సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. ఉదయం 9.30 గంటలకు నిర్వహించిన మహాగణపతి తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, ఉపాధ్యక్షుడు నాగేష్ హాజరయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా మట్టితో 50 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇక నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబయ్యాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ లాంటి ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి.
గణపతి వేడుకలకు భారీ ఏర్పాట్లు
బన్సీలాల్‌పేట్: గణేష్ నవరాత్రోత్సవాలు నగరంలో బ్రహ్మాండంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో మంగళవారం గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై పోలీసు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు విభాగాల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర్ ప్రజలు గణేష్ పండుగ వేడుకలు భక్తిప్రపత్తుల మధ్య అత్యంత ఘనంగా జరపుకోడానికి వీలుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
నగరంలో సుమారు 35 నుంచి 40 వేల వరకు గణేష్ మండపాలను ఏర్పాటు చేశారన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 9 శుక్రవారం గణేష్ నిమజ్జనోత్సవం జరగనుందన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment