సాక్షి, ముంబై : ముంబై వీధుల్లో ప్రతి ఏటలాగా ఈసారి కూడా దాదాపు రెండు లక్షల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో కేవలం 18 శాతం విగ్రహాలు మాత్రమే మట్టి విగ్రహాలు. మిగతా వన్నీ కూడా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ’ తో చేసినవే. పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పీవోపీ విగ్రహాలకు స్వస్తి చెప్పాలనీ, పర్యావరణానికి మేలు కలిగించే మట్టి లేదా కాగితపు గుజ్జు విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆ విఘ్నేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా ప్రజల్లో ఆశించిన చైతన్యం ఎందుకు రావడం లేదు? కారణాలు ఏమిటీ?
ఇదే విషయమై మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేసి అమ్ముతున్న 46 ఏళ్ల వినోద్ విజయ్ నెవ్సేను ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను తయారు చేయడానికి చాలా సమయం పట్టడమే కాకుండా డబ్బు ఖర్చు కూడా ఎక్కువవుతుందని, లాభాలు తక్కువ వస్తాయని చెప్పారు. రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని విక్రయించడం ద్వారా తనకు 300 నుంచి 400 రూపాయల వరకు లాభం వస్తుందని, అదే రెండు అడుగుల పీవోపీ విగ్రహాన్ని అమ్మితే 1200 రూపాయల లాభం వస్తుందని ఆయన చెప్పారు. పైగా మట్టి విగ్రహాలు ఎక్కువగా అమ్ముడు పోవని, ఈ సీజన్‌లో తాను కేవలం 175 విగ్రహాలను మాత్రమే అమ్మగలిగానని చెప్పారు. అదే ఇతరులు పీవోపీ విగ్రహాలను వెయ్యి వరకు విక్రయించారని చెప్పారు. మరో వృత్తితో కొనసాగుతున్నందున తనకు ఈ మట్టి విగ్రహాల తయారీ పెద్ద భారం అనిపించడం లేదని ఆయన తెలిపారు. వినోద్ విజయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచే స్తున్నారు. ఈ సీజన్‌లో మాత్రమే మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్ముతుంటారు.
వినోద్ విజయ్‌కి సమీపంలోనే చేతన్ వరాస్కర్ ప్రతీకార్త్ వినాయక విగ్రహాల పరిశ్రమ ఉంది. ఈ సీజన్‌లో ఆయన దాదాపు వెయ్యి విగ్రహాలను విక్రయించారట. అందులో 20 శాతం మాత్రమే మట్టి విగ్రహాలు ఉన్నాయట. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నప్పటికీ ఎందుకు పీవోపీ విగ్రహాల తయారీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను పరిమిత సైజులోనే తయారు చేయ గలమని, పెద్ద విగ్రహాలను తయారు చేయలేమని చెప్పారు. వీధుల్లో ప్రతిష్టించే విగ్రహాలు పెద్దవిగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తారుకనుక తాము పీవోపీనే ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాకుండా మట్టి విగ్రహాలకు పగుళ్లు వస్తాయని, రంగును కూడా ఎక్కువ పీల్చుకుంటాయని, అవే పీవోపీ విగ్రహాలకు పగుళ్లు రావని, రంగు తక్కువ పడుతుందని, పైగా ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన చెప్పారు. అన్నింటికన్నా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని విగ్రహాల తయారీలో మూడో తరానికి చెందిన చేతన్ వరాస్కర్ వివరించారు. ఈ కారణాల వల్లనే తాను కూడా పీవోపీ విగ్రహాలనే ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారు.
కేవలం వృత్తిగురించి ఆలోచించే చేతన్ వరాస్కర్ లాంటి వాళ్లకు పీవోపీ విగ్రహాల వల్ల కలిగే నష్టం గురించి పెద్దగా తెలియదు. తెలిసినా పట్టించుకోరు. వినాయక విగ్రహాలన్నింటిని తీసుకెళ్లి నిమజ్జనం రోజున నీటిలో వేస్తారన్న విషయం తెల్సిందే. మట్టి విగ్రహాలయితే 45 నిమిషాల్లోనే నీటిలో కరిగి పోతాయి. పీవోపీ విగ్రహాలు నీటిలో కరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అది కరగడం వల్ల నీటిలో క్లోరిన్, లవణాలు, మురికి పెరుగుతాయి. పర్యవసానంగా నీటి సాంద్రత పెరిగి ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా చేపలు, కప్పల లాంటి జలచరాలు చనిపోతాయి. పీవోపీ విగ్రహాలకు ఉపయోగించే రసాయనిక రంగుల వల్ల నీరు విషతుల్యమై జల చరాలు చనిపోతాయి. విషతుల్యమైన నీటి ప్రభావం మానవులపై కూడా పడుతుంది.
మట్టి విగ్రహాల వల్ల నీటిలో మట్టి పెరగడం తప్ప మరో ముప్పు లేదు. ఇప్పుడు మట్టి విగ్రహాలను కూడా నీటిలో నిమజ్జనం చేయకుండా నేలలో నిమజ్జనం చేయడం కోసం వివిధ రకాల చెట్ట గింజలు కలిగిన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తద్వారా చెట్ల పెరుగుదలకు దోహదపడవచ్చని స్వచ్ఛంద సంస్థల ఆలోచన. కాగితపు విగ్రహాలను ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయిగానీ కాగితపు గుజ్జుతో తయారుచేసే ఆ విగ్రహాలు మట్టివాటికన్నా ఖరైదనవి. పాలల్లో ముంచి పేదలకు పంచేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చాక్లెట్ విగ్రహాలను తయారు చేస్తుండగా, మరికొన్ని సంస్థలు చేపలు తినడానికి వీలుగా చెరకు గడలు, కొబ్బరి చిప్పలతో విగ్రహాలను తయారు చేయించి ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నా ప్రజల్లో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణం కాసులపైనున్న మమకారమే. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్లుగా పీవోపీ వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తే తప్పా మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఓట్ల రాజకీయాలను ఆశ్రయించే ప్రభుత్వాలు అంత పెద్ద నిర్ణయం తీసుకంటాయని ఆశించలేం!
Comments
Please login to add a commentAdd a comment