కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు నూరు శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లోనే పురుడుపోసుకునేందుకు సంబంధిత కుటుంబ సభ్యుల ద్వారా పేషెంట్ పరిస్థితిని తెలుసుకొని, కాన్పు కోసం వారిని 108 వాహనాల్లో తరలించాలన్నారు.
రెండో కాన్పునకు పేరు నమెదు చేసుకున్న మహిళల్లో మొదటి సారి సాధారణ కాన్పు జరిగిన వారి వివరాలను సేకరించాలన్నారు. తద్వారా రెండో కాన్పును కూడా సాధారణ కాన్పుగా జరగడానికి అవకాశం ఉన్నందున ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారికి అవసరమైన పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తికి అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సాధారణ కాన్పుకు దోహదపడుతుందన్నారు.
ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల బరువును సరిచూసి బలహీనంగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారం సరైన పద్ధతిలో అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కవలపిల్లలు ఉన్నట్లుగా పరీక్షల్లో తెలిసిన పక్షంలో ఆ పిల్లలు ఆరోగ్యంగా జన్మించడానికి తీసుకోవలసిన చర్యలపై, పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. న్యూమోనియా లాంటి వ్యాధుల ద్వారా పిల్లలు చనిపోకుండా వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రుల్లో చికిత్సలు అందించాలని ఆయన ఆదేశించారు. న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా మరణాల రేటును తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలు, కార్యకర్తలు తప్పనిసరిగా సాయంత్రం 4.30 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా మంజూరైన 500 అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి టెండర్లు పిలవాలని, అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్తు సరఫరాతో పాటు ఫ్యాన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
210 అంగన్‌వాడీ కార్యకర్తలు ఇతర గ్రామాల నుంచి ప్రతిరోజు వచ్చి వెళ్తుతున్నారని, వారందరు ఈనెల 25వ తేదీ వరకు స్థానికంగా ఉండాలన్నారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవడానికి వివరాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో పీడీ రాములు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరగాలి
Published Sat, Feb 8 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement