గర్భశోకం
- స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ
– ఆడ పిల్లని తెలిస్తే అబార్షన్లు
– గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం
- ‘అనంత’లో శ్రుతిమించిన వైనం
– ఫిర్యాదులొస్తేనే దాడులంటున్న ఆరోగ్యశాఖ
అనంతపురం మెడికల్ : కూడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (30)కు ఇద్దరు కుమార్తెలు. కుమారుడు కావాలన్న అత్తమామలు, భర్త కోరిక మేరకు మూడోసారి గర్భం దాల్చింది. స్కానింగ్ చేయించుకుంటే ఆడ పిల్లని తేలింది. దీంతో అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ నుంచి తాడిపత్రి బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు.
అనంతపురం ఎర్రనేలకొట్టాలలో ఓ చిన్నపాటి క్లినిక్ ఉంది. ఇందులో యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్నారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ‘బేరం’ కుదుర్చుకుని దందా సాగిస్తున్నారు. ఈ విషయం వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. అయినా చర్యలు లేవు.
ఆడపిల్ల పుడితే ‘మా ఇంటి మహాలక్ష్మి’ అనుకునే రోజులు పోయాయి! కొడుకే ‘వంశోద్ధారకుడు’ అన్న ధోరణి ఇంకా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. గర్భం దాల్చాక ముందుగానే లింగ నిర్ధారణ చేసి ఆడపిల్లను కడుపులోనే చంపేస్తున్నారు! వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు జిల్లాలో 120 వరకు స్కానింగ్ కేంద్రాలకు అనుమతి ఉంది. అయితే.. అనధికారికంగా చాలా కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో యథేచ్ఛగా లింగనిర్ధారణ చేస్తున్నారు. ‘ఆరోగ్యవంతమైన శిశువు’ నిర్ధారణ కోసం ఉపయోగించాల్సిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను ఆడశిశువుల పాలిట శాపంగా మారుస్తున్నారు.
అనుమతి ఉన్న స్కానింగ్ కేంద్రాల్లో ఒక్కోదాంట్లో రోజుకు 10 నుంచి 20 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి వద్ద రిజిష్టరై ఉండాలి. అయితే.. పలు ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు అనుమతులు తీసుకోకుండానే సొంతంగా పరికరాలు వినియోగిస్తున్నాయి. వీటి సంఖ్య జిల్లాలో 100 వరకు ఉండొచ్చని అంచనా. ఒకే అనుమతి తీసుకుని రెండు, మూడు చోట్ల స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నవి, ఎలాంటి అనుమతి లేనివి మరో 50 వరకు ఉన్నాయి. ఒక్క అనంతపురం నగరంలోనే 30 నుంచి 35 వరకు అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. పైగా ఫారం–ఎఫ్ ద్వారా ఏ రోజుకా రోజు స్కానింగ్ వివరాలను డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపాల్సి ఉన్నా.. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వాటిని విస్మరిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
‘బోర్డుల’ వెనుక మాయాజాలం
‘ఇచ్చట లింగ నిర్ధారణ చేయబడదు’ అని స్కానింగ్ కేంద్రాల్లో బోర్డులు పెట్టుకున్నా లోపల జరిగేది ఇందుకు పూర్తిగా భిన్నం. అనంతపురంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న ఓ ఆస్పత్రిలో అనుమతి లేకుండానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో గతంలో జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేసి యంత్రాన్ని సీజ్ చేశారు. వాస్తవానికి ఇక్కడ వాడిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరం ఓ ప్రభుత్వ డాక్టర్ పేరుమీద రిజిష్టరైంది. కానీ ప్రభుత్వ వైద్యురాలిగా ఉన్న ఈమె అనుమతి తీసుకున్న చోట కాకుండా మరో చోట పరీక్షలు చేస్తున్నట్లు వెలుగు చూసింది.
ఇలాంటి లోగుట్టు స్కానింగ్‌లు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రితో పాటు, సాయినగర్‌లోని పలు క్లినిక్‌లు, సోమనాథ్‌నగర్‌లోని ఓ క్లినిక్‌లో సైతం అబార్షన్లు జోరుగా చేస్తున్నట్లు సమాచారం. బుక్కరాయసముద్రం వద్ద ఉన్న ఓ చిన్నపాటి క్లినిక్ అబార్షన్లకు పెట్టింది పేరుగా ఉంటోంది. ధర్మవరం, కదిరి, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లులోని పలు ఆస్పత్రులు సైతం ఇదే పంథాలో వెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు ‘కమీషన్’ ఎరగా వేసి ఆస్పత్రులకు కాసుల పంట పండించుకుంటున్నారు.
తనిఖీల గుట్టు ‘ముందే’ ఎరుక!
అనధికార క్లినిక్‌లపై దాడులు చేయడం, ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల్లో అందుతున్న సేవలను పర్యవేక్షించడం వైద్య, ఆరోగ్యశాఖ విధి. ఆ శాఖ అధికారులు అడపాదడపా తనిఖీల కోసం వెళ్తున్నా..అదంతా ‘సెటిల్మెంట్ల’ కోసమేనన్న ఆరోపణలున్నాయి. పైగా డీఎంహెచ్ఓ కార్యాలయంలోని కొందరు అధికారులు తనిఖీల గుట్టును ముందుగానే విప్పి జాగ్రత్త పడాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటాం
లింగ నిర్ధారణ, అబార్షన్లు నేరం. అలాంటి వాటిపై ఫిర్యాదులొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు. ఎక్కడైతే అనుమతి ఉందో అక్కడ మాత్రమే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.
– డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ
అబార్షన్లతో ప్రాణాపాయం
అబార్షన్లు చేయడం వల్ల తల్లి ప్రాణాలకు ప్రమాదం. ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మరోసారి గర్భం దాల్చినా రెండు, మూడు నెలల్లోనే గర్భస్రావం కావచ్చు. చట్ట ప్రకారమైతే గర్భం దాల్చిన 12 వారాల తర్వాత ఇద్దరు గైనకాలజిస్ట్‌ల అభిప్రాయం తీసుకుని అబార్షన్ చేయించుకోవచ్చు. అది కూడా ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. శిశువుకు పుర్రె ఏర్పడకపోవడం, మెదడు బయటకు రావడం వంటివి జరిగినప్పుడు మాత్రమే చట్ట ప్రకారం చేయొచ్చు.
– డాక్టర్ షంషాద్‌బేగం, గైనిక్ హెచ్ఓడీ, సర్వజనాస్పత్రి