గర్భస్థ స్కానింగ్‌ల దుర్వినియోగానికి చెక్
నిఘాకు నోడల్ అధికారి నియామకానికి ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గర్భస్థ స్కానింగ్‌ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం గర్భిణిల ఆయా స్కానింగ్‌ల నివేదికలను తప్పనిసరిగా జిల్లా వైద్యాధికారికి పంపాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఈ నిబంధనను పాటించాల్సి ఉన్నా రాష్ట్రంలో ఇది ఎక్కడా అమలు కావట్లేదు. దీంతో సర్కారు తాజాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థకు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో స్కానింగ్ నివేదికలు పంపాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
లింగ నిర్ధారణ కోసం స్కానింగ్‌లు...: రాష్ట్రంలో ఏటా 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిల్లో 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకుంటుండగా మిగిలిన వారు ఇళ్ల వద్ద ఏఎన్‌ఎంలు, ఇతరుల సమక్షంలో కాన్పులు చేయించుకుంటున్నారు. ప్రతి గర్భిణీకి మూడు సార్లు స్కానింగ్ చేస్తారనుకుంటే ఆ ప్రకారం ఏటా సుమారు 20 లక్షల స్కానింగ్‌లు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. చాలా మంది తల్లిదండ్రులు స్కానింగ్ కేంద్రాల్లో వైద్యులకు డబ్బు ఆశజూపి తమకు పుట్టబోయేది ఆడ బిడ్డో, మగ బిడ్డో తెలుసుకుంటున్నారు.
కొన్ని స్కానింగ్ సెంటర్లు దాన్నో వ్యాపారంగా మార్చుకున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. పుట్టేది ఆడ బిడ్డయితే కొందరు అబార్షన్ చేయిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ చర్యల వల్ల స్త్రీ, పురుష నిష్పత్తిలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. దీంతో నిబంధనలను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 100, ప్రైవేటు రంగంలో ఉన్న 2,900 అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఇకపై గర్భస్థ స్కానింగ్‌లు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు నింపి ప్రతి నెలా వాటిని జిల్లా వైద్యాధికారికి పంపాలి. ఇక నుంచి దీన్ని ఆన్‌లైన్ చేయనున్నారు.