి సమీపంలోనే చేతన్ వరాస్కర్ ప్రతీకార్త్ వినాయక విగ్రహాల పరిశ్రమ ఉంది. ఈ సీజన్లో ఆయన దాదాపు వెయ్యి విగ్రహాలను విక్రయించారట. అందులో 20 శాతం మాత్రమే మట్టి విగ్రహాలు ఉన్నాయట. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నప్పటికీ ఎందుకు పీవోపీ విగ్రహాల తయారీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను పరిమిత సైజులోనే తయారు చేయ గలమని, పెద్ద విగ్రహాలను తయారు చేయలేమని చెప్పారు. వీధుల్లో ప్రతిష్టించే విగ్రహాలు పెద్దవిగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తారుకనుక తాము పీవోపీనే ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాకుండా మట్టి విగ్రహాలకు పగుళ్లు వస్తాయని, రంగును కూడా ఎక్కువ పీల్చుకుంటాయని, అవే పీవోపీ విగ్రహాలకు పగుళ్లు రావని, రంగు తక్కువ పడుతుందని, పైగా ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన చెప్పారు. అన్నింటికన్నా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని విగ్రహాల తయారీలో మూడో తరానికి చెందిన చేతన్ వరాస్కర్ వివరించారు. ఈ కారణాల వల్లనే తాను కూడా పీవోపీ విగ్రహాలనే ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారు. కేవలం వృత్తిగురించి ఆలోచించే చేతన్ వరాస్కర్ లాంటి వాళ్లకు పీవోపీ విగ్రహాల వల్ల కలిగే నష్టం గురించి పెద్దగా తెలియదు. తెలిసినా పట్టించుకోరు. వినాయక విగ్రహాలన్నింటిని తీసుకెళ్లి నిమజ్జనం రోజున నీటిలో వేస్తారన్న విషయం తెల్సిందే. మట్టి విగ్రహాలయితే 45 నిమిషాల్లోనే నీటిలో కరిగి పోతాయి. పీవోపీ విగ్రహాలు నీటిలో కరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అది కరగడం వల్ల నీటిలో క్లోరిన్, లవణాలు, మురికి పెరుగుతాయి. పర్యవసానంగా నీటి సాంద్రత పెరిగి ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా చేపలు, కప్పల లాంటి జలచరాలు చనిపోతాయి. పీవోపీ విగ్రహాలకు ఉపయోగించే రసాయనిక రంగుల వల్ల నీరు విషతుల్యమై జల చరాలు చనిపోతాయి. విషతుల్యమైన నీటి ప్రభావం మానవులపై కూడా పడుతుంది. మట్టి విగ్రహాల వల్ల నీటిలో మట్టి పెరగడం తప్ప మరో ముప్పు లేదు. ఇప్పుడు మట్టి విగ్రహాలను కూడా నీటిలో నిమజ్జనం చేయకుండా నేలలో నిమజ్జనం చేయడం కోసం వివిధ రకాల చెట్ట గింజలు కలిగిన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తద్వారా చెట్ల పెరుగుదలకు దోహదపడవచ్చని స్వచ్ఛంద సంస్థల ఆలోచన. కాగితపు విగ్రహాలను ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయిగానీ కాగితపు గుజ్జుతో తయారుచేసే ఆ విగ్రహాలు మట్టివాటికన్నా ఖరైదనవి. పాలల్లో ముంచి పేదలకు పంచేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చాక్లెట్ విగ్రహాలను తయారు చేస్తుండగా, మరికొన్ని సంస్థలు చేపలు తినడానికి వీలుగా చెరకు గడలు, కొబ్బరి చిప్పలతో విగ్రహాలను తయారు చేయించి ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నా ప్రజల్లో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణం కాసులపైనున్న మమకారమే. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్లుగా పీవోపీ వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తే తప్పా మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఓట్ల రాజకీయాలను ఆశ్రయించే ప్రభుత్వాలు అంత పెద్ద నిర్ణయం తీసుకంటాయని ఆశించలేం! -
మట్టి వినాయకుని బ్యానర్ ఆవిష్కరణ
ఖమ్మం కల్చరల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను మాత్రమే వాడాలని జేసీ దివ్య అన్నారు. వాతావరణ కాలుష్యంతో కూడిన, నీటిలో కరగని ప్లాస్టర్ ఆఫ్ పారిస్, జిప్సమ్‌తో తయారు చేసిన విగ్రహాలను నిషేధించాలని రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో స్థానిక నాగసాయి ఇండియన్‌గ్యాస్, నాగుబండి డెంటల్ క్లినిక్ వారు ముద్రించిన ‘మట్టి వినాయక విగ్రహాలు’ వాడాలనే క్లాత్ బ్యానర్‌ను జాయింట్ కలెక్టర్ దివ్య చేతుల మీదుగా బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి అధ్యక్షుడు శ్రీనివాస్, దశాబ్ది ఉత్సవ కన్వీనర్ ప్రవీణ్‌కుమార్, నాగేష్, వేములపల్లి సీతారాంబాబు పాల్గొన్నారు. -
మట్టి వినాయకుడికే జై
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులకు స్వస్తి చెబుదాం భావి తరాలకు భరోసానిద్దాం సమప్త జీవకోటికి ప్రాణధారం స్వచ్ఛమైన నీరు, గాలి, పర్యావరణం. అలాంటి నీరు, గాలి, పర్యావరణం రోజురోజుకూ కలుషితమవుతోంది. ఫలితంగా జీవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఇష్టారీతిన చెట్లు నరికివేత, వాహనాల వినియోగం, పరిశ్రమల ఏర్పాటు, సహజ రంగుల వినియోగం, తదితర వాటితో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతోంది. వినాయక చవితి కూడా రానే వచ్చింది. అందుకే రసాయనాల రంగులతో కూడిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన వాటిని వాడితే పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతాం. – మహబూబ్‌నగర్ క్రైం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇటీవల మనం మొక్కలు నాటాం. వాటి సంరక్షణ బాధ్యతను భుజాలకెత్తుకున్నాం. పరిసరాలను మనం కాపాడితే..అవి మనల్ని కాపాడుతాయనే భావనలోంచే ఇది పుట్టింది. మరో ఐదు రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు రాబోతున్నాయి. వీధివీధినా విఘ్నేశ్వరుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రతి, ఫలాలతో ఏకదంతుడిని పూజించడానికి యువజన సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఆకర్షణీయంగా దర్శనమిస్తాడని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పాటు వివిధ రకాల రసాయనాల కలబోతతో రంగురంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను పూజిద్దాం. నీటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. జలచరాలకు ప్రాణదానం చేద్దాం. ఇప్పటి వరకు నాటిన మొక్కలన్నీ బతికేలా పర్యావరణ పరిరక్షణ కోసం మరోసారి నడుంబిగిద్దాం. చిన్న గణపయ్యలే మహా శ్రేష్టం వినాయకచవితి అనగానే ఎక్కడా లేని సంతోషం. ఉత్సాహం వచ్చేస్తాయి. ఆకర్షణీయమైన రంగులతో తయారు చేసిన పెద్ద విగ్రహాల ఏర్పాటు చేసి అందరూ సంబురపడతారు. పెద్ద మైకులు పెట్టి సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం హోదాగా భావిస్తారు. దీనివల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుంది. విగ్రహాల తయారీలో ఉపయోగిస్తున్న రసాయనాలతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. పెద్ద వినాయక విగ్రహాల తయారీకి వినియోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగులతో జలవనరులు కలుషితం అవుతున్నాయి. తొమ్మిది రోజుల సంతోషం కోసం దీర్ఘకాలిక నష్టాలను కొని తెచ్చుకోవడం ఎంతవరకు సరైన అంశమనే విషయం ఆలోచిద్దాం. రసాయన పదార్థాలతో తయారు చేసిన పెద్ద విగ్రహాల కంటే నల్లరేగడితో తయారు చేసిన చిన్న గణపయ్యలే మహా శ్రేష్టం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం గ్రామాల్లో పోటీతత్వం పెరిగి అధికంగా విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం ఎక్కువైంది. భారీ ఎత్తులో విగ్రహాలను తయారు చేసేందుకు చాలా ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లుగా అనేక పరీక్షల్లో వెల్లడైంది. వీటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై జలచరాలతో పాటు మన lపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రసాయన రంగులను వాడుతారు. వాటిలో సీసం, ట్రామ్, ఆర్సినిక్ కాపర్, కార్బోనియం, జింక్, మెర్క్యురీ, క్రోమియం వంటివి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఆ విగ్రహాలను నిమజ్జనం చేసిన నీటి వనరుల్లో లవణాల శాతం పెరిగిపోతుంది. దీంతో నీటి వనరులు పూర్తిగా కలుషితమవుతాయి. నిమజ్జనం తర్వాతే అసలు సమస్య రసాయనాలను వినియోగించి తయారు చేసిన వినాయకుడిని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశాకే అసలు సమస్య మొదలవుతుంది. మనం భారీగా ఖర్చుచేస్తే నష్టం కూడా భారీగానే ఉంటుంది. గొప్పగా ప్రతిష్ఠించే పెద్ద వినాయకుడి ద్వారా తిప్పలు కూడా పెద్దగానే ఉంటాయి. మన ఊరిలోని చెరువులో ఆ గణపయ్య నిమజ్జనం తర్వాత విగ్రహం నీటిలో కరగడానికి ఎన్నో నెలలు పట్టవచ్చు. ఆ గణపతి ప్రతిమలో వాడు ఇనుప చువ్వలతో జలచరాలకే కాదు ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే వారు ఉంటారు. ప్లాస్టిక్‌పై సమరానికి ఓ యువకుడు సై వాతావరణ సంరక్షణకు సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేశాడో యువకుడు. స్నేహితుల సహకారం, అమ్మ ప్రోత్సాహంతో లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నాడు జిల్లాకేంద్రంలోని శివశక్తినగర్‌కు చెందిన శ్రీకాంత్. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఈ యువకుడు ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకుని దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రస్తుతం సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరోవైపు ఎలాంటి రసాయనాలు లేకుండా బంకమట్టి, కొబ్బరిపీచుతో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఏడేళ్ల కాలంలో 50వేల మట్టి వినాయ విగ్రహాలు తయారు చేసి ప్రజలకు అందించాడు. 2010లో మట్టి వినాయక విగ్రహాలను తయారుచేయడం మొదలు పెట్టి ఆయన ప్రతి ఏడాది వేల సంఖ్యలో వాటిని తయారు చేస్తూ కాలుష్యం కాపాడేందుకు తనవంతు కషి చేస్తున్నాడు. గతేడాది 10వేల మట్టి విగ్రహాలను తయారు చేయడంతో చాలా స్పందన వచ్చిందని, ఈ ఏడాది 20వేల విగ్రహాలు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఈ సారి ఓపెన్ బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా మట్టి విగ్రహాలను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెబుతున్నాడు. 1995నుంచి ఏకో క్లబ్ ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ వేదికగా పని చేస్తున్నా ఏకో క్లబ్ సభ్యులు జిల్లాలో పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏకో క్లబ్‌ను జిల్లాలో 1995లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి గన్నోజీ చంద్రశేఖర్ చైర్మన్‌గా 200మంది సభ్యులు, 500మంది వలంటీర్లుగా జిల్లావ్యాప్తంగా పని చేస్తున్నారు. ఏకో క్లబ్ ఆధ్వర్యంలో వేల కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పర్యావరణం రక్షించడానికి కషి చేస్తున్నారు. జిల్లాస్థాయిలో యువకులకు సెమినార్లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి కేవలం పచ్చదనం, నీటి వినియోగంపై చాలా ప్రచారం చేశారు. కాలుష్యాంపై అవగహన కల్పించడంలో భాగంగా క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 2వేల సదస్సులు ఏర్పాటు చేశారు. కఠినచట్టాలు అవసరం.. విగ్రహాల తయారీలో విషపూరిత రసాయనాలు, రంగులు వాడటాన్ని రద్దు చేసి, కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ బంకమట్టితో తయారు చేసిన నీటిలో సులువుగా కరిగిపోయే విగ్రహాలను తయారు చేయాలి. దేవుడు ఏ విగ్రహంలోనైనా అదే అవతారం కాబట్టి పెద్ద విగ్రహాలు తయారు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విగ్రహాలు బంకమట్టితో చేసినవి నిమజ్జనం చేస్తే విశ్వమానవాళికి ప్రమాదం తప్పుతుంది. – డాక్టర్ చంద్రకిరణ్, పీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం అధిపతి