సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం గా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే పరిసరాల పరిశుభ్రతతో నగరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నెంబర్ వన్ చేయాలని నగర ప్రజలకు ప్రముఖ సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. గురువారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్‌రోడ్, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్ చేరుకుంది.
ఈ ర్యాలీలో మేయర్ రజనీ శేషసాయి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు పాల్గొన్నారు. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆలీ మాట్లాడుతూ.. అందరూ శుభ్రత పాటించాలన్నారు. ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా వేస్తారన్నారు. ప్రతీ ఒక్కరూ తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. మేయర్ రజనీశేషసాయి మాట్లాడుతూ.. స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు.
హెల్మెట్ ధరించండి : ఆలీ
‘తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి. అయితే మోటారుసైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలకు ఆస్కారమివ్వకండి. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి’ అని సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి నిమిషం చాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల్లో ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు హైస్పీడ్ మోటారు సైకిళ్లు కొనిచ్చి, ప్రమాదాలు కొని తెస్తున్నారన్నారు.
కమిషనర్‌ను ఆకాశానికెత్తిన ఆలీ
స్వచ్ఛ సర్వేక్షణ్ సభలో సినీ నటుడు ఆలీ ఎక్కువ సమయం కమిషనర్ విజయరామరాజును పొగిడేందుకే కేటాయించారు. పాలక మండలి ప్రస్తావన తేకుండా నగరంలో అభివృద్ధి అంతా కమిషనర్ ఒక్కరే చేసినట్లు చెప్పుకొచ్చారు. కమిషనర్‌ను సినీ హీరోలు మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్‌లతో పోల్చి మాట్లాడారు. ఆలీ మాట్లాడిన సమయంలో సగం పైగా కమిషనర్‌ను పొగిడేందుకే వెచ్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment