fetal gender determination
-
గర్భంలోనే మరణశాసనం!
‘‘గత నవంబర్‌లో కరీంనగర్ ఓల్డ్ డీఐజీ బిల్డింగ్ సమీపంలో ఓ ఆర్ఎంపీ వైద్యురాలు అబార్షన్లు చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు వస్తున్నారని తెలిసి సదరు వైద్యురాలు పరారైంది. ఆసుపత్రి తెరిచి చూస్తే నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పటికే ఓ అబార్షన్ చేసినట్లు ఆనవాళ్లు దొరికాయి. ఆ క్లినిక్‌లో పూర్తిగా అబార్షన్లకు సంబంధించిన పరికరాలు, మందులు ఉండడం చూస్తే అక్కడ నిత్యం అదే తంతు సాగుతున్నట్లు అర్థమైంది. ఇది ఈ ఒక్క క్లీనిక్‌లోనే కాదు. అబార్షన్లకు పేరొందిన కొందరు ఆర్ఎంపీ డాక్టర్లతోపాటు కొందరు క్వాలిఫైడ్ డాక్టర్ల చీకటి క్లినిక్‌లలో సైతం సాగుతోంది. స్కానింగ్‌లో పుట్టే శిశువు ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే అంతమొందించే రాక్షస కృత్యం సాగుతూనే ఉంది.’’ సాక్షి, కరీంనగర్: ఎవరెన్ని మాటలు చెప్పినా... ఆడపిల్లల పుట్టుకపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భస్థ శిశువుకు స్కానింగ్ పరీక్షలు జరిపి ఆడపిల్లని తేలితే, అడ్డగోలుగా డబ్బులు దండుకుని కర్కశంగా కడుపులోనే నులిపేస్తున్నారు. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో స్కానింగ్ సెంటర్లు ఆడపిల్ల పుట్టుకపై ‘హెచ్చరికలు’ చేస్తూ తల్లి గర్భం నుంచి బయటకు రాకుండా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో గర్భ విచ్ఛిత్తి పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. స్కానింగ్ సెంటర్లు సాగిస్తున్న మరణ శాసనాన్ని అడ్డుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలమవుతోంది. కొందరు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలను జంకూ బొండూ లేకుండా నిర్వహిస్తూ.. ఆడపిల్లలకు డబ్బులు గుంజి అబార్షన్లు చేస్తున్నారు. విద్యావంతులే అధికం... భ్రూణ హత్యలకు పాల్పడే వారిలో ఉన్నత చదువులు అభ్యసించినవారే అధికంగా ఉండడం గమనార్హం. గ్రామీణుల కంటే పట్టణవాసులే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గ్రామీణుల కదలికలు వారి బంధువులు, ఇతరులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. పట్టణాల్లో మాత్ర ఈ పరిస్థితి కనిపించదు. దీనిని ఆసరాగా చేసుకుని మధ్యవర్తుల ద్వారా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్యులను సంప్రదించి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అందరికీ చెప్పరు... కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 102 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి.గైనకాలజీ వైద్యులు ఆసుపత్రుల్లోనే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి చోటా పీసీ పీఎండీటీ (గర్భస్థ లింగ నిర్ధారణ) చట్టం బోర్డు ఎదురుగా కనిపిస్తుంది.కొందరు నిర్వాహకులు కాసులకు కక్కుర్తి పడి భ్రూణహత్యలకు సహకరిస్తున్నారు. కొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలతోపాటు ఆశ కార్యకర్తలు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వచ్చిన వారి అవసరాన్ని బట్టి రూ.10 వేలకుపైగా వసూలు చేసి పుట్టబోయే బిడ్డ లింగనిర్ధారణ చేస్తున్నారు. అనంతరం సంబంధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించి గర్భ విచ్ఛిత్తి చేయించుకోవడం పరిపాటిగా మారింది. పెట్ స్కాన్ పేరుతో దోపిడీ... గర్భస్థ శిశువుల్లో అవయవ లోపాలను గుర్తించేందుకు ఉత్తర తెలంగాణ మొత్తంలో కరీంనగర్‌లోనే రెండు పెట్‌స్కాన్ సెంటర్లు ఉన్నాయి. ఆసుపత్రుల్లో స్కాన్ చేస్తున్న వైద్యులు అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక భయం చెప్పి పెట్ స్కాన్‌కు పంపుతున్నారు. అక్కడ రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి గర్భిణులను స్కానింగ్‌లకు పంపుతున్నారు. స్కానింగ్ పూర్తయితే 50 శాతం కమీషన్ వైద్యులకు వెళ్తుంది. కమీషన్ల కోసం స్కానింగ్‌లకు పంపుతూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. చట్టం.. తూతూ మంత్రం.. భ్రూణహత్యలను నిరోధించేందుకు 1994లో చట్టం రూపొందించినా ఈ భ్రూణహత్యల పరంపర ఆగడం లేదు. ఈ చట్ట ప్రకారం రేడియాలజీలో ఎండీ, డీఎన్బీ చేసినవారే గర్భస్థ పిండ పరీక్షలు చేయాలి. కానీ ప్రతీ గైనకాలజిస్టు తమ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఇలా చేయకూడదనే ఉద్దేశంతో 2003, ఫిబ్రవరి 14 నుంచి పలు సవరణలు చేసి చట్టాన్ని మరింత పగడ్బందీగా మార్చారు. కఠినతరమనేలా చట్టం ఉన్నప్పటికీ ఇది అక్రమార్కులకు చుట్టంగానే మారుతోంది. గర్భస్థ శిశులింగ నిర్ధారణను బహిర్గతం చేయడం లేదా గర్భం దాల్చిన వారిలో పిండదశలోనే హత్య చేయడాన్ని నివారించడానికి రూపొందించిన చట్టంలో బాధ్యులకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో స్కానింగ్ సెంటర్లలో అక్కమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు ఇలా... గర్భస్థ లింగ నిర్ధారణ కేంద్రంలో ఎన్ని పరికరాలుంటే.. అన్నింటికీ అనుమతి పొందాలి. గైనకాలజిస్టు, రేడియోలజిస్టు, సోనాలజిస్టు, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో శిక్షణ పొందిన వారికి అనుమతివ్వాలి. ప్రతి గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్ష సమాచారాన్ని అధికారికంగా పుస్తకంలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. జిల్లా స్థాయిలో వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ఉల్లంఘనులు... అనుమతులు లేకుండానే నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు. పరీక్ష నమోదు ప్రక్రియను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి అరకొర సమాచారం పంపిస్తున్నారు. సమాచారాన్ని అరకొరగా పొందుపర్చుతున్నా... వైద్యాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో కొందరు వైద్యాధికారులకు ప్రతినెలా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక పరికరానికి అనుమతి పొంది, ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని కేంద్రాల్లో శిక్షణ, అనుభవం లేని వారే టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. -
లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే
లింగ నిర్ధారణ కొత్త పుంతలు తొక్కుతోంది. గర్భస్థ శిశువు ఆడ లేక మగ అని చెప్పడానికి స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గతంలో రాతలు, మాటల ద్వారా చెప్పేవారు. ఇప్పుడు మొబైల్‌ఫోన్ రికార్డింగ్స్ నేపథ్యంలో గర్భస్థ శిశువు పాప అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తున్నారు. మగ అయితే వెంకటేశ్వరస్వామి ఫొటో చూపిస్తున్నారు. అంతేకానీ లింగ నిర్ధారణ మాత్రం ఆపడం లేదు. ఇంత జరుగుతున్నా స్పందించని జిల్లా అధికారులు భ్రూణ హత్యలు ఎలా నివారిస్తారో వారికే తెలియాలి. సాక్షి, తిరుపతి తుడా: కొత్త చట్టాలు చేసే కొద్దీ స్కానింగ్ సెంటర్లకు వసూళ్లు పెరుగుతున్నాయి కానీ చట్టాలు మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో నమోదు చేసుకున్న స్కానింగ్ సెంటర్లు దాదాపుగా 186 వరకు ఉన్నాయి. అను మతులు లేనివి, అనుమతులను పునరుద్ధరణ చేసుకోనివి మరో 50 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో తిరుపతి, చిత్తూరు నగరాల్లోని కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ జరుగుతోంది. స్కానింగ్‌కు వచ్చే వారి స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రూ.20 వేలు నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎన్జీఓ సభ్యుడు మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వయిజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈ రెండు కమిటీలు మూడు నెలలకోసారి సమావేశమై ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అయితే అలాంటి సమావేశాలు సకాలంలో నిర్వహించిన దాఖలాల్లేవు. దీంతో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఇదీ గుర్తు స్కానింగ్ సెంటర్లు ఆడ.. మగ బిడ్డలను సంబంధిత తల్లిదండ్రులకు ఫొటోలతో చెప్పే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నేరుగా కానీ, మరోలా చెప్పేందుకు భయపడుతున్నారు. ఎవరైనా మొబైల్‌తో రికార్డు చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏర్పాటు చేసుకుని, ఆడ బిడ్డ అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తారు. మగ బిడ్డ అయితే వెంటేశ్వర స్వామి ఫొటోవైపు కళ్లతో సైగ చేస్తారు. ఇలా స్కానింగ్ సెంటర్ల దందా కొనసాగుతోంది. భ్రూణ హత్యలూ జరుగుతు న్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం. నిబంధనలు ఇవి ►ఈ చట్టం అనుసరించి అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు (ప్రభుత్వ, ప్రయివేటు) వైద్యులు సంబంధిత జిల్లా ప్రత్యేక నిర్దేశిత అధికారి వద్ద తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. ►అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేసేది లేదని సందర్శకులందరికీ కనిపించేలా తప్పకుండా పెద్ద సైజు అక్షరాల్లో బోర్డు ఏర్పాటు చేయాలి. ► ఈ బోర్డులను ఆంగ్లం, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోబాగా కనిపించేలా ఉంచాలి. ►అన్ని అల్ట్రా స్కానింగ్ యంత్రాలు, పరికరాలు, లింగ నిర్ధారణ చేసేయంత్రాలు, ప్రదేశాలు నమోదు చేయించాలి. ►సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా ఉత్పత్తి దారులు, పంపిణీ దారులు, అమ్మకం దారులు ఈ యంత్రాలు, పరికరాలు నమోదు పత్రం (సంస్థ రిజిస్ట్రేషన్ పత్రం) సమర్పించనిదే వీటిని విక్రయించకూడదు, పంపిణీ చేయకూడదు. ►ఈ నమోదు పత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరణ చేసుకోవాలి. ►స్కానింగ్ సెంటర్లలో ఫారం ఎఫ్‌ను విధిగా వినియోగించి, ఆ వివరాలు జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రతి నెలా ఐదవ తేదీలోగా అందించాలి. ►స్కానింగ్‌కు సూచించిన వైద్యుల ధ్రువీకరణ పత్రం విధిగా ఉండాలి. ఈ పత్రాన్ని ఫారం– ఎఫ్ తో జతపరచి, భద్రపరచాలి. దాన్ని తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలి. అయితే ఈ నిబంధనలు చాలావాటిల్లో అమలు చేయడంలేదు. -
లింగ నిర్ధారణ చేస్తే జైలు శిక్ష
గుంటూరు మెడికల్ : గర్భంలో ఉన్న శిశువు ఆడా,మగా అని నిర్ధారించి చెప్పడం, గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణచేయడం చట్టరీత్యా నేరమని, అలా చేసిన వారికి జైలుశిక్ష తప్పదని పిసి అండ్ పిఎన్డిటి యాక్ట్ స్టేట్ అప్రాప్రియేట్ అధికారి డాక్టర్ కె.సుధాకర్‌బాబు చెప్పారు. డీఎంహెచ్ఓ చాంబర్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేసి లింగ నిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మూసివేస్తామని హెచ్చరించారు. ఆడశిశువులు తక్కువగా ఉన్న ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు చెప్పారు. తనిఖీలు తీవ్రతరం చేయాలి ఆడ శిశువుల జనాభా తగ్గకుండా ఉండాలంటే స్కానింగ్ సెంటర్స్‌పై తనిఖీలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ సుధాకర్‌బాబు చెప్పారు. జిల్లాలో ఆడశిశువుల సంఖ్య వెయ్యికి 948 మాత్రమే ఉందని, దీనిని సమానం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో రేపల్లె, గుంటూరు, పిడుగురాళ్ల స్కానింగ్ సెంటర్స్‌పై కోర్టులో కేసులు నడుస్తున్నట్టు తెలిపారు. నిఘా ఏర్పాటుచేశాం లింగ నిర్ధారణ చేయకుండా స్కానింగ్ సెంటర్స్‌పై నిఘా ఏర్పాటు చేశామన్నారు. గర్భవతికి ఎలాంటి శిక్ష ఉండదని, లింగ నిర్ధారణకు ప్రోత్సహించే కుటుంబ సభ్యులకు, స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులకు శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ పసుమర్తి ఉమాదేవి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ మేడ శ్యామలాదేవి, జవహర్‌బాల ఆరోగ్యరక్ష జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భూక్యా లకా్ష్మనాయక్, డిప్యూటీ డెమోలు రామచంద్రుడు, ఏలియా తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులతో సమావేశం విలేకరుల సమావేశం అనంతరం డాక్టర్ సుధాకర్‌బాబు జిల్లాలోని స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. చట్టాన్ని అమలు చేయకపోతే కలిగే అనర్ధాల గురించి, చట్టం విధించే శిక్షల గురించి వివరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులు ఇకనుంచి ఆన్లైన్లో ఎఫ్ ఫారాన్ని భర్తీ చేయాలని, ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఎఫ్ పారం వివరాలను ఆన్లైన్లో పెట్టాలని తెలిపారు. పలువురు జిల్లా వైద్యాధికారులు, స్కానింగ్ సెంటర్స్, హాస్పటల్స్, నిర్వాహకులు పాల్గొన్నారు.