క్లిక్: Ganesh Chaturthi: వ్రతకల్పము.. పూజా ద్రవ్యములు, వరసిద్ధి వినాయక పూజ
తదుపరి: విఘ్నేశుని కథా ప్రారంభం..
(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.
పూర్వం గజరూపంగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసించి ఉండమని కోరాడు. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించాడు.
కైలాసాన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశాలలో అన్వేషిస్తూ కొంత కాలానికి గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపించింది, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యం చెప్పి పంపాడు.
అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తాను కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరాడు. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చింది. కావున శివునొసంగు’’ అనెను.
ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారం తెలిపి నందిని ప్రేరేపించాడు నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. అప్పుడు శివుడు గజాసురగర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్లాడు. పిదప శివుడు నంది నెక్కి కైలాసానికి వేగంగా వెళ్లాడు.
కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపింది.
స్నానానంతరం పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొని పతి రాకకోసం నిరీక్షించసాగింది. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోయాడు. ఇంతలో వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించాడు. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తనమందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఉత్తరించి లోపలికి వెళ్లాడు.
అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించింది. వారిరువురు పరమానందంతో ప్రియసంభాషణములు ముచ్చటించుకొంటుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చింది. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టాడు.
అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొన సాగారు. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు. అతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనంగా జేసికొన్నాడు.
కొంతకాలానికి పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. అతని వాహనరాజం నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరారు. గజాననుడు తాను పెద్దవాడు గనుక ఆ ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.
సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి యీ ఆధిపత్యం ఇస్తాను’’ అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయు వేగంగా వెళ్లాడు. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయం తెలిపి రక్షించండి’’ యని ప్రార్థించాడు. అప్పుడు మహేశ్వరుడు దయతో, ‘‘కుమారా! ఒకసారి నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు.
‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’
అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ కైలాసాన ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావంతో∙అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. ఆ విధంగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడుతూ, కైలాసానికి వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలాన్ని నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అట్లా అన్నాను. క్షమించు. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వండి’’ అని ప్రార్థించాడు.
అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింప బడుతున్నాడు. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పాలు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించాడు.
భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోయాడు. ఎంత ప్రయత్నించినా, ఉదరం భూమికి ఆని, చేతులు భూమికి అందటం లేదు. ఈ విధంగా ప్రణామం చేయడానికి శ్రమిస్తుండగా శివుని శిరస్సున అలంకరించి వున్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయాయి. అతడు మృతుడయ్యాడు. పార్వతి శోకిస్తూ చంద్రుని చూసి,
‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక’’ అని శపించింది. చంద్రునికి కలిగిన శాపం లోకానికి కూడా శాపమైంది.
ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అటువంటి నీలాపనింద కలిగిందన్నమాట.
ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య (స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చివచ్చుట తెలియపరచి సప్తఋషులను సమాధాన పరచాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె. అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీదేవి! నీవిచ్చిన శాపం వలన లోకములకెల్ల కీడు వాటిల్లుతోంది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపానికి ఉపశమనం చెప్పాడు. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహాలకు వెళ్లి భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రం చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖంగా ఉన్నారు.
యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరు లుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగ వానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్ష మయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను.
అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చాడు. ఆ సమయాన సూర్యుడు సత్రాజిత్తుతో ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఆ మణి ఉన్న దేశంలో అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిముల వల్ల ఉపద్రవాలు, దుర్భిక్షం మొదలగునవి ఉండవు. కానీ అశుచిౖయె ధరిస్తే అది ధరించిన వానిని చంపుతుంది’’ అని చెప్పాడు.
ఈ విషయాలను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వస్తుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వస్తున్నాడని భావించి, ఆ విషయం శ్రీ కృష్ణునకు తెలియజేశారు. శ్రీకృష్ణుడు అట్టి రత్నం ప్రభువు వద్ద ఉంటే దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పించాలనుకున్నాడు.
అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికిచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్లాడు. కొంత సమయానికి శరీర శోధన కారణంగా ప్రసేనుడు అశౌచాన్ని పొందాడు. ఈ కారణంతో ప్రసేనుడు సింహం దాడిలో మరణించాడు. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకం సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చింది. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.
ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వేటకై వెళ్ళివున్నాడు. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడ్డాడు. వానికోసం అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుతూ తలెత్తి చూడగా ఆకాశాన శుక్లపక్ష చవితినాటి చంద్రబింబం కనపడ్డాడు. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు
తన మందిరానికి తిరిగి వచ్చాడు. దానికి పూర్వం, దేశ ప్రయోజ నాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం వల్ల, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించిందని సత్రాజిత్తు, పౌరులు భావించారు. అంతట ఆ అపవాదును పోగొట్టు కోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను.
శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెనని, రాత్రివేళ సింహం ప్రసేనుని, అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిష్టూరంగా పలికారు. ఈ అపవాదు నుండి తప్పించు కొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించాడు.
కొంత దూరం వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను.
అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.
శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః
సింహో జాంబవతాహతాః
సుకుమారక మారోధీః
తవ హ్యేష శ్యమంతకః
(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)
అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.
ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగన మొనర్చు కొనవలెనని కోర్కె ఉండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించసాగింది. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి ‘‘దేవాదిదేవ! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను.
ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడు’’ అంటూ పలువిధాల అభ్యర్థించాడు.
శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి ‘‘జాంబవంతా! శ్యమంతకమణి అపహరించా నన్న నింద నాపై వచ్చింది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను’’ అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపాడు.
ద్వారాకానగర పౌరులకు ఈ సత్యం తెలిపి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొన్నాడు. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించాడు.
శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను.
ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించి నారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసి నప్పటికీ, కుటుంబ పెద్ద అయిన
ధృతరాస్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖు లుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి.
వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దాన మొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను.
దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయాడు, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథంలో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్యుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద యుద్దంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతుడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయాడు.
బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్య ములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.
ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని,
ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.
శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయ మున మిక్కిలి కారుణ్యమూర్తి.
కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడి నప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.
చంద్రకాంతిలేమిచే ఓషదులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువైంది. దీనితో దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయం కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు,), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించాడు.
అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహాన్ని పొందాడు. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.
అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతాలను స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించాడు. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికాడు. అంతట శ్రీ కృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహించమని కోరాడు.
భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.
ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖంగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను.
దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపా ఖ్యానంలో శ్రీకృష్ణపరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానాన్ని అంటే అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయాలతో శిరమున అక్షతలు ధరించినయెడల చవితి చంద్రుని చూచి ననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది.
ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపర లిచ్చుచూండెను.
‘‘మంగళం మహత్’’
చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి
మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.
– కథ సమాప్తం –
తదుపరి: Ganesh Chaturthi 2022: వరసిద్ధి వినాయక పూజ, విఘ్నేశ్వరుని కథ, పునః పూజ (క్లిక్)
Comments
Please login to add a commentAdd a comment