సాక్షి, ఒంగోలు: ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా..పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగానే ఉంటోంది. జనాభా ప్రాతిపదికన ప్రతీ 10 వేల మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ జిల్లాలో ప్రతీ 15 వేల మందికి ఒకరు లేకపోవడం గమనార్హం. వైద్యారోగ్యశాఖకు కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా నిధులు విడుదల చేస్తోంది. జిల్లాకు ఏటా రూ.20 కోట్లు అందుతున్నాయి.
ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం పంచాయతీకి రూ.10 వేలు చొప్పున 880 గ్రామాలకు రూ.88 లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. గ్రామాల్లో అపరిశుభ్రత, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు ఏటా ప్రబలుతూనే ఉన్నాయి. జననీ సురక్ష యోజన (జేఎస్‌వై), జననీ శిశుసంరక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే) కింద
గర్భిణులకు కాన్పుల
కోసం ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నా.. ఇవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. ఇక జిల్లాలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆస్పత్రులు 37 ఉన్నాయి. వీటిపై ఏటా రూ.కోటి వరకు ఖర్చుచేస్తున్నా.. వీటిల్లో కాన్పులు చేసుకునే వారి సంఖ్య ఏటా తగ్గిపోతూనే ఉంది.
గణాంకాలు చెబుతున్నదేమిటంటే..
జిల్లా జనాభా 33,92,764 మంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది ప్రజలుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 85 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 550 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి.
85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 280 మంది వైద్యులకు గాను ప్రస్తుతం 200 మందే ఉన్నారు.
804 గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. ఇక్కడ ఆశ వర్కర్‌లు, ఏఎన్‌ఎంలే దిక్కు.
ఉత్సవ విగ్రహాలే..
జిల్లాలో 37 కేంద్రాల్లో గర్భిణులకు ఆపరేషన్‌లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి 24 గంటలు సేవలందించాలి. ఇక్కడి కేంద్రాల్లో ఆపరేషన్‌లు జరగకపోయినా ఏటా కోట్లల్లో ఖర్చులు చూపిస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద ఈ ఏడాది రూ.30 కోట్లు రాగా, అధికారులు ఖర్చుచేసింది రూ.25 కోట్లు. వీటి ఖర్చుకు సంబంధించి పీహెచ్‌సీల నుంచి నివేదికలు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మత్తువైద్యులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది కొరతతో ఆపరేషన్‌లు జరగడం లేదు. పరికరాలూ అందుబాటులో లేవు.
తగ్గని మాతాశిశు మరణాలు
మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గిం చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యఆరోగ్యశాఖ నుంచి ప్రయత్నిస్తున్నాయి. 24 గంటల సీమాంక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతీ గ్రామపరిధిలో అంగన్‌వాడీ ఆశవర్కర్‌తో పాటు ఏఎన్‌ఎంను నియమించారు. వీరు గ్రామీ ణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణుల వివరాలను నమోదుచేసి.. వారికి కాన్పుచేసి ఇంటికి వెళ్లేంత వరకు బాధ్యత తీసుకోవాలి.
దీనికోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద జేఎస్‌ఎస్‌కే (జననీ శిశుసంక్షణ కార్యక్రమం), జేఎస్‌వై (జననీ సురక్షయోజన) పథకాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా రు. జిల్లాలో మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. 2013-14 సంవత్సరంలో మాతృమరణాలు 127, శిశుమరణాలు 39 సంభవించాయి. గడచిన తొమ్మిది నెలల కాలంలో రెండూ కలిపి సుమారు 200 పైగానే ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొనడం గమనార్హం.
ప్రైవేటు వైపు ఎందుకు...?
ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా, సిజేరియన్‌లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నారు. అయినా ఎక్కువగా ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి.
దీనికితోడు ఆర్‌ఎంపీలు ఒక్క కేసును గ్రామం నుంచి పంపితే రోగి ఇచ్చే ఫీజులో 40 శాతం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని సూచిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇందుకు ఒక్కో కేసుకు కొంతమొత్తంలో ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో అనుమతుల్లేని ఆస్పత్రుల్లో ఆపరేషన్‌లు చేస్తున్నా.. వైద్యారోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరం.
ప్రసవ వేదన
Published Mon, Sep 29 2014 5:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement