కడపలోని ఓ మురికి కాలువలో పసిగుడ్డును పడేసిన దృశ్యం (ఫైల్)
తల్లి కడుపులో ఉన్నది ఆడా.. మగా అని తెలుసుకోవడం చట్ట విరుద్ధం. ఇదేవిషయాన్ని పీసీ– పీఎస్‌డీటీ చట్టం –2003 స్పష్టం చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖఅధికారుల పర్యవేక్షణ లేమిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేట్, డయాగ్నస్టిక్,స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలుచేస్తున్నారు. దీంతో బలవంత అబార్షన్లు, భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి.
⇔ ప్రొద్దుటూరులోని గాంధీరోడ్డులో ఉన్న ఓ స్కానింగ్ కేంద్రంలో ఇప్పటికి యదాతథంగా తీస్తున్నారు. చాలా ఏళ్లుగా స్కానింగ్ విషయంలో ఆ కేంద్రానికి పెద్దపేరు కూడా ఉంది.
⇔ మైదుకూరు, రాయచోటి ప్రాంతంలోని ఒకటి, రెండు కేంద్రాల్లోస్కానింగ్ సాగుతోంది.
⇔ జనవరి 18న కడపలోని ఓ వీధిలో నెలలు నిండని పసిగుడ్డును కాలువలో పడ వేశారు.
⇔ అదే నెలలో జమ్మలమడుగు సమీపంలో ముళ్లపొదల్లో పసిగుడ్డును వదిలి వెళ్లారు. ఆడపిల్ల కావడంతోనే అలా చేశారని చూసిన వారందరూ అంటున్నారు.
సాక్షి, కడప : పసిగుడ్డులతో కొంతమంది పరిహాసాలు ఆడుతున్నారు.. లింగ నిర్ధారణపై నిషేధం ఉన్నా....అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని కేంద్రాలు గుట్టుచప్పుడు కాకుండా స్కానింగ్ చేస్తున్నాయి. ఒక్కో స్కానింగ్‌కు రూ. 3–5 వేలు వసూలు చేస్తూ ఊడ్చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పరీక్షల ద్వారా తెలుసుకుని గర్భంలోనే శిశువును చిదిమేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా తప్పని పరిస్థితి తలెత్తిన సమయంలో బిడ్డ జన్మించిన కొన్ని గంటల్లోనే చెత్తకుప్పల్లో పడేస్తున్న ఘటనలు కూడా ఇటీవల జిల్లాలో కనిపించాయి. జిల్లాలో రోజు రోజుకు ఆడపిల్లల సంఖ్య గణనీయంగా క్షీణిస్తోంది. ప్రతి వెయ్యి మంది మగబిడ్డలకు 918 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లాలో పెరుగుతున్న స్కానింగ్ కేంద్రాలు
జిల్లాలో పుట్ట గొడుగుల్లా డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. నగరం మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వీటిని నెలకొల్పుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు నమ్మకంగా వచ్చే వారికి స్కానింగ్ నిజాన్ని బయటపెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అధికారుల నుంచి సమస్య ఉంటుందని భావించి కొందరు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో సుమారు 345 డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పిండ లింగ నిర్థారణ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
నిర్దారణ చేసినట్లు నిరూపణ అయితే శిక్ష
స్కానింగ్ సెంటర్‌కు అనుమతులు ఉన్నా లేకున్నా గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చేయడం తీవ్రమైన నేరం. చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిరూపితమైన మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడంలేదు. దీంతో కొన్ని సెంటర్లలో ఇష్టానుసారంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. పరీక్షలు గైనకాలజిస్టు, రేడియాలజిస్టు లాంటి ఇతర కీలక వైద్యులు మాత్రమే నిర్వహించాలి. కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో ఉన్న వారే చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ అంతంత మాత్రమే
గర్భంలోఉండగా కొందరు..జన్మించిన తర్వాత మరికొందరు చిన్నారులను చిదిమేస్తుండడంతో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. పుడుతున్న ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. 2015–16లో 1000కి 900 మాత్రమే ఆడపిల్లల సంఖ్య నమోదైంది. ఇప్పటికీ వీరి నిష్పత్తి అంతంత మాత్రంగానే ఉందని గణంకాలు తెలుపుతున్నాయి.జిల్లాలోని 20 గ్రామాల్లో కౌన్సెలర్లను నియమించి ఆడపిల్లల సంఖ్య పెంపునకు కృషి జరుగుతోంది.
తాజా ఘటనలు..
కడప నగరంలోని బీకేఎం స్ట్రీట్ సమీపంలోని మురుగు కాలువలో కనిపిస్తున్న ఈ పసిగుడ్డు ఎవరో... ఎందుకు వేశారో తెలియదు. కానీ తెలిసిందల్లా ఒక్కటే... పసిగుడ్డును వదిలించుకోవడం. అందుకే కాబోలు కాలువలో విసిరేసి వెళ్లిపోయారు. జనవరి మూడో వారంలో మురికి కాలువలో తేలుతూ కనిపించిన ఆ పసిగుడ్డును చూసిన అందరూ అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.జమ్మలమడుగులో కూడా పురిటిబిడ్డను ఇలానే కంపచెట్ల మధ్య వదిలేశారు.ఇవి బయటపడినవి. ఇంకా తెలియనివి ఎన్నో ఉంటాయి.
లింగ నిర్దారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు
చట్టరీత్యా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. అందుకు వ్యతిరేకంగా వ్యవహారిస్తే అలాంటి కేంద్రాలను మూసివేస్తాం. వారిపై కఠిన చర్యలను చేపడతాం. అలాగే ఆడ శిశువు ఉందని అబార్షన్లు చేయడం కూడా నేరం. ఈ విషయంలో పెద్దలు కూడా ఆలోచించాలి. లింగ నిర్దారణ పరీక్షలకు దూరంగా ఉండాలి. స్కానింగ్ కేంద్రాలు, వైద్యులు కేవలం గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే కృషి చేయాలి. – డాక్టర్ ఉమాసుందరి,- జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, వైఎస్సార్ కడపజిల్లా
Comments
Please login to add a commentAdd a comment