సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఐదు మహాసముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలకు కూపాలుగా మారాయా? సముద్ర గర్భం, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి అవే కారణమా? రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తూ ఎల్‌నినో (పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం), లానినో(పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడం)ల సయ్యాటకు అవే దోహదం చేస్తున్నాయా? ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే భారీ ఉత్పాతాలు తప్పవా? అంటే అవుననే అంటోంది ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక. పర్యావరణ స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అధ్యయనం చేస్తూ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇవీ..
ప్లాస్టిక్ వ్యర్థాల డస్ట్‌బిన్‌గా మహాసముద్రాలు..
వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆసియా ఖండంలోని ఫిలిప్పీన్స్, భారత్, మలేసియా, చైనా, ఇండోనేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యధికంగా కడలిలోకి చేరుతున్నాయి.
దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ నుంచి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యధికంగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పటికే కడలిలో 6.75 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, హవాయి రాష్ట్రాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం ఫ్రాన్స్ దేశం విస్తీర్ణం కంటే మూడింతలు అధికం కావడం గమనార్హం.
నియంత్రించకుంటే ఉత్పాతాలే..
సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా చేరడం వల్ల.. సముద్ర ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. కడలి గర్భం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులకు ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం. ఇదే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో, లానినో ప్రభావాలు ఏర్పడటానికి దారితీస్తోంది. లానినో ప్రభావం ఉంటే.. రుతుపవనాల గమనం సక్రమంగా ఉంటుంది. అప్పుడు ప్రధానంగా భారత్ సహా ఆసియా దేశాల్లో సక్రమంగా వర్షాలు కురుస్తాయి.
అదే ఎల్‌నినో ప్రభావం ఏర్పడితే.. రుతుపవనాల గమనం అస్తవ్యస్తంగా ఉంటుంది. భారత్ సహా ఆసియా దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. సాగు, తాగునీటికి ఇబ్బంలు తప్పవు. ఇది అంతిమంగా ఆహార సంక్షోభానికి.. తద్వారా ఆకలి చావులకు దారితీస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం వల్ల సముద్రంలో ఉష్ణప్రవాహాలు పెరగడంతో మత్స్యసంపద నానాటికీ తగ్గిపోతోంది. మత్స్యకారుల ఉపాధినే కాదు.. ఇది పర్యావరణాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది.
కారణాలు ఇవే..
ఆయా దేశాల్లో పేదరికం, తీర ప్రాంతం, వర్షపాతం అధికంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఉదాహరణకు ఫిలిప్పీన్స్ ఏడు వేల ద్వీపాల సముదాయం. 36,289 కి.మీ.ల తీర ప్రాంతం ఆ దేశం సొంతం. ఆ దేశంలో 4,820 నదులు కడలిలో కలుస్తున్నాయి. అక్కడ పేదరికం అధికంగా ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడే పడేస్తున్నారు.
వర్షాలు కురిసినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షపు నీటితో కలిసి వాగుల్లోకి.. అక్కడి నుంచి నదుల్లోకి.. వాటి మీదుగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఏటా సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 35 శాతం ఫిలిప్పీన్స్‌కు చెందినవి కావడానికి ఇదే కారణం. అలాగే బ్రెజిల్ నుంచి అమెజాన్‌తోపాటు 1,240 నదులు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ దేశం నుంచి ఏటా 37,779 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కడలిలోకి చేరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment