లింగ నిర్ధారణ కొత్త పుంతలు తొక్కుతోంది. గర్భస్థ శిశువు ఆడ లేక మగ అని చెప్పడానికి స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గతంలో రాతలు, మాటల ద్వారా చెప్పేవారు. ఇప్పుడు మొబైల్‌ఫోన్ రికార్డింగ్స్ నేపథ్యంలో గర్భస్థ శిశువు పాప అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తున్నారు. మగ అయితే వెంకటేశ్వరస్వామి ఫొటో చూపిస్తున్నారు. అంతేకానీ లింగ నిర్ధారణ మాత్రం ఆపడం లేదు. ఇంత జరుగుతున్నా స్పందించని జిల్లా అధికారులు భ్రూణ హత్యలు ఎలా నివారిస్తారో వారికే తెలియాలి.
సాక్షి, తిరుపతి తుడా: కొత్త చట్టాలు చేసే కొద్దీ స్కానింగ్ సెంటర్లకు వసూళ్లు పెరుగుతున్నాయి కానీ చట్టాలు మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో నమోదు చేసుకున్న స్కానింగ్ సెంటర్లు దాదాపుగా 186 వరకు ఉన్నాయి. అను మతులు లేనివి, అనుమతులను పునరుద్ధరణ చేసుకోనివి మరో 50 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో తిరుపతి, చిత్తూరు నగరాల్లోని కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ జరుగుతోంది. స్కానింగ్‌కు వచ్చే వారి స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రూ.20 వేలు నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ఎస్‌పీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎన్‌జీఓ సభ్యుడు మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వయిజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈ రెండు కమిటీలు మూడు నెలలకోసారి సమావేశమై ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అయితే అలాంటి సమావేశాలు సకాలంలో నిర్వహించిన దాఖలాల్లేవు. దీంతో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు మితిమీరిపోయాయి.
ఇదీ గుర్తు
స్కానింగ్ సెంటర్లు ఆడ.. మగ బిడ్డలను సంబంధిత తల్లిదండ్రులకు ఫొటోలతో చెప్పే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నేరుగా కానీ, మరోలా చెప్పేందుకు భయపడుతున్నారు. ఎవరైనా మొబైల్‌తో రికార్డు చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏర్పాటు చేసుకుని, ఆడ బిడ్డ అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తారు. మగ బిడ్డ అయితే వెంటేశ్వర స్వామి ఫొటోవైపు కళ్లతో సైగ చేస్తారు. ఇలా స్కానింగ్ సెంటర్ల దందా కొనసాగుతోంది. భ్రూణ హత్యలూ జరుగుతు న్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం.
నిబంధనలు ఇవి
►ఈ చట్టం అనుసరించి అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు (ప్రభుత్వ, ప్రయివేటు) వైద్యులు సంబంధిత జిల్లా ప్రత్యేక నిర్దేశిత అధికారి వద్ద తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.
►అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేసేది లేదని సందర్శకులందరికీ కనిపించేలా తప్పకుండా పెద్ద సైజు అక్షరాల్లో బోర్డు ఏర్పాటు చేయాలి.
► ఈ బోర్డులను ఆంగ్లం, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోబాగా కనిపించేలా ఉంచాలి.
►అన్ని అల్ట్రా స్కానింగ్ యంత్రాలు, పరికరాలు, లింగ నిర్ధారణ చేసేయంత్రాలు, ప్రదేశాలు నమోదు చేయించాలి.
►సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా ఉత్పత్తి దారులు, పంపిణీ దారులు, అమ్మకం దారులు ఈ యంత్రాలు, పరికరాలు నమోదు పత్రం (సంస్థ రిజిస్ట్రేషన్ పత్రం) సమర్పించనిదే వీటిని విక్రయించకూడదు, పంపిణీ చేయకూడదు.
►ఈ నమోదు పత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరణ చేసుకోవాలి.
►స్కానింగ్ సెంటర్లలో ఫారం ఎఫ్‌ను విధిగా వినియోగించి, ఆ వివరాలు జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రతి నెలా ఐదవ తేదీలోగా అందించాలి.
►స్కానింగ్‌కు సూచించిన వైద్యుల ధ్రువీకరణ పత్రం విధిగా ఉండాలి. ఈ పత్రాన్ని ఫారం– ఎఫ్ తో జతపరచి, భద్రపరచాలి. దాన్ని తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలి. అయితే ఈ నిబంధనలు చాలావాటిల్లో అమలు చేయడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment