దేవాలయ అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ బదిలీలు చేయాలని సర్కార్ నిర్ణయం
బదిలీలపై కసరత్తు చేస్తున్న దేవాదాయ శాఖ
వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరు అర్చకులు
తాత్కాలిక నిలుపుదల..కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ నిర్ణయం
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ప్రతి ఏడాదీ 20 శాతం మంది బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకుల బదిలీలపై పీఠముడి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇక ఆల య అర్చకులను కూడా బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చకులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి ఆ శాఖలోని కొందరు అధికారులు మద్దతిస్తుండగా, మరికొందరు అధికారులు మాత్రం బదిలీ చేయటంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు.. మంత్రులు మొదలు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ఒత్తిడి ప్రారంభించారు.
వాస్తవానికి ఇప్పటివరకు దేవాలయ ఉద్యోగులను మాత్రమే ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి బదిలీ చేసేవారు. అర్చకులు మాత్రం అదే దేవాలయంలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఉద్యోగులతో సమంగా ఇప్పుడు ఆలయ అర్చకులు కూడా ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతున్నందున.. అర్చకులను కూడా ఆలయ ఉద్యోగులుగానే పరిగణిస్తూ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దేవాదాయ శాఖ పది రోజులుగా కసరత్తు చేస్తోంది.
హైకోర్టు స్టే.. కౌంటర్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు..
దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారి అర్చకుల బదిలీలకు రంగం సిద్ధమైన వేళ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భద్రాచలం దేవాలయానికి చెందిన నారా యణాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు బదిలీ ప్రక్రియను రెండు వారాలపాటు నిలిపేస్తూ స్టే ఇచ్చింది. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది.
అర్చకుల వివరాలు, బదిలీ చేస్తే ప్రత్యామ్నాయ దేవాలయాన్ని ఎంచుకునే ఐచ్చికాన్ని తెలపాలంటూ జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా ఈ ఇద్దరు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే స్టే గడువు పూర్తి కాగానే బదిలీలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది.
ఐదు దేవాలయాల చాయిస్
ఆయా దేవాలయాల ఉద్యోగుల వివరాలను, వారు బదిలీలో ఏ దేవాలయాన్ని కోరుకుంటున్నారో (ఐదు దేవాలయాల చాయిస్) వెల్లడించాలని పే ర్కొంటూ ప్రొఫార్మాను ఆలయాలకు పంపింది. ఆ వివరాలు సేకరించి.. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా అంతరజిల్లా బదిలీలు చేయాలని నిర్ణయించింది. అర్చకులతోపాటు వేద పండితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా నిర్ణయించటం విశేషం.
ఎవరికి వర్తిస్తుందంటే.
రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయం ఆధారంగా వాటి స్థాయిని ప్రభుత్వం విభజించింది. సాలీనా రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాటిని నేరుగా పర్యవేక్షిస్తూ తన ఆ«దీనంలోకి తీసుకుంది. ఈ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఉద్యోగుల తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలను చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి646 దేవాలయాలున్నాయి. వీటిల్లో 2500 మంది వరకు అర్చకులు పనిచేస్తున్నారు.
ప్రతి సంవత్సరం 20 శాతం మంది బదిలీ..
దేవాదాయ శాఖలో ప్రతి సంవత్సరం 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీ ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వెల్లడిస్తూ 2019లో జీఓ నంబరు 64ను జారీ చేసింది. కానీ, అది అమలులోకి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బదిలీలకు సిద్ధమైంది. ఈమేరకు జీఓ 243ని వారం రోజుల క్రితం జారీ చేసింది. వైష్ణవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు శైవ ఆగమాలను అనుసరించే దేవాలయాల్లో పద్ధతులకు చాలా తేడా ఉంటుంది. ఏ ఆగమాన్ని అనుసరించే దేవాలయ ఉద్యోగులు అదే ఆగమాన్ని అనుసరించే దేవాలయానికే బదిలీ చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment