పారదీప్: హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారని తెలుసు. పూజారులు కూడా పూజ చేయరనే విషయం మీకు తెలుసా? ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక సరళాదేవి మాతా ఆలయ పూజారులు మాత్రం హెల్మెట్ లేకపోతే తాము పూజ చేయబోమని కచ్చితంగా చెప్పేస్తున్నారట. కొత్త ద్విచక్ర వాహనం కొనుక్కొని ఎవరు వచ్చినా.. హెల్మెట్ చూపితేనే పూజ చేస్తామని చెప్పడమే కాదు, లేనివారిని తిప్పి పంపుతున్నారట.
స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆలయ పరిసరాల్లో కూడా పలుచోట్ల ‘నో హెల్మెట్.. నో పూజ’ అనే బోర్డులు పెట్టడంతో దేవి దర్శనానికి వచ్చిన భక్తులంతా హెల్మెట్ అవసరంపై చర్చించుకుంటాన్నారని పూజారులు చెబుతున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పూజారులు చెబుతున్నారు. ఈ సరళాదేవి మాతా ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని పూజారులు తెలిపారు. అందుకే ఇక్కడ వాహనాలకు పూజ చేయించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారని వారు చెప్పారు.
ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కొత్త బండి కొన్నా ఈ ఆలయానికే వచ్చి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోందట. అందుకే ఈ ఆలయంలోనే ‘నో హల్మెట్.. నో పూజ’ను అమలు చేయాలని భావించామని పోలీసులు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment