helment
-
పోలీసులను బూతులు తిట్టాడు.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, చేవెళ్ల: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై ఓ వాహనదారుడు విరుచుకుపడ్డారు. పోలీసులు ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారని వాదించాడు. ఈ ఘటన చేవెళ్ల పీఎస్ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చనువెళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే షాబాద్ చౌరస్తాలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సుధాకర్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. ఆయన వాహనాన్ని నిలుపకపోవడంతో పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. దీంతో ఆయన మీకు వాహనాలు ఆపి ప్రజల సమయం వృథా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. మీరంతా మా జీతగాళ్లు అంటూ వాదించాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు. పోలీసుల విధులకు భంగం కలిగించినందుకుగాను సుధాకర్‌రెడ్డిపై చేవెళ్ల పీఎస్‌లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులతో సుధాకర్‌రెడ్డి వారించిన వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ చేశారు. చదవండి: దారుణం: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు దాడి! -
హెల్మెట్ లేకుంటే 3 నెలలు లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలో వాహన చోదకులకు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో హెల్మెట్ ధరించని వారికి జరిమానాతో పాటు 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. ఇదే విషయాన్ని వాహనచోదకులకు అవగాహన కలిగించే దిశగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అదేశాను సారం చర్యలు తీసుకుంటాం’అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రియాంకకు లిఫ్ట్.. రిటైర్డు ఐపీఎస్‌కు జరిమానా
-
ప్రియాంకకు లిఫ్ట్.. రిటైర్డు ఐపీఎస్‌కు జరిమానా
లక్నో : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని శనివారం లక్నో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసింది. అయితే ఆ సమయంలో కాన్వాయ్ నుంచి దిగిన ఆమె.. రిటైర్డు ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి ద్విచక్రవాహనంపై వెళ్లారు. దీనిపై ఆదివారంసీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆయన వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ లేదని జరిమానా విధించారు. రూ.6100 జరిమానా వేస్తున్నట్లు లక్నో ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు సీఏఏ నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో దారాపురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు. అయితే ఆమె వెళ్లడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు. -
హెల్మెట్ లేకుంటే బైక్ నడవదు !
బూర్గంపాడు : హెల్మెట్ లేకుంటే బైక్ నడవకుండా ఓ వినూత్న ప్రయోగం చేసి సఫలీకృతుడయ్యాడు భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు. హెల్మెట్ ఉంటేనే మోటార్‌సైకిల్ నడిచేలా ఓ టెక్నిక్ కనిపెట్టాడు. గ్రామానికి చెందిన కొట్టె ప్రవీణ్ కొత్తగూడెంలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఈఈఈ పూర్తిచేశాడు. ఇటీవల జరుగుతున్న రోడ్డుప్రమాదాల నివారణకు, మోటార్‌సైకిళ్ల చోరీకి అడ్డుకట్ట వేయాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, గతంలో రిమోట్ టాయ్స్ తయారుచేసిన అనుభవంతో మోటార్‌సైకిల్ నడవాలంటే హెల్మెట్ ఉండేలా ఓ టెక్నిక్‌ను తయారుచేశాడు. మోటార్‌సైకిల్ ఇగ్నిషన్‌ను రిలే సర్క్యూట్‌తో అనుసంధానం చేశాడు. రిలే సరూŠయ్య్ట్ను ఆన్, అఫ్ చేసేందుకు ఓ ట్రాన్స్‌మీటర్‌ను హెల్మెట్‌లో అమర్చాడు. ట్రాన్స్‌మీటర్ సిగ్నల్ కమ్యూనికేషన్ ఉంటేనే మోటార్‌సైకిల్ ఇగ్నిషన్‌కు అనుసంధానం చేసిన రిలే సర్క్యూట్ పనిచేస్తుంది. హెల్మెట్ దగ్గరుంటేనే ట్రాన్స్‌మీటర్ నుంచి సిగ్నల్స్ అంది.. మోటార్‌సైకిల్ స్టార్ట్ అవుతుంది. లేకుంటే కాదు. హెల్మెట్ మరిచిపోయినా మోటార్‌సైకిల్ నడవదు. హెల్మెట్‌కు అమర్చిన ట్రాన్స్‌మీటర్ పనిచేసేందుకు వారానికి ఒకసారి చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుందని ప్రవీణ్ తెలిపాడు. గోవాలో జిందాల్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఆధారంగా విద్యుత్ మోటార్లు ఆన్, ఆఫ్ చేసి సక్సెస్ అయ్యానని, ఇళ్లలోని గదులకు రక్షణ కల్పించేందుకు సెక్యూరిటీ సిస్టం డెవలప్ చేశానని ప్రవీణ్ తెలిపారు. హెల్మెట్ పెట్టుకోవాలని ఎంత ప్రచారం చేసినా వాహనదారులు పట్టించుకోవటం లేదని, తాను తయారుచేసిన హెల్మెట్ ట్రాన్స్‌మీటర్ సిస్టం పూర్తిస్థాయిలో డెవలప్ చేస్తే మోటార్‌సైకిల్ నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకుంటారని, దీంతో రోడ్డుప్రమాదాలలో మరణాల శాతం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హెల్మెట్ లేకుంటే మోటార్‌సైకిల్ స్టార్ట్ కానందున బైక్ చోరీలు కూడా తగ్గిపోతాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు. -
మూణ్నాళ్ల ముచ్చటేనా..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లఘుచిత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా హెల్మెట్ పెట్టుకుంటే బరువని, హేర్‌స్టైల్ చెదిరిపోతుందని భావిస్తూ చాలామంది దానిని ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పో తున్నారు. కుటుంబాలకు దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. గతంలో హెల్మెట్ వినియోగం చాలా వరకు అమలు జరిగినా పోలీసులు, రవాణాశాఖ అధికారులు రానురాను కొంత పట్టించుకోకపోవడంతో అదికాస్తా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రత్యేక డ్రైవ్‌తో... గతంలో పోలీస్, రవాణాశాఖ అధికారులు సం యుక్తంగా హెల్మెట్ వినియోగాన్ని అమలు చేశా రు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ ధరించని వాహనదారులపై కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లకు వస్తే హెల్మెట్ లేకుండా రావద్దని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. దీంతో కొంత హెల్మెట్ వినియోగంలో వాహన చోదకులు బాధ్యతగా తీసుకున్నారు. హెల్మెట్‌ను విధిగా ఉపయోగించారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ వినియోగం చాలా వరకు తగ్గిపోగా పోలీ సులు సైతం నామమాత్రంగా తీసుకుంటున్నారు. భారీ ఎత్తున జరిమానాలు... హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో నూతన రవాణ చట్టం అమలులోకి వచ్చింది. గతంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టు పడితే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించే వారు. ఇక ఇప్పుడు భారీగా జరిమానా విధించైనా సరే హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నో హెల్మెట్–నో పెట్రోల్ నినాదం అమలు జరిపేలా చర్యలు తీసుకొనే విధంగా పోలీసులు చూస్తున్నారు. ఇక రవాణ శాఖాధికారులకు హెల్మెట్ లేకుండా పట్టుబడితే ఆ శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1వెయ్యితో పాటు హెల్మెట్ లేని కారణంగా మరో రూ. 100 మొత్తం కలిపి రూ.1,100 జరిమానా విధిస్తారు. అయితే ఇటీవల హెల్మెట్ వినియోగం తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇకపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈ క్రమంలో వాహన చోదకులు హెల్మెట్ రోజూవారీగా ధరించేలా చూస్తామని రవాణ శాఖ సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గడ్డం వివేకానంద్‌రెడ్డి అన్నారు. ప్రాణాలు కోల్పోతున్నా... రహదారి ప్రమాదాల్లో 70శాతం మంది ద్విచక్రవాహనదారులు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ మృత్యువాత పడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కిందపడి తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. 2016లో 222 ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగగా 160 మంది మృతి చెందారు. మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. 2017లో జరిగిన 236 ద్విచక్ర వాహనప్రమాదాల్లో 196 మంది మృతి చెందగా 145 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2018 మే నెల వరకు 95 ప్రమాదాలు జరగగా 80 మంది వరకు మృత్యువాత పడగా 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. కఠినంగా వ్యవహరిస్తాం... హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానా తక్కువగా ఉండటం, తనిఖీల సమయాల్లో వాహనదారులు అప్రమత్తం కావడం వలన హెల్మెట్ వినియోగంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. రవాణ చట్టాలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తాం. అవసరమైతే రవాణాశాఖా అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ వినియోగం పెంచడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. –జి.సతీశ్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల -
బైక్‌ను వెంబడించిన పోలీసులు.. గర్భిణి మృతి..!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి హైవేపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదని బైక్‌పై వెళ్తున్న దంపతులను పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో బైక్‌పై నుంచి గర్భిణి జారిపడింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. వివరాలివి.. గణేష్ సర్కిల్ వద్ద పోలీసులు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పలువురు పోలీసులకు గాయపడ్డారు. పరిస్థితి మితిమిరడంతో డీఎస్పీ అక్కడికి చేరుకున్నాడు. చర్చలకు వచ్చిన డీఎస్పీపై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. రోడ్డుపై బైఠాయించడంతో బారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. పోలీసుల చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. రోజు మాదిరే పోలీసులు హైవేపై చేకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తిరుచ్చి రేంజ్ డీఐజీ నేతృత్వంలో విచారణ మొదలెట్టామన్నారు. దీనికి కారణమైన ఇన్స్పెక్టర్ను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి చెప్పారు. -
నో హెల్మెట్.. నో పూజ!
పారదీప్: హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారని తెలుసు. పూజారులు కూడా పూజ చేయరనే విషయం మీకు తెలుసా? ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ప్రతిష్టాత్మక సరళాదేవి మాతా ఆలయ పూజారులు మాత్రం హెల్మెట్ లేకపోతే తాము పూజ చేయబోమని కచ్చితంగా చెప్పేస్తున్నారట. కొత్త ద్విచక్ర వాహనం కొనుక్కొని ఎవరు వచ్చినా.. హెల్మెట్ చూపితేనే పూజ చేస్తామని చెప్పడమే కాదు, లేనివారిని తిప్పి పంపుతున్నారట. స్థానిక పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆలయ పరిసరాల్లో కూడా పలుచోట్ల ‘నో హెల్మెట్.. నో పూజ’ అనే బోర్డులు పెట్టడంతో దేవి దర్శనానికి వచ్చిన భక్తులంతా హెల్మెట్ అవసరంపై చర్చించుకుంటాన్నారని పూజారులు చెబుతున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పూజారులు చెబుతున్నారు. ఈ సరళాదేవి మాతా ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని పూజారులు తెలిపారు. అందుకే ఇక్కడ వాహనాలకు పూజ చేయించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారని వారు చెప్పారు. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కొత్త బండి కొన్నా ఈ ఆలయానికే వచ్చి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోందట. అందుకే ఈ ఆలయంలోనే ‘నో హల్మెట్.. నో పూజ’ను అమలు చేయాలని భావించామని పోలీసులు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు అన్నారు. -
హెల్మెట్ ధరించండి: నటుడు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం గా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే పరిసరాల పరిశుభ్రతతో నగరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నెంబర్ వన్ చేయాలని నగర ప్రజలకు ప్రముఖ సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. గురువారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్‌రోడ్, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్ చేరుకుంది. ఈ ర్యాలీలో మేయర్ రజనీ శేషసాయి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు పాల్గొన్నారు. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆలీ మాట్లాడుతూ.. అందరూ శుభ్రత పాటించాలన్నారు. ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా వేస్తారన్నారు. ప్రతీ ఒక్కరూ తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. మేయర్ రజనీశేషసాయి మాట్లాడుతూ.. స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు. హెల్మెట్ ధరించండి : ఆలీ ‘తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి. అయితే మోటారుసైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలకు ఆస్కారమివ్వకండి. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి’ అని సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి నిమిషం చాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల్లో ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు హైస్పీడ్ మోటారు సైకిళ్లు కొనిచ్చి, ప్రమాదాలు కొని తెస్తున్నారన్నారు. కమిషనర్‌ను ఆకాశానికెత్తిన ఆలీ స్వచ్ఛ సర్వేక్షణ్ సభలో సినీ నటుడు ఆలీ ఎక్కువ సమయం కమిషనర్ విజయరామరాజును పొగిడేందుకే కేటాయించారు. పాలక మండలి ప్రస్తావన తేకుండా నగరంలో అభివృద్ధి అంతా కమిషనర్ ఒక్కరే చేసినట్లు చెప్పుకొచ్చారు. కమిషనర్‌ను సినీ హీరోలు మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్‌లతో పోల్చి మాట్లాడారు. ఆలీ మాట్లాడిన సమయంలో సగం పైగా కమిషనర్‌ను పొగిడేందుకే వెచ్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..
బరంపురం(ఒడిశా): హెల్మెట్ లేని వాహనాలకు ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయరాదని కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా హెడ్‌క్వార్టర్ ఛత్రపూర్‌లో గల డీఆర్డీఏ సమావేశం హాల్లో జిల్లాస్థాయి రహదారి రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ వినియోగదారులు వాహనాలతో పాటు హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో ప్రెట్రోల్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్‌ను ఆదేశించారు. ఇందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ వ్యవహార శైలిపై కఠినంగా వ్యవహరించాలని కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం మిగిలి ఉన్న 14 రోజులు ప్రజలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలను చైతన్యపరిచేందుకు జిల్లావ్యాప్తంగా చైత్యన్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్, పోలీసు, రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. హెల్మెట్ లేని వాహనాలకు పెట్రోల్ సరఫరా చేసిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎటువంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అయా పోలీసు స్టేషన్ల ఐఐసీ అధికారులు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. ప్రమాదాలు జరిగితే పెట్రోల్ బంకులదే బాధ్యత జాతీయ రహదారిలో సంభవిస్తున్న దుర్ఘటనలపై తగు చర్యలు కూడా వెంటనే తీసుకోవాలన్నారు. ఎస్పీ ఆశిష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ జాతీయ రహదారి లో గల పెట్రోల్ పంపుల్లో ఇంధనం పోసి బయలు దేరిన వాహనాలు దుర్ఘటనలకు గురైతే పెట్రోల్ బంకు యాజమాన్యాలదే బాధ్యతగా పరిగణిస్తామని హెచ్చరించా రు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ట్రాఫిక్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో చర్యలు అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు, మినీ బస్సుల రవా ణా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి తగు ఏర్పాట్లు చేపట్టాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, యాజ మాన్య కమిటీలను ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డీఎస్పీ ఠాకుర్ ప్రసాద్, సంజయ్‌కుమార్ బిశ్వాల్, బరంపురం సబ్–కలెక్టర్ సిద్ధాంత్ స్వంయి, ఛత్రపూర్ సబ్–కలెక్టర్ సుదరక్ సబర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులు గురువారం నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే జరిమానాలు తప్పవన్నారు. తొలుత రూ. 100 జరిమానా విధించనున్నారు. ఆ తర్వాత కూడా హెల్మెట్ ధరించకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ చర్యలను కఠినతరం చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.