ఇకపై హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..
ఇకపై హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..
Published Thu, Aug 3 2017 10:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM
బరంపురం(ఒడిశా): హెల్మెట్ లేని వాహనాలకు ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయరాదని కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా హెడ్‌క్వార్టర్ ఛత్రపూర్‌లో గల డీఆర్‌డీఏ సమావేశం హాల్లో జిల్లాస్థాయి రహదారి రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ వినియోగదారులు వాహనాలతో పాటు హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో ప్రెట్రోల్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్‌పీ ఆశిష్ కుమార్ సింగ్‌ను ఆదేశించారు. ఇందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ వ్యవహార శైలిపై కఠినంగా వ్యవహరించాలని కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఇందుకోసం మిగిలి ఉన్న 14 రోజులు ప్రజలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలను చైతన్యపరిచేందుకు జిల్లావ్యాప్తంగా చైత్యన్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్, పోలీసు, రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. హెల్మెట్ లేని వాహనాలకు పెట్రోల్ సరఫరా చేసిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎటువంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అయా పోలీసు స్టేషన్ల ఐఐసీ అధికారులు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు.
ప్రమాదాలు జరిగితే పెట్రోల్ బంకులదే బాధ్యత
జాతీయ రహదారిలో సంభవిస్తున్న దుర్ఘటనలపై తగు చర్యలు కూడా వెంటనే తీసుకోవాలన్నారు. ఎస్‌పీ ఆశిష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ జాతీయ రహదారి లో గల పెట్రోల్ పంపుల్లో ఇంధనం పోసి బయలు దేరిన వాహనాలు దుర్ఘటనలకు గురైతే పెట్రోల్ బంకు యాజమాన్యాలదే బాధ్యతగా పరిగణిస్తామని హెచ్చరించా రు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ట్రాఫిక్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో చర్యలు అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు, మినీ బస్సుల రవా ణా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి తగు ఏర్పాట్లు చేపట్టాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, యాజ మాన్య కమిటీలను ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డీఎస్‌పీ ఠాకుర్ ప్రసాద్, సంజయ్‌కుమార్ బిశ్వాల్, బరంపురం సబ్–కలెక్టర్ సిద్ధాంత్ స్వంయి, ఛత్రపూర్ సబ్–కలెక్టర్ సుదరక్ సబర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement