రాష్ర్టంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రి వర్గాలు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రి వర్గాలు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా స్కానింగ్‌యంత్రాలు కొనుగోలు చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని ఆదేశించారు. తయారీ దారులు, దిగుమతిదారులు, డీలర్లు, సరఫరాదారులు, ఏజెంట్లు యంత్రాలు సరఫరా చేస్తున్నప్పుడు రాష్ట్ర అధికారుల నుంచి రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. సరఫరాదారులు లేదా డీలర్లు ప్రతి మూడు నెలలకోసారి అమ్మకాలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అలా చేయక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా అల్ట్రాసౌండ్ మెషిన్లను విక్రయించడం, నెలకొల్పడం ద్వారా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నర్సింగ్‌హోమ్ యజమానులు యంత్రాలు కొనుగోలు చేసినప్పుడు అధికారులు విధిగా పరిశీలిస్తారని అన్నారు. స్కానింగ్ పరీక్షలు చేసే ఆస్పత్రులు ప్రతి నెలా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు.