రేడియాలజీ... సో లేజీ..!
► జీజీహెచ్‌లో అందుబాటులో ఉండని వైద్యులు
► పీజీ వైద్య విద్యార్థులతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు
► స్కానింగ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి
సాక్షి, గుంటూరు : అక్కడ వ్యాధి నిర్ధారణ చేయాలంటే గర్భిణులు, రోగులైనా రోజుల తరబడి స్కానింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిందే.. వైద్యుల సిఫార్సు లెటర్లు తీసుకెళ్లినా అక్కడి వారికి లెక్కలేదు.. మధ్యాహ్నం దాటిందంటే వైద్యులు అందుబాటులో ఉండరు.. సొంత క్లీనిక్‌లకు వెళ్లిపోతుంటారు... ఇక రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటే పీజీ విద్యార్థులే దిక్కు. గుంటూరు జీజీహెచ్‌లోని రేడియాలజీ విభాగంలో నిత్యం జరుగుతున్న తంతు.
గుంటూరు జీజీహెచ్‌కు నవ్యాంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల నుంచి రోగులు పరీక్షలు, వైద్య సేవల కోసం వస్తుంటారు. ముందుగా వైద్యుల వద్ద చూపించుకుని వ్యాధి నిర్ధారణ కోసం ఆల్ట్రాసౌండ్‌స్కాన్, సిటీస్కాన్‌ల వద్దకు రోగులు బారులు తీరుతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి అక్కడకు వచ్చే రోగులకు స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. అసలే అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు స్కానింగ్‌ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
ఇక్కడకు వచ్చే రోగులకు మూడు నుంచి ఐదు రోజులు గడువు విధిస్తున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గడువు తేదీకి వచ్చి స్కానింగ్ చేయించుకున్న మళ్లి ఆ రిపోర్టు వారికందాలంటే మరో రెండురోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడి వైద్యాధికారులు స్థానికంగా ఉండకపోవడంతో వారు వచ్చి రిపోర్టులు ఇచ్చే వరకు వీరు వేచి ఉండాల్సిందే. జీజీహెచ్‌లో అనేక సందర్భాల్లో దీనిపై రోగులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓపీ సమయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉండే రేడియాలజీ విభాగం వైద్యులు మధ్యాహ్నం తరువాత కంటికి కనిపించరు. స్కానింగ్ సెంటర్‌లో పీజీ వైద్యులు, సిబ్బంది మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
స్కానింగ్ సెంటర్ల వద్ద ప్రసవ వేదనలు
ఓ పక్క ప్రభుత్వం ఆస్పత్రి ప్రసవాల రేటును పెంచాలని ప్రయత్నాలు సాగిస్తుంటే జీజీహెచ్‌లో కొన్ని విభాగాల వైద్యుల నిర్లక్ష్యం వలన ఇది నీరుగారుతోంది. జీజీహెచ్‌లో ప్రస వం కోసం వచ్చే గర్భిణులు ప్రసూతి విభాగంలో వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు ఆల్ట్రాస్కాన్ చేయించుకునేందుకు రేడియాలజీ విభాగానికి వెళ్లడం అక్కడ గంటల తరబడి వైద్యుల కోసం వేచి చూడడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది మేలో పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గర్భిణి దోమరవరపు లావణ్య, ప్రసూతి విభాగంలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోమని ప్రసూతివిభాగం వైద్యులు ఆమెకు సూచిం చారు.
అక్కడకు లావణ్య గంటల పాటు వైద్యుల కోసం వేచి చూసి నొప్పులు అధికమై స్కానింగ్ గది ముందు నేలపై ప్రసవించింది. తాజాగా గుంటూరు నగరంలోని అరండల్‌పేటకు చెందిన సంధ్యారాణి స్కానింగ్ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు స్కానింగ్ సెంటర్ వద్ద పడిగాపులు కాసి వైద్యుల నిర్లక్ష్యంపై జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు జీజీహెచ్ అధికారులు కమిటీని నియమించారు. ఇప్పటికైనా రేడియాలజీ విభాగం వైద్యులు నిర్లక్ష్యం వీడి వ్యాధి నిర్ధారణ పరీక్షలను త్వరితగతిన నిర్వహించి రోగులకు ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.