ప్రతీకాత్మక చిత్రం
ఢాకా : బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల వివాహితకు ప్రసవం చేసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. తమ సర్వీసులో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే... బంగ్లాదేశ్‌లోని నైరుతి ప్రాంతంలోని జస్సోర్ జిల్లాకు చెందిన వివాహిత కొన్ని రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అయితే 26 రోజుల తర్వాత మళ్లీ నొప్పులు రావడంతో ఆస్పత్రికి రాగా వైద్యులు ఆమెను పరీక్షించారు. ఇందులో భాగంగా ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే సిజేరియన్ నిర్వహించి కవలల(అమ్మాయి, అబ్బాయి)ను బయటికి తీశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని, మంగళవారమే వాళ్లను డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం గురించి జెస్సోర్ ప్రభుత్వాసుపత్రి చీఫ్ దిలీప్ రాయ్ మాట్లాడుతూ.. ‘ 30 ఏళ్ల మెడికల్ సర్వీసులో ఇలాంటి అద్భుత ఘటన చూడలేదు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరం. అయితే మొదటిసారి డెలివరీ చేసినపుడు ఈ విషయాన్ని గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖుల్నా ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉన్నా వారినెలా సాకాలో అర్థం కావడం లేదంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రోజూవారీ కూలీ అని.. నెలకు కేవలం 1200 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడని పేర్కొంది. అయితే ఆమె భర్త మాట్లాడుతూ.. ‘అల్లా దయ వల్ల నా పిల్లలు క్షేమంగా ఉన్నారు. వారిని సంతోషంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని తండ్రి ప్రేమను చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment