హైటెక్ పెన్ వచ్చేసింది!
వర్చువల్ రియాల్టీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా సహజంగా దృశ్యాలను సాక్షాత్కరింపజేసే ఎన్నో ఆధునిక పరికరాలూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మనముందుకొచ్చేసింది. చిత్రకారులు, డిజైనర్లు తమకు కావలసిన రంగులను ఎలాంటి మిక్సింగ్ లేకుండానే రూపొందించుకొని, కాన్వాస్ పై కళారూపాలను చిత్రించే అవకాశం దగ్గరలోనే ఉంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ అందుబాటులోకి వచ్చేసింది. కుంచె, రంగుల అవసరం లేకుండానే ప్రకృతి చిత్రాలను, కళారూపాలను ఆవిర్భవింపచేసే అవకాశం కనిపిస్తోంది. మనకు దగ్గరలో కనిపించిన ఏ వస్తువునైనా స్కాన్ చేసి, దాని రంగును తనలోకి తీసుకోగలిగే ఈ హైటెక్ పెన్ ఇప్పుడు కళాకారులకు సైతం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ పెన్ లో పొందుపరచిన కలర్ సెన్సార్, మైక్రో ప్రాసెసర్లు మనం అనుకున్న రంగులను గుర్తించి స్కాన్ చేస్తాయి. ఆకులు, పూలు, పళ్ళు వంటి రంగురంగుల ప్రకృతి దృశ్యాలతోపాటు ఎటువంటి వస్తువు పైన పెట్టినా.. పెన్ లోని సెన్సార్ ఆ వస్తువులోని రంగును స్కాన్ చేసి, అదే రంగును షేడ్ తో సహా మనకు అందిస్తుంది.
చిత్రాన్ని స్కాన్ చేసుకున్న అనంతరం పిక్చర్ లోని కలర్ కు అనుగుణంగా పెన్ లోని స్మార్ట్ ఇంక్ కాట్రిజ్ రంగులను మార్చుకుంటుంది. ఈ కాట్రిజ్ లో ఉండే ఇంకుతో మైళ్ళకొద్దీ రాసేందుకు వీలవుతుందని సృష్టికర్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ స్క్రిబుల్ పెన్ ఇంక్.. నీటిని పీల్చదని, వెలిసిపోదని చెప్తున్నారు. ఈ స్మార్ట్ పెన్ కూడ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, ఒకటి.. నిజమైన ఇంకుతో పేపర్ మీద రాసుకునేందుకు వీలుగానూ, మరోటి చిత్రాలను స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో వాడుకునేందుకు గాను వీలుంటుందంటున్నారు. యూఎస్బీ కేబుల్ తో ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు గంటల పాటు పని చేస్తుందని చెప్తున్నారు. 249 డాలర్లతో అంటే సుమారు 17 వేల రూపాయలతో ఈ స్మార్ట్ పెన్ ను ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వెబ్ సైట్లో వివరించారు.