‘నేను..ఆడ బిడ్డని. అందరికీ అండగా నిలిచేదాన్ని. కష్టసుఖాల్లో పాలుపంచుకునేదాన్ని. ఈ లోకం నన్ను చిన్నచూపు చూస్తోంది. అమ్మతనంతో ఆనందపడే కొందరి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటోంది. కొడుకుపై మోజుతో, మాపై కక్ష పెంచుకుంటోంది. కళ్లు తెరవకముందే కాటికి పంపేస్తోంది. కాల‘గర్భం’లో కలిపేస్తోంది. ప్రాణంపోసే బ్రహ్మ కూడా కనికరించడంలేదు. కాసుల కోసం కొందరు వైద్యులు కత్తులు దూస్తున్నారు. ‘ఆడ’నే విచ్ఛిన్నం చేసి ఇంటి వెలుగును దూరం చేస్తున్నారు. భవిష్యత్‌ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. మీరైనా చెప్పండి. ఆడబిడ్డ ప్రాణాలు నిలపండి’.
చిత్తూరు అర్బన్ :జిల్లాలో భ్రూణ హత్యలు పెచ్చుమీరుతున్నాయి. కొందరు విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడబిడ్డ అని తెలియగానే అబార్షణలు చేసేస్తున్నారు. రెండు రోజుల కిందట చిత్తూరు నగరంలో కేంద్ర బృందం సభ్యులు కొన్ని స్కానింగ్ సెంటర్ల నిర్వాకాన్ని బట్టబయలు చేయడం జిల్లాలో సంచలనం రేపుతోంది.
భవిష్యత్.. భయానకం
జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 872 మంది మాత్రమే (6 సంవత్సరాల్లోపు వయసున్న వాళ్లు) ఆడపిల్లలు ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్‌లో ఎదురయ్యే ప్రమాద ఘంటికల్ని తెలియజేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న 15 ఏళ్లలో ప్రతి పది మంది మగాళ్లలో ఆరుగురికి మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయి.
నిద్దరోతున్న నిఘా
అమ్మకడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా..? ఎదుగుదల ఎలా ఉందో చెప్పాల్సిన స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గర్భంలో ఉన్న బిడ్డ ఆడో మగో చెప్పి.. ఆడపిల్ల అయితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేసేస్తున్నారు. దీనిపై నిత్యం నిఘా ఉంచాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ నిద్దరోతోంది. కేంద్ర బృంద సభ్యులు చిత్తూరు లాంటి నగరంలో దాడులు చేసి ఇక్కడ జరుగుతున్న భ్రూణహత్యల (అబార్షన్లు) బాగోతాన్ని బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
చట్టం వాళ్లకు చుట్టం
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం–1994 ప్రకారం మహిళ కడుపులో ఏ బిడ్డ పెరుగుతోం దో చెప్పడం నేరం. పిల్లల్లో ఎదుగుదల, జన్యుపరమైన ఇబ్బందులు, గర్భస్థ శిశు సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే స్కానింగ్ చేయాలి. దీన్ని పర్యవేక్షించడానికి కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యదర్శిగా పది మందితో కూడిన ఓ కమిటీ పనిచేస్తోంది. స్కానింగ్ సెం టర్లు నిర్వహిస్తున్న ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులు విధిగా జిల్లా వైద్యశాఖ వద్ద అనుమతి పత్రం తీసుకుని, ప్రతి ఐదేళ్లకోసారి లైసెన్సును రెన్యూవల్ చేసుకోవాలి. పీజీ చేసిన వైద్యులు, గైనకాలజిస్టులు, రేడియోలజిస్టులు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషినర్స్ మాత్రమే స్కానిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసినా, భ్రూణ హత్యలు చేసినా స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేయడంతో పాటు వైద్యుల్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించాలి. నేరం రుజువైతే మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. జిల్లాలోని మదనపల్లె, తిరుపతి, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు ఈ చట్టాన్ని తమ చుట్టంగా మార్చేసుకున్నారు. రాజకీయ పలుకుబడి అండగా పెట్టుకుని పబ్లిక్‌గానే లింగ నిర్ధారణ చేయడం, ఆడపిల్ల వద్దనుకునేవాళ్లకు అబార్షన్లు చేయడమే వృత్తిగా కొందరు వైద్యులు వ్యాపారం చేస్తున్నారు.
ఇదో వ్యాపారం
సామాజిక చైతన్యంలేని వాళ్లల్లో చాలా మంది ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాకు ఆనుకుని ఉన్న తమిళనాడులోని పొన్నై, తంగాల్, పళ్లిపట్టు, తిరుత్తణి లాంటి ప్రాంతాల నుంచి పలువురు గర్భిణులు లింగ నిర్ధారణ కోసం చిత్తూరు, తిరుపతిలాంటి ప్రాం తాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడున్న మధ్యవర్తుల ద్వారా లింగ నిర్ధారణ కోసం రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తూ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వచ్చే ఫీజులో వైద్యులు 20 శాతం మధ్యవర్తికి చెల్లిస్తున్నారు. తీరా కడుపులో ఉన్నది ఆడ బిడ్డ అని తెలియగానే అక్కడికక్కడే అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇందుకు మరో రూ.10 వేల వరకు చెల్లిస్తున్నారు.
చట్టరీత్యా చర్యలు
గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా ప్రజల ఆలోచనలో మార్పురావాలి. ఆడపిల్ల మనజాతికి పునాది అని గ్రహించాలి. అనుమతుల్లేని స్కానింగ్ సెంటర్లను గుర్తించేందుకు కలెక్టర్‌తో మాట్లాడి టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేస్తాం. నిర్వాహకులపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ స్వర్ణ విజయగౌరి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment