లింగనిర్ధరణ అడిగేవారూ నేరస్తులే..
లీగల్ పాయింట్
ఆడపిల్ల భారమని భావించే కొందరు కడుపులో ఉండగానే లింగ నిర్ధరణ పరీక్షలు చేయిస్తుంటారు. ఇందుకోసం స్కానింగ్ సెంటర్ల వైపు పరుగులు పెడుతుంటారు. అందులో ఆడపిల్ల అని తేలగానేభ్రూణహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి హత్యలను ఆపడానికి ప్రభుత్వం 1994లో పీఎన్‌డీటీ(గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం వివరాలను వివరించారు జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాది పులిశెట్టి శ్రీనివాస్.
జగిత్యాల జోన్ :
గర్భిణికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వైద్యులు గర్భస్థ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. గర్భవతి అయిన మహిళ 35 ఏళ్లు దాటి ఉంటే శారీరక మార్పుల దృష్ట్యా గర్భస్థ పరీక్షలు చేయవచ్చు. అలాగే గర్భవతి అయిన మహిళకు అంతకుముందు రెండు లేక అంతకన్న ఎక్కువసార్లు ఎటువంటి కారణమూ లేకుండానే గర్భస్రావం జరిగి ఉండాలి. లేదంటే గర్భంలోనే పిండం మృతిచెంది ఉండాలి. అలాగే తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు, పిండంపై తీవ్ర ప్రభావం గల మందులను వాడినప్పుడు మాత్రమే గర్భిణికి పరీక్షలు చేయొచ్చు. గర్భవతి లేదా ఆమె భర్తకు జన్యు సంబంధ రోగాలు ఉన్నప్పుడు గర్భిణికి స్కానింగ్ చేయించొచ్చు. సెక్స్ సంబంధ జన్యు రోగాలు, రక్తం సరఫరా తక్కువగా ఉండటం, క్రోమోజోమ్ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే గర్భిణికి స్కానింగ్ పరీక్షలు చేయాలి.
మాటల ద్వారానే కాదు.. సైగల ద్వారా చెప్పొద్దు
అవసరం ఉన్నా.. లేకున్నా వైద్యులు స్కానింగ్ చేసి శిశువు లింగాన్ని నిర్ధరించడం ఎంత తప్పో.. శిశువు లింగ నిర్ధరణ కోసం వైద్యులపై ఒత్తిడి తెచ్చి స్కానింగ్ పరీక్ష చేయించుకోవడం కూడా అంతే తప్పు. కాబట్టి వైద్యులకు ఏ విధమైన శిక్షలు వేస్తారో.. కోరిన వారికీ అవే శిక్షలు ఉంటాయి. సాధారణంగా స్కానింగ్ వైద్య పరీక్షలు చేయించుకున్న మహిళ ఆమె భర్త బలవంతంపైనే అలా చేసిందని చట్టం భావిస్తుంది. కనుక ఈ చట్టం ప్రకారం ఆమెకాకుండా పరీక్ష చేయించుకోవాలని బలవంతపెట్టిన భర్త నేరస్తుడవుతారు. కడుపులో పెరుగుతున్న పిండం ఆడా.. మగా అనే విషయాన్ని సదరు మహిళకు గానీ, వారి బంధువులకు గానీ మాటల ద్వారా, సైగల ద్వారా చెప్పొద్దు. పిండం ఎదుగుదల సరిగ్గా లేక తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయాల దృష్ట్యా పరీక్షలు జరపాల్సి వస్తే.. ఆ విషయాలను వైద్యులు ఆమెకు అర్థమయ్యే భాషలో వివరించి, ఆమె నుంచి రాతపూర్వకమైన హామీని తీసుకున్న తర్వాతే స్కానింగ్ చేయాలి.
ఎలాంటి శిక్ష విధిస్తారు..
లింగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌కు.. పరీక్షలు జరిపిన ఇతర వైద్య సిబ్బందికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, అదే నేరాన్ని మళ్లీ చేస్తే ఐదేళ్ల వరకు జైలు, రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. వైద్యులు జైలు శిక్షను అనుభవిస్తే వారి గుర్తింపును రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నుంచి రెండేళ్ల వరకూ తొలగించొచ్చు. తద్వారా డాక్టర్లు ఇతర చోట వైద్య వృత్తిని చేపట్టడానికి వీలులేదు. రెండో పర్యాయం కూడా శిక్ష పడితే మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నుంచి అతని పేరు శాశ్వతంగా తొలగించొచ్చు. గర్భంతో ఉన్న మహిళకు ఇష్టం లేకుండా గర్భస్రావం చేస్తే అందుకు బాధ్యులైనవారికి జీవితకాలం శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. స్కానింగ్ చేపడుతూ పుట్టబోయే శిశువు ఎవరో ముందుగానే చెప్పే ఆసుపత్రుల, జెనెటిక్ లాబోరేటరీల గుర్తింపును రద్దు చేస్తారు.
ఫిర్యాదు ఇలా చేయొచ్చు
గర్భస్థ శిశువు లింగ నిర్ధరణ పరీక్షలను ఆపడానికి కేంద్ర, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ మండళ్లను ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షక అధికారులుగా ఉంటారు. వీరికి ఫిర్యాదు చేయవచ్చు. స్వతంత్ర వ్యక్తులు, స్వచ్చంధ సంస్థలు తమకు తెలిసిన సమాచారాన్ని ముం దుగా పర్యవేక్షణ మండలికి తెలియజేయాలి. 15 రోజుల తర్వాత ఫిర్యాదు అందించొచ్చు.
పరీక్షలు చేస్తామని ప్రచారం చేయడమూ నేరమే..
లింగ నిర్థరణ పరికరాలు తమ వద్ద ఉన్నట్లు వ్యక్తిగానీ, సంస్థగానీ, జన్యు సలహా కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేసుకోరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్లవరకు జైలు, రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. సంబంధిత అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ పొందనిదే గర్భస్థ పరీక్షలు, లింగ నిర్ధరణకు ఉపయోగించే పరికరాలు స్కానర్, అల్ట్రాసౌండ్, ఇమేజింగ్ తదితర పరికరాలను ఎవరు కలిగి ఉండరాదు, ఉపయోగించరాదు. ప్రతి జెనెటిక్ ల్యాబోరేటర్ ఈ చట్టం కింద రిజిష్టర్ అయి ఉండాలి. చట్టం సూచించిన నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు సస్పెండ్ చేయొచ్చు.