సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పీసీపీఎన్‌డీటీ జాతీయ తనిఖీ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం మరోసారి బయటపడింది. మూడు జిల్లాల్లోనూ పది సెంటర్లను తనిఖీ చేయగా వీటిలో ఐదు సెంటర్లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఆయా సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఒక కార్పొరేట్ ఆస్పత్రి సహా శివారులోని పలు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 800పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాల్లో 522, మేడ్చల్ జిల్లాలో 600పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి.
అధికారులు ఇప్పటికే వీటిల్లో తనిఖీలు నిర్వహించి, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులతో పాటు రేడియాలజిస్టులు లేని, రికార్డులు సరిగా నిర్వహించని స్కానింగ్ సెంటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. గతంలో 30పైగా సెంటర్లను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్రవీడక పోవడం వల్లే జాతీయస్థాయి బృందాలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ దాడుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూపలు కేంద్రాలు అడ్డంగా దొరికిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment