సిటీలో బస్తీ దవాఖానాలు | Basti Hospitals in Hyderabad city | Sakshi
Sakshi News home page

సిటీలో బస్తీ దవాఖానాలు

Published Sat, Dec 23 2017 1:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Basti Hospitals in Hyderabad city - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధానిలో కొత్తగా బస్తీ దవాఖానాలు రానున్నాయి. ప్రయోగాత్మకంగా తొలుత 50 దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సంక్రాంతి లోపు ఐదింటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన 45 ఆసుపత్రులను ఉగాదిలోపు ప్రారంభిస్తారు. నగరాల్లోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌ శాఖలు సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో వెయ్యి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

అలాగే నగరంలో మూడంచెల విధానంలో వైద్య సేవలు అందించనున్నారు. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో ‘ఆరోగ్య హైదరాబాద్‌’లక్ష్యంగా సిటీలో మెరుగైన వైద్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు వైద్య ఆరోగ్య, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల పద్ధతిన వైద్య వ్యవస్థ కొనసాగుతోంది. కానీ హైదరాబాద్‌లో వైద్య సేవల నిర్వహణపై కొంత గందరగోళం ఉంది. అందుకే ప్రజలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మూ డంచెల పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సబ్‌ సెంటర్ల తరహాలో బస్తీ దవాఖానాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు ఉండాలని నిర్ణయించారు. సీహెచ్‌సీలు రెఫరల్‌ దవాఖానాలుగా పనిచేయనున్నాయి.

ఒక డాక్టర్‌..  ఇద్దరు నర్సులు
రాష్ట్ర జనాభాలో మూడో వంతు గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉంది. దీంతో ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ కష్టంగా మారుతోంది. ముఖ్యంగా బస్తీవాసులు సరైన వైద్య సదుపాయాలకు నోచుకోవడం లేదు. అలాంటి 1,400 మురికివాడలను అధికార యంత్రాంగం గుర్తించింది. వీటిలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్క వైద్యశాల లేని బస్తీలు 50 దాకా ఉన్నాయి. తొలుత వీటిలోనే పైలట్‌ ప్రాజెక్టుగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రులలో డాక్టర్, స్టాఫ్‌ నర్సు, నర్సు అందుబాటులో ఉంటారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులను ఇస్తారు. అంతకు మించిన వైద్య సమస్యలు ఉన్న వారిని సమీపంలోని సీహెచ్‌సీలకు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తారు.

 ఈ ఆసుపత్రులను 50 బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిన తర్వాత నగరవ్యాప్తంగా మరో వెయ్యి దవా ఖానాలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం 145 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు(సీహెచ్‌సీ)లు ఉన్నాయి. వీటికితోడు 30 సర్కిళ్లకు ఒక్కోటి చొప్పున కొత్తగా మరో 30 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐదు జోన్లకు ఒక్కోటి చొప్పున ఐదు ప్రాంతాల్లో 100 పడకల స్థాయిలో ఏరియా ఆస్పత్రులను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో కొత్తగా ‘హైదరాబాద్‌ హెల్త్‌ సొసైటీ’ఏర్పాటు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement