
నల్లగొండ టౌన్ : కేసీఆర్ కిట్ దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య ఉల్టా, పల్టా అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను అమలు చేయడంతోపాటు ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అమ్మఒడి పథకం కింద తల్లులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పన పెంచడం, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిలో సేవాదృక్పథం పెరిగి బాధ్యతాయుతంగా సేవలను అందిస్తుండడంతో సర్కారు దవాఖానాల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కాన్పుల కోసం చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.
మే నెల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆస్పత్రులలో ఇప్పటివరకు మొత్తం 7,103 కాన్పులు జరగగా, ఒక్క జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే సగానికి ఎక్కువ 4,139 కాన్పులు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదల నుంచి ఉద్యోగులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు సైతం కాన్పుల కోసం ప్రభుత్వ ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో జిల్లాలోన్ని ప్రైవేటు ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య పడిపోతోంది. గర్భం దాల్చిన దగ్గర నుంచి అన్ని రకాల పరీక్షలు, నెలనెలా వైద్యచికిత్సను ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చేస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడానికి ముందు మే నెలలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య 44శాతం ఉండగా, ప్రైవేటు ఆస్పత్రులలో 56శాతంగా ఉంది. అదే విధంగా కేసీఆర్ కిట్ అమలు తరువాత డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య 56 శాతంకాగా, ప్రైవేటు ఆస్పత్రులలో 44శాతానికి పడిపోవడం గమనార్హం.
కిటకిటలాడుతున్న ఎంసీహెచ్
జిల్లా కేంద్రంలో రూ.20 కోట్ల వ్యయంతో జాతీయ ఆరోగ్యమిషన్ ని ర్మించిన 150 పడకల మాతాశిశు ఆ రోగ్య కేంద్రం (ఎంసీహెచ్) గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో కిటకిట లాడుతోంది. ఇన్‌పేషంట్లు నిత్యం 200 నుంచి 300 మంది నమోదవుతోంది. గర్భిణులు వైద్యపరీక్షలకు, కాన్పుల కో సం రోజూ 50 నుంచి 70 వరకు చేరుతున్నారు. ఎంసీహెచ్‌లో ఇన్‌పేషంట్లు రోజూ 200 వరకు ఉంటున్నారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు జరిగితే కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మ ఒడి ద్వారా ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు తల్లి ఖాతాలో వేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య నెలనెల పెరగడం శుభసూచకం, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్నారు. –డాక్టర్ కె.భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్‌ఓ
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన కాన్పులు ఇలా..
నెల ప్రభుత్వ శాతం ప్రైవేటులో శాతం
మే 781 44 975 56
జూన్ 720 40 1100 60
జూలై 842 49 883 51
ఆగస్టు 925 49 960 51
సెప్టెంబర్ 929 48 1004 52
అక్టోబర్ 997 49 1048 51
నవంబర్ 942 49 980 51
డిసెంబర్ 967 56 770 44