పీఎం స్వనిధి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న మోదీ
భోపాల్: వీధుల్లో తోపుడు బండ్లపై, ఇతర మార్గాల్లో చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం పెద్ద రెస్టారెంట్ల తరహాలో ఒక ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన పథకం ఒకటి రూపకల్పన దశలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎంస్వనిధి) లబ్ధిదారులను ఉద్దేశించి ఆన్‌లైన్లో మోదీ మాట్లాడారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకోకుండా, డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు.
పీఎం స్వనిధి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పీఎం స్వనిధి లబ్ధిదారులైన ఇండోర్ జిల్లాకు చెందిన చగన్‌లాల్, గ్వాలియర్‌కు చెందిన అర్చన, రాయిసెన్ జిల్లాకు చెందిన దాల్ చంద్ తదితరులతో ప్రధాని మాట్లాడారు. చీపురు కట్టల వ్యాపారంలో మరింత లాభం ఆర్జించేందుకు చగన్‌లాల్‌కు ప్రధాని ఒక సూచన చేశారు. చీపురు కట్టలోని ప్లాస్టిక్ పైప్‌ను తిరిగివ్వాల్సిందిగా వినియోగదారులను కోరాలని, ఆ పైప్‌లను మళ్లీ వాడడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించారు.
పీఎం మత్స్యసంపద యోజన
మత్స్యకారులకు ఉపయోగపడే ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)’ పథకాన్ని నేడు మోదీ ప్రారంభించనున్నారు. ‘ఈ–గోపాల’ అనే యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. బిహార్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment