ప్రభుత్వాసుపత్రుల్లోనే 50% ప్రసవాలు జరగాలి
► అధికారులకు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం
► 3న సీఎం చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 30–40 శాతంగా ఉన్న ప్రసవాలను 50 శాతానికి పెంచాలని అధికారులను వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ల పథకం సన్నాహాలపై శుక్రవారం సచివాల యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ల పథకాన్ని వచ్చే నెల 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రసవాలు జరిపే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకం కింద గర్భిణుల నమోదు మొదలైందని, ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం జరగాలని చెప్పారు. గర్భిణులకు మూడు విడతల్లో రూ.12 వేల ప్రోత్సా హకం అందిస్తామని, ప్రసవం తర్వాత రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులు గల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఏడాదికి 6.28 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, అన్ని ప్రసూతి కేంద్రాల్లో వైద్య బృందాలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట నిజమేనని, నియామకాలు పూర్తయ్యేలోగా అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ రెడ్డి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వేణుగోపాల్, ఆరోగ్య పథకం సీఈఓ పద్మ పాల్గొన్నారు.