సాక్షి, చెన్నై : డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలను బలిగొంది. గర్భిణికి సిజేరియన్ చేసిన వైద్యులు గుడ్డముక్కను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లు వేశారు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ‘కడలూర్ జిల్లా విరుదాచలం ప్రభుత్వాస్పత్రిలో ప్రియా(24)కు సిజేరియన్ చేసిన వైద్యులు ఆడ శిశువుకు పురుడు పోశారు. అయితే, మూడు రోజుల అనంతరం ప్రియా అనారోగ్యం పాలైంది. కడుపులో తీవ్రమైన నొప్పిగా ఉందని చెప్పింది. నా భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులకు చెప్పినా స్పందించలేదు’అని రాజ్‌కుమార్ ఆరోపించారు.
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన భార్యను పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మెర్)కు తరలించామని రాజ్‌కుమార్ వెల్లడించాడు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియా ప్రాణాలు విడిచిందని అతను కన్నీరుమున్నీరయ్యాడు. ప్రియా పొట్టలో గుడ్డముక్క ఉండటం వల్లే చనిపోయిందని జిప్‌మెర్ డాక్టర్లు చెప్పారని ఆయన తెలిపాడు. కాగా, విరుదాచలం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకంపై రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ ఘటనపై స్పందించింది. నివేదిక సమర్పించాలని విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment