Temple priests
-
పూజారి.. ఏది దారి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకుల బదిలీలపై పీఠముడి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇక ఆల య అర్చకులను కూడా బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చకులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి ఆ శాఖలోని కొందరు అధికారులు మద్దతిస్తుండగా, మరికొందరు అధికారులు మాత్రం బదిలీ చేయటంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు.. మంత్రులు మొదలు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పటివరకు దేవాలయ ఉద్యోగులను మాత్రమే ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి బదిలీ చేసేవారు. అర్చకులు మాత్రం అదే దేవాలయంలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఉద్యోగులతో సమంగా ఇప్పుడు ఆలయ అర్చకులు కూడా ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్నందున.. అర్చకులను కూడా ఆలయ ఉద్యోగులుగానే పరిగణిస్తూ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దేవాదాయ శాఖ పది రోజులుగా కసరత్తు చేస్తోంది. హైకోర్టు స్టే.. కౌంటర్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు.. దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారి అర్చకుల బదిలీలకు రంగం సిద్ధమైన వేళ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భద్రాచలం దేవాలయానికి చెందిన నారా యణాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు బదిలీ ప్రక్రియను రెండు వారాలపాటు నిలిపేస్తూ స్టే ఇచ్చింది. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. అర్చకుల వివరాలు, బదిలీ చేస్తే ప్రత్యామ్నాయ దేవాలయాన్ని ఎంచుకునే ఐచ్చికాన్ని తెలపాలంటూ జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా ఈ ఇద్దరు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్టే గడువు పూర్తి కాగానే బదిలీలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఐదు దేవాలయాల చాయిస్ ఆయా దేవాలయాల ఉద్యోగుల వివరాలను, వారు బదిలీలో ఏ దేవాలయాన్ని కోరుకుంటున్నారో (ఐదు దేవాలయాల చాయిస్) వెల్లడించాలని పే ర్కొంటూ ప్రొఫార్మాను ఆలయాలకు పంపింది. ఆ వివరాలు సేకరించి.. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా అంతరజిల్లా బదిలీలు చేయాలని నిర్ణయించింది. అర్చకులతోపాటు వేద పండితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం. ఎవరికి వర్తిస్తుందంటే. రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయం ఆధారంగా వాటి స్థాయిని ప్రభుత్వం విభజించింది. సాలీనా రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాటిని నేరుగా పర్యవేక్షిస్తూ తన ఆ«దీనంలోకి తీసుకుంది. ఈ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఉద్యోగుల తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలను చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి646 దేవాలయాలున్నాయి. వీటిల్లో 2500 మంది వరకు అర్చకులు పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20 శాతం మంది బదిలీ.. దేవాదాయ శాఖలో ప్రతి సంవత్సరం 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీ ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వెల్లడిస్తూ 2019లో జీఓ నంబరు 64ను జారీ చేసింది. కానీ, అది అమలులోకి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బదిలీలకు సిద్ధమైంది. ఈమేరకు జీఓ 243ని వారం రోజుల క్రితం జారీ చేసింది. వైష్ణవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు శైవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు చాలా తేడా ఉంటుంది. ఏ ఆగమాన్ని అనుసరించే దేవాలయ ఉద్యోగులు అదే ఆగమాన్ని అనుసరించే దేవాలయానికే బదిలీ చేయాలని నిర్ణయించింది. -
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
తమిళనాడు: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వ్యక్తులను అర్చకులుగా నియమించింది. మొత్తం 24 మందికి సీఎం స్టాలిన్ శనివారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అర్చకులుగా నియమితులైన వారు పూర్తి స్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లో చేరారని ప్రభుత్వం వెల్లడించింది. అన్ని కులాల వారికి దేవాలయ అర్చకుల విధుల్లో భాగం కల్పిస్తామని సీఎం స్టాలిన్ ఇచ్చిన ఎన్నిక హామీ దీంతో నెరవేరినట్లయింది. ఆగస్టు 14కు స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు అయిన నేపథ్యంలో ఈ నియామకాలు జరగడం గమనార్హం. 24 మంది అర్చకులతో పాటు పలు విభాగాలకు సంబంధించి మొత్తం 208 మంది నియామకం జరిగింది. వీరిలో భట్టాచార్యులు (వైష్ణవ పూజారులు), ఒధువార్లు (శైవ సంప్రదాయ నిపుణులు) ఇద్దరూ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యతో మాజీ సీఎం కరుణానిధి కల నెరవేరిందని స్టాలిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ సహా పలువురు స్వామీజీలు, మఠాధిపతులు స్వాగతించారు. -
ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ ప్రభుత్వంతో చర్చల ప్రశ్నే లేదని ఆలయ పూజారులు తేల్చిచెప్పారు. ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని, స్వామి సన్నిధానంలో మహిళా పోలీసులను నియమిస్తామన్న కేరళ ప్రభుత్వం నిర్ణయంపైనా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప ఆలయంతో సంబంధాలున్న పూర్వపు రాజులు పండాళం రాయల్స్ కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై సోమవారం మాట్లాడేందుకు పండాళం రాయల్స్ కుటుంబ సభ్యులు, ఆలయ పూజారులను కేరళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనంతవరకూ చర్చల ప్రసక్తే లేదని ఆలయ ప్రధాన పూజారుల్లో ఒకరైన కందరారు మోహనారు తెలిపారు. -
నో హెల్మెట్.. నో పూజ!
పారదీప్: హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారని తెలుసు. పూజారులు కూడా పూజ చేయరనే విషయం మీకు తెలుసా? ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక సరళాదేవి మాతా ఆలయ పూజారులు మాత్రం హెల్మెట్ లేకపోతే తాము పూజ చేయబోమని కచ్చితంగా చెప్పేస్తున్నారట. కొత్త ద్విచక్ర వాహనం కొనుక్కొని ఎవరు వచ్చినా.. హెల్మెట్ చూపితేనే పూజ చేస్తామని చెప్పడమే కాదు, లేనివారిని తిప్పి పంపుతున్నారట. స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆలయ పరిసరాల్లో కూడా పలుచోట్ల ‘నో హెల్మెట్.. నో పూజ’ అనే బోర్డులు పెట్టడంతో దేవి దర్శనానికి వచ్చిన భక్తులంతా హెల్మెట్ అవసరంపై చర్చించుకుంటాన్నారని పూజారులు చెబుతున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పూజారులు చెబుతున్నారు. ఈ సరళాదేవి మాతా ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని పూజారులు తెలిపారు. అందుకే ఇక్కడ వాహనాలకు పూజ చేయించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారని వారు చెప్పారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కొత్త బండి కొన్నా ఈ ఆలయానికే వచ్చి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోందట. అందుకే ఈ ఆలయంలోనే ‘నో హల్మెట్.. నో పూజ’ను అమలు చేయాలని భావించామని పోలీసులు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అన్నారు. -
'ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తా'
-
'ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తా'
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరంలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని శనివారం ఉదయం కుటుంబసమేతంగా దర్శించుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి వచ్చిన సింధుకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సింధు కుటుంబసభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతియేటా అమ్మవారి సన్నిధికి వచ్చి బోనాలు సమర్పిస్తానని తెలిపింది. -
మోకాళ్లపై కూర్చుని అర్చకుల నిరసన
వర్గల్ (మెదక్ జిల్లా) : జిల్లాలోని వివిధ ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల సమ్మె మంగళవారం ఎనిమిదో రోజుకు చేరింది. మెదక్ జిల్లా వర్గల్లో మొన్న నాచగిరీశునికి ముడుపు కట్టి వినూత్న రీతిలో నిరసన గళం వినిపించిన నాచగిరి అర్చక సిబ్బంది, నిన్న గోపురమెక్కి, రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో చేశారు. మంగళవారం ఆలయ మండపంలోని గర్భగుడి ముందు మోకాళ్లపై కూర్చుని ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం తమను కరుణించేలా చూడాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా కటాక్షించాలని నాచగిరీశుని మొక్కుకున్నారు. నిరసన కార్యక్రమం అర్చక, ఉద్యోగ సంఘ నేతలు గోపాలకృష్ణ శర్మ, రంగాచారి, సుధాకర్‌గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచారి, జగన్నాథచారిల నేతృత్వంలో కొనసాగింది. -
అర్చకుల సమ్మెతో ఉద్రిక్తత
హైదరాబాద్: ఆలయ అర్చక, ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించాలని అర్చకులు ఆదివారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన సుదర్శన హోమం ఉద్రిక్తంగా మారింది. సమ్మెలో పాల్గొనేందుకు అర్చకులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే హోమం నిర్వహించేందుకు అనుమతి లేదంటూ ఆలయ కార్య నిర్వహణా అధికారి వినోద్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. హోమానికి అనుమతించకపోవడంతో అర్చకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు అర్చకులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో భరత్‌నగర్ ఆలయానికి చెందిన అర్చకులు శ్రీనివాస్, లక్ష్మణ్ ఆలయం గోపురంపైకి ఎక్కి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అర్చకుల అసోసియేషన్ నాయకులు మాట్లాడి కిందకు దిగాలని కోరడంతో వారు దిగారు. సుమారు 3 గంటల పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద హైడ్రామా జరగడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అర్చక అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, వెంటేశ్వర్రావు, నర్సింగరావు, రవీంద్రా చార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా అర్చకుల సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యను పరిష్కరించాలని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రావణ్, సనత్‌నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూన వెంకటేశ్‌గౌడ్‌లు పేర్కొన్నారు. -
ఖజానా నుంచి వేతనాలివ్వండి
దేవాదాయ కమిటీకి అర్చకులు, ఉద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: తమకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు ఇచ్చేలా సిఫారసు చేయాలని దేవాదాయ చట్ట సవరణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు కోరారు. కమిటీ సభ్యులు వెంకటాచారి, సీతారామారావు, కృష్ణమూర్తి శనివారం దేవాదాయశాఖ కార్యాలయంలో అభిప్రాయసేకరణ నిర్వహించారు. దీనికి పలు ఆలయాల ధర్మకర్తలు, అర్చకులు, ఉద్యోగులు హాజరై పలు సూచనలు అందజేశారు. దేవాలయాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌తో ఇటీవల దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు దిగటంతో ప్రభుత్వం దాని పరిశీలనకు ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చట్ట సవరణ కమిటీకి కూడా ఆ అంశాన్ని వివరించి ప్రభుత్వానికి అనుకూలంగా సిఫారసు చేయాల్సిందిగా కోరారు. అర్చక సంఘాల విభేదాలపై అసహనం: అర్చక సంఘాల్లో విభేదాలు, పరస్పర ఆరోపణలపై కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గంగు భానుమూర్తి ఆధ్వర్యంలోని అర్చక సంఘం, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో అర్చకుల్లో విభేదాలు రచ్చకె క్కాయి. సమ్మెను ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలోని తెలంగాణ అర్చక సంఘం వ్యతిరేకించింది. సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. కమిటీకి మొదట భానుమూర్తి వర్గం సూచనలు అందజేసింది. ఆ తర్వాత ఉపేంద్ర శర్మ వర్గం తెలిపింది. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీనిపై కమిటీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
ఆలయ పూజారికి 23 ఏళ్ల జైలు
వేలూరు: అభం శుభం ఎరుగని బాలి కపై అత్యాచారం చేసి, హత్య చేసి మృత దేహాన్ని బావిలో వేసిన ఆల య పూజారికి వేలూరు మహిళా కోర్టు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వేలూ రు జిల్లా గుడియాత్తం పాండియనగర్ వినాయక గుడి వీధికి చెందిన కుమార్(50) అదే గ్రామంలోనే ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని ఇంటి ముందున్న ప్రభుత్వ పాఠశాలలో కాళియమ్మన్ పట్టణం గ్రామానికి చెందిన రాజ కుమార్తె రాజేశ్వరి(7) రెండో తరగతి చదువుతుంది. 2011 సెప్టెంబర్ 19న పాఠశాలకు వెళ్లిన రాజేశ్వరి ఇంటికి రాలేదు. మూడు రోజుల అనంతరం అదే ప్రాంతంలోని ఒక వ్యవసాయ బావిలో రాజేశ్వరి మృతదేహం లభ్యమైంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరి హత్య కేసుపై విచారణ చేపట్టారు. విచారణలో రాజేశ్వరిని అదే ప్రాంతానికి చెందిన ఆలయ పూజారి కుమార్ చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఇంటిలోని పెద్దవారికి విషయం చెబుతుందని భయపడి, హత్య చేసి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో వేసిన ట్లు నిర్ధారణ అయింది. దీంతో కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు వేలూరు మహిళా కోర్టుకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తి నజీర్ అహ్మద్ కుమార్ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు పది సంవత్సరాలు, హత్య చేసినందుకు పది సంవత్సరాలు, హత్య ను చెప్పకుండా దాచినందుకు మూడేళ్లు మొత్తం 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా అపరాధ రుసుముగా రూ.5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చా రు. దీంతో కుమార్‌ను పోలీసులు వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
స్వామివారి పాదాల కింద తీర్థ ప్రవాహాలు!
దేవదేవుడు కొలువైన తిరుమల గిరులు ముక్కోటి తీర్థాలకు నిలయాలు. భక్తులకు సాధారణంగా శేషాచల ఏడు కొండల్లోని ముఖ్య తీర్థాలు మాత్రమే తెలుసు. కానీ సాక్షాత్తు గర్భాలయం, భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి అంతగా తెలియదు. శ్రీవేంకటేశ్వరుని పాదాలను నిత్యం స్పృశిస్తాయని పురాణాలు చెబుతున్న ఆ తీర్థాల గురించిన ప్రత్యేక కథనం... స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును ఆజ్ఞాపిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మలబావిగా పిలుస్తుంటారు. స్వామి పవిత్ర నిర్మాల్యం పూలబావికే సొంతం అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామికి సమర్పించిన తులసి, పుష్ప, పూమాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. రంగదాసు మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి స్వామిని సేవించారని పురాణాల కథనం. అభిషేక సేవకు బంగారుబావి నీళ్లు వకుళమాత కొలువైన పోటు(వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీ తీర్థం, సుందర తీర్థం, లక్ష్మి తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారట! పుణ్యఫలం కటాహతీర్థ పానం శ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహ తీర్థపానం... ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకుని తొట్టిమాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీన్ని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామి పాదాల నుండి వచ్చే అభిషేకతీర్థం ఇది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలు లేదా శ్రీవేంకటేశుని నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు. మోక్షప్రాప్తి కలిగించే పుష్కరిణి పుణ్యస్నానం బ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రితోపాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖ శాంతులతోపాటు పరలోకంలో మోక్షమూ సిద్ధిస్తుందని నమ్మకం. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే ఇందులో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. పుష్కరిణిలో ప్రాచుర్యంలోని తొమ్మిది తీర్థాలు ముక్కోటి తీర్థాల సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి: మార్కండేయ తీర్థం (పూర్వ భాగం), ఆగ్నేయ తీర్థం( ఆగ్నేయ భాగం), యమ తీర్థం (దక్షిణ భాగం), విశిష్ణ తీర్థం (నైరుతి), వరుణ తీర్థం (పడమర), వాయు తీర్థం(వాయు భాగం), ధనద తీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం (ఈశాన్యం), సరస్వతీ తీర్థం(మధ్య భాగం). పూర్వం శంఖనుడు అనే రాజు స్వామివారి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడట. దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకుంటాడు. ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలు పోగొట్టుకుని, భోగభాగ్యాలు సంపాదించుకున్నారని పెద్దలు చెప్పే మాట!