‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?
తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్‌కి వెళ్లినా, ఔటింగ్‌కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!
∙సంహిత నిమ్మన
ప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్‌స్టవ్‌ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్‌లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్‌లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.
రోజూ ఉదయాన్నే కిచెన్‌లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్‌లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.
అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!
అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్‌గా, సర్వెంట్‌గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్‌ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి.
ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్‌వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్‌కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్‌లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్‌కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్‌డ్ ప్రొడక్ట్స్‌ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్‌తో ఎల్‌జీ స్మార్ట్ వర్షన్స్‌కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్‌జీ కంపెనీ.
ఇక స్మార్ట్ ఎల్‌జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్‌తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్‌ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడిస్తున్నాయి.
పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్
ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్‌గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్‌కి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
కుకింగ్ రోబో
వంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్‌తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్‌ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్‌లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్‌తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.
హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్
ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్‌గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్‌మెంట్‌లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్
ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.
న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్
ఈ డివైస్‌తో ఆరోగ్యకరమైన స్మూతీస్‌ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్‌తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్‌నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.
సీర్ పర్ఫెక్టా గ్రిల్
బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్‌లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్‌కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.
స్టెయిన్‌లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్
హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్‌డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్‌తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్‌తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్‌ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్‌ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్‌షేక్స్‌తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్‌లో జ్యూసర్ యూనిట్‌తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్‌లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.
ఫుడ్ స్కానర్
ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్‌కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్‌కేర్‌కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.
త్వరలోనే ఏఐ రోబో షెఫ్!
మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్‌మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్‌కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్‌ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్‌లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా!
Comments
Please login to add a commentAdd a comment