ఆడ పిండానికి అబార్షన్ గండం
- నగరంలోని పలు ఆస్పత్రుల్లో కొనసాగుతున్న అమానుషం
- కాసులకు కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్లు
- కన్సల్ట్ వైద్యులతో గుట్టుగా సాగిస్తున్న దందా
ఎంజీఎం, న్యూస్‌లైన్ : తల్లి కడుపులో ఎదుగుతున్న ఆడ పిండాలను అబార్షన్ గండం వెంటాడుతోంది. ఆడ శిశువుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా గర్భస్త ఆడ శిశువుల హననం కొనసాగుతోంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే తల్లి కడుపులో ఆడ పిండాల ఆయువు తీస్తున్నారు. జిల్లాలో లైంగిక నిష్పత్తిలో సమతుల్యం దెబ్బతింటోందని స్వచ్ఛంద సంస్థలు, మీడియా గగ్గోలు పెడుతున్నా కొందరు వైద్యులకు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులకు పట్టడం లేదు. కాసుల కోసం కక్కుర్తిపడి ఆడపిల్లను వద్దనుకునేవారికి అబార్షన్ చేస్తున్నారు. వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. హన్మకొండలోని హనుమాన్‌నగర్(పెగడపల్లి డబ్బాలు)లో బుధవారం రాత్రి ‘సాక్షి’ సమాచారంతో మహాలక్ష్మి క్లినిక్‌లో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
నగరంలో భ్రూణ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. స్కానింగ్‌లో ఆడ పిల్ల అని తేలగానే తల్లిదండ్రులు అబార్షన్ కోసం తాపత్రయపడుతున్నారు. గ్రామాల్లోనైతే కొందరు ఆర్‌ఎంపీలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగర శివార్లలోని పలు ఆస్పత్రుల్లో అబార్షన్లు చేయిస్తున్నట్లు తెలిసింది. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆర్‌ఎంపీలు మగపిల్లలు కావాలనుకునే గర్భిణీలకు హన్మకొండ భీమారంలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయిస్తున్నట్లు రెండు నెలల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సాక్షిలో డిసెంబర్ 20, 2013న కథనం ప్రచురించినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
లింగ నిర్ధారణతోనే..
కాసులకు కక్కుర్తిపడి నగరంలోని కొన్నిస్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డాక్టర్లకు సహకరిస్తున్నారు. స్కానింగ్ చేసిన సమయంలో ఆడ, మగా అని లింగ నిర్ధారణ చేయడం నేరమైని తెలిసినా కొంద రు పెడచెవిన పెడుతున్నారు. అక్రమ సంపాదన కోసం అర్రులు చాస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణ కొరవడడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. స్కానింగ్ సెంటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పలువురు పలుకుబడి ఉన్న వ్య క్తులు అడ్డుకోవడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న క్లినిక్‌లు
నగర పరిధిలో పుట్టగొడుగుల్లా అనుమతి లేని క్లినిక్‌లు నడుస్తున్నాయి. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేయడంతోపాటు ఏకంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. అబార్షన్ కేసులో చిక్కిన మ హాలక్ష్మి క్లినిక్‌ను సదరు వైద్యురాలు 15 ఏళ్లుగా ఎలాం టి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఆయుర్వేద వైద్యురాలైన డాక్టర్ ప్రమీలాకుమార్ ఎలాంటిఅర్హత లేకుండానే గైనకాలజిస్టుగా చెలామణి అవుతూ శస్త్రచికిత్సలు చేస్తున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మహాలక్ష్మి క్లినిక్ సీజ్ చేస్తాం : డీఎంహెచ్‌ఓ
ఆనుమతి లేకుండా క్లినిక్ నిర్వహించడమేగాక భ్రూణ హత్యకు పాల్పడిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ప్రమీల కుమార్ వ్యవహారంపై విచారణ జరుగుతుందని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. మహాలక్ష్మి క్లినిక్‌కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయుర్వేద వైద్యురాలు శస్త్రచికిత్స చేయడానికి వీలు లేదని, ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేసే మెరుగైన సౌకర్యాలు కూడ ఏమీ లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో పెషంట్లు డిశ్చార్జ్ అయిన వెంటనే ఆస్పత్రిని సీజ్ చేస్తామని తెలిపారు.