
కల్లూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు
- ప్రభుత్వాస్పత్రి సిబ్బందికి డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు ఆదేశం
- ఏజెన్సీలో గతేడాది కంటే గణనీయంగా తగ్గిన డెంగీ కేసులు
- ఆగస్టు 7 నుంచి 17వ తేదీ వరకు ఏజెన్సీలో వైద్య శిబిరాలు
- కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన జిల్లా వైద్యాధికారి
కల్లూరు :
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేలా సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ ఎ.కొండల్‌రావు ఆదేశించారు. కల్లూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బుధవారం మొక్కలు నాటారు. ప్రభుత్వాస్పుత్రుల్లో నెలకు కనీసం వంద కాన్పులైనా జరగాలన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు విష జ్వరాల కేసులు 415 నమోదయ్యాయన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది తగ్గాయని తెలిపారు. గతేడాది 439 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది 15 మాత్రమే నమోదైనట్లు తెలిపారు. వచ్చేనెల 7 నుంచి 17వ తేదీ వరకు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఏజెన్సీలోని 1,932 హ్యాబిటేషన్‌లు ఉండగా 638 హ్యాబిటేషన్‌లలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిలో ఐఆర్‌ఎస్ మందును స్ప్రే చేశామన్నారు. త్వరలో రెండో విడత కూడా పిచికారీ చేస్తామన్నారు. ఒక్కో విడతకు రూ.45 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. దోమలు, క్రిమికీటకాలు, కలుషిత నీటి వల్ల మలేరియా, టైఫాయిడ్, డెండీ, చికున్‌గున్యా, కామెర్లు, డయేరియా వంటì వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా అన్ని శాఖలు సమన్వయంగా నివారణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ కోరారు.
మందులు, సిబ్బంది కొరత లేదు
ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సిబ్బంది కొరత లేదన్నారు. 32 వైద్యలు పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తామన్నారు. కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సీమాన్ సెంటర్‌గా మారుస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 104 వాహనాలు 23 రోడ్డెక్కాయన్నారు. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
– హరితహారంలో భాగంగా కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో డీఎంహెచ్‌ఓ మొక్కలు నాటారు. జిల్లాలో 60 పీహెచ్‌సీలు, 15 క్లస్టర్లు, 509 సబ్‌సెంటర్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంఓ రాంబాబు, ఎస్పీహెచ్‌ఓ ఎల్. భాస్కర్, ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారిణి పద్మజ, డాక్టర్లు మాధవి, శరత్‌బాబు పాల్గొన్నారు.