ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు  | Growing popularity of cloud kitchens | Sakshi
Sakshi News home page

ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు 

Published Thu, Mar 23 2023 3:18 AM | Last Updated on Thu, Mar 23 2023 3:26 PM

Growing popularity of cloud kitchens - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆకర్షణీయమైన పరిసరాలు.. అద్భుతమైన ఆహా్వనం.. అభిరుచికి తగిన ఆహారం.. అతిథి దేవోభవ అనిపించే సేవలు.. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. గతంలో హోటల్‌కు వెళ్లి తినడాన్ని జనం అంతగా ఇష్టపడేవారు కాదు. కొందరు అదేదో లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు వీకెండ్‌లో కుటుంబంతో సహా రెస్టారెంట్‌కు వెళ్లడం సాధారణంగా మారిపోయింది.

ఆన్‌లైన్‌ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో.. వారంలో రెండు మూడుసార్లన్నా బయట ఆర్డర్‌ చేసి తెప్పించుకోవడమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్‌ బిజినెస్‌ లాభదాయకమనే భావన ఉన్నప్పటికీ..ఆశించిన ఆదరణ లభించకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం మాత్రం ఖాయం.

ఈ నేపథ్యంలోనే ఫుడ్‌ బిజినెస్‌కు సంబంధించి ఓ సరికొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే క్లౌడ్‌ కిచెన్‌. దేశ, విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ఈ క్లౌడ్‌ కిచెన్‌లు ఇప్పుడు హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ప్రారంభమవుతూ ఆదరణ పొందుతున్నాయి. 

ఒక వంటిల్లు.. వందలాది కస్టమర్లు అన్నట్టుగా క్లౌడ్‌ కిచెన్‌ల హవా సాగుతోంది. కరోనా సమయంలో ఇవి ఎక్కువగా పుంజుకున్నాయి.మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పాతిక మించి లేని క్లౌడ్‌ కిచెన్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు..లేదు లేదు అసలు రెస్టారెంట్‌ అన్న భావనకు ఇది పూర్తిగా భిన్నం. హంగూ ఆర్భాటాలు ఏమీ ఉండవు.

రెస్టారెంట్‌ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిలో 1/3 వంతు సరిపోతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సిబ్బంది, తక్కువ వ్యయ ప్రయాసలు..స్పష్టంగా చెప్పాలంటే ఒక్క వంటిల్లు మాత్రమే ఉంటుంది. నో డైన్‌ ఇన్‌..ఓన్లీ డెలివరీ. కూర్చుని తినడానికి వీలుండదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే సప్లై చేస్తారు..అంతే. క్లిక్‌ అయితే ఎక్కువ లాభాలు. ఆదరణ లభించకపోయినా అంతంత మాత్రంగానే నష్టం..ఇదే క్లౌడ్‌ కిచెన్‌ మూల సూత్రం. 

షార్ట్‌ టైమ్‌.. ఫుల్‌ పికప్‌.. 
జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ సృష్టించిన ఈ ట్రెండ్‌ కరోనా విజృంభణ సమయంలో పట్టును దక్కించుకుంది. ఇంటర్నెట్‌ విస్తృత వ్యాప్తి, వ్యాపారంలో సాంకేతికత, ప్రత్యేక యాప్‌ల పెరుగుదల ఇందుకు దోహదపడింది. పెరుగుతున్న యువ జనాభా ఆదాయం, మారుతున్న జీవనశైలి, సులభమైన..  సురక్షితమైన చెల్లింపు మార్గాలు, వంటింట్లో బిజీబిజీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం ఇత్యాదివన్నీ కూడా వీటికి ఆదరణ పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు.

ఇంట్లో వండినట్టుండే ఆహారం నుంచి స్పెషాలిటీ లగ్జరీ డిన్నర్‌ల వరకు ప్రతిదానిని అందించడం ద్వారా క్లౌడ్‌ కిచెన్‌లు ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తక్కువ రేటుతో, నాణ్యమైన భోజనం, నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండటంతో నానాటికీ వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019లో దేశంలో 400 మిలియన్ల డాలర్లుగా ఉన్న క్లౌడ్‌ కిచెన్‌ల వ్యాపారం 2024 నాటికి 2 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎఫ్‌ అండ్‌ బీ (ఫుడ్‌ అండ్‌ బివరేజెస్‌) పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం.  

ఒకేచోట 100కు పైగా..
శాకాహార, ఆరోగ్యకరమైన వంటకాలు, ప్రాంతీయ రుచికరమైన వంటకాలు వంటివి అందించే ఆఫ్‌లైన్‌ రెస్టారెంట్‌ల సంఖ్య పెరగడాన్ని.. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లౌడ్‌ కిచెన్‌ల ఏర్పాటును ఈ ఏడాది చూడవచ్చునని నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జొమాటో వంటివి..క్లౌడ్‌ కిచెన్‌లకు ఆధారంగా ఉన్నప్పటికీ, భారీ కమీషన్ల ఫలితంగా, కొన్ని క్లౌడ్‌ కిచెన్‌లు తమ సొంత యాప్‌లు, సెల్ఫ్‌ డెలివరీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి.

నాగచైతన్య వంటి సినిమా తారలను సైతం ఈ క్లౌడ్‌ కిచెన్స్‌ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని డీఎల్‌ఎఫ్‌ ఏరియా లాంటి ఒకేచోట 100కు పైగా క్లౌడ్‌ కిచెన్‌లు ఉన్నాయంటే వీటికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సినీహీరో నాగచైతన్య ఏర్పాటు చేసిన ‘షోయు’ ఇప్పటికే బాగా ట్రెండింగ్‌లో ఉంది.   

ట్రెండ్‌ను మేం ముందే ఊహించాం..     
పాతికేళ్లుగా మేం మిఠాయిల తయారీలో ఉన్నాం. ఈ ట్రెండ్‌ని ముందే ఊహించి సహదేవ్‌రెడ్డి టిఫిన్స్‌ పేరుతో క్లౌడ్‌ కిచెన్‌ అందరికీ తెలిసే సమయానికే మేం ప్రారంభించాం. సౌత్‌ ఇండియన్‌ బ్రేక్‌ ఫాస్ట్, చాట్‌ వంటివన్నీ డెలివరీ చేస్తాం. మా కిచెన్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంది.

తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్‌ చేసి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ నిర్వహిస్తాం. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆర్డర్స్‌ వస్తున్నాయి. వ్యయ ప్రయాసల పరంగా చూస్తే ఇది చాలా మంచి వ్యాపారం. గృహిణులు, యువత దీన్ని బాగా అందిపుచ్చుకుంటున్నారు.
–పి.అభి షేక్‌రెడ్డి, సహదేవ్‌రెడ్డి టిఫిన్స్‌ 

దూకుడు పెరగడం ఖాయం
మొదట్లో కొన్ని ఐటమ్స్‌కే పరిమితమైనా ఇప్పుడు రెస్టారెంట్‌లో దొరికే వెరైటీలన్నీ అందిస్తున్నాయి. బిర్యానీల కోసం ఒకటి, పరోటాల కోసం ఒకటి, బర్గర్స్, పిజ్జాల కోసం, స్వీట్స్, పేస్ట్రీల కోసం.. ఇలా దేనికదే ప్రత్యేక కిచెన్స్‌ వచ్చేశాయి. అపరిమితమైన కస్టమర్స్‌ బేస్‌ అవకాశాల వల్ల వీటి దూకుడు ఇంకా పెరగడం తథ్యం.   
–సంకల్ప్, హైదరాబాద్‌ ఫుడీస్‌ క్లబ్‌ 

హైదరాబాద్‌ టాప్‌... 
గత కొంత కాలంగా రెస్టారెంట్‌ వ్యాపారంలో ఉన్న మేం లగ్జరీ డైనింగ్‌ను కెఫెల ద్వారా అందిస్తున్నాం. మా బ్రాండ్‌కు ముంబయి, బెంగళూరు, చెన్నై సహా ప్రతిచోటా క్లౌడ్‌ కిచెన్స్‌ కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాకు ఆదరణ చాలా స్పీడ్‌గా పెరిగింది. బంజారాహిల్స్, గచ్చిబౌలి , ఎల్బీనగర్‌... ఇలా 4 చోట్ల మా కిచెన్స్‌ నిర్వహిస్తున్నాం.   
–భాను, లూయిస్‌ బర్గర్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement