లింగ నిర్ధారణ చేస్తే జైలు శిక్ష
గుంటూరు మెడికల్ : గర్భంలో ఉన్న శిశువు ఆడా,మగా అని నిర్ధారించి చెప్పడం, గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణచేయడం చట్టరీత్యా నేరమని, అలా చేసిన వారికి జైలుశిక్ష తప్పదని పిసి అండ్ పిఎన్‌డిటి యాక్ట్ స్టేట్ అప్రాప్రియేట్ అధికారి డాక్టర్ కె.సుధాకర్‌బాబు చెప్పారు. డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేసి లింగ నిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మూసివేస్తామని హెచ్చరించారు. ఆడశిశువులు తక్కువగా ఉన్న ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు చెప్పారు.
తనిఖీలు తీవ్రతరం చేయాలి
ఆడ శిశువుల జనాభా తగ్గకుండా ఉండాలంటే స్కానింగ్ సెంటర్స్‌పై తనిఖీలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ సుధాకర్‌బాబు చెప్పారు. జిల్లాలో ఆడశిశువుల సంఖ్య వెయ్యికి 948 మాత్రమే ఉందని, దీనిని సమానం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో రేపల్లె, గుంటూరు, పిడుగురాళ్ల స్కానింగ్ సెంటర్స్‌పై కోర్టులో కేసులు నడుస్తున్నట్టు తెలిపారు.
నిఘా ఏర్పాటుచేశాం
లింగ నిర్ధారణ చేయకుండా స్కానింగ్ సెంటర్స్‌పై నిఘా ఏర్పాటు చేశామన్నారు. గర్భవతికి ఎలాంటి శిక్ష ఉండదని, లింగ నిర్ధారణకు ప్రోత్సహించే కుటుంబ సభ్యులకు, స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులకు శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ పసుమర్తి ఉమాదేవి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ మేడ శ్యామలాదేవి, జవహర్‌బాల ఆరోగ్యరక్ష జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భూక్యా లకా్ష్మనాయక్, డిప్యూటీ డెమోలు రామచంద్రుడు, ఏలియా తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులతో సమావేశం
విలేకరుల సమావేశం అనంతరం డాక్టర్ సుధాకర్‌బాబు జిల్లాలోని స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. చట్టాన్ని అమలు చేయకపోతే కలిగే అనర్ధాల గురించి, చట్టం విధించే శిక్షల గురించి వివరించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులు ఇకనుంచి ఆన్‌లైన్‌లో ఎఫ్ ఫారాన్ని భర్తీ చేయాలని, ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఎఫ్ పారం వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని తెలిపారు. పలువురు జిల్లా వైద్యాధికారులు, స్కానింగ్ సెంటర్స్, హాస్పటల్స్, నిర్వాహకులు పాల్గొన్నారు.