చిన్న సమస్యకు అంత పెద్ద చికిత్స అవసరమేనా?
నా వయసు 35. ఈ మధ్య పళ్లు లాగుతున్నట్లు అనిపిస్తే డెంటిస్ట్ దగ్గరకెళ్లాను. ఆయన ఎక్స్‌రే తీసి చిగుళ్లకు చిన్న సర్జరీ చేయాలని, లేకుంటే పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందన్నారు. నాకైతే సమస్య అంత పెద్దగా అనిపించడం లేదు. డాక్టర్‌గారేమో ఆపరేషన్ చేస్తానంటున్నారు. ఎందుకో అనుమానంగా ఉంది. ఇది నిజమేనంటారా? సలహా ఇవ్వండి.
- బి. లక్ష్మి, కాకినాడ
దంత సమస్యల్లో చాలా వరకు నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేవేనని చెప్పుకోవచ్చు. మనందరికీ ప్రతి ఆరునెలలకోసారి రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలవడం అనే అలవాటు లేకపోవడం, దంత సమస్యల పట్ల అవగాహన తక్కువగా ఉండటంతోపాటు బాగా నొప్పి ఉంటేనే జబ్బు వచ్చినట్లుగానూ, నొప్పి, బాధ లేకపోతే చిన్న సమస్యగా భావిస్తాం. అందువల్లే చాలా దంత సమస్యలు డాక్టర్ గారు ఎక్స్‌రే, స్కానింగ్ తీసినప్పుడు బయట పడతాయి. ఇవి కేవలం నోటి ఆరోగ్యానికే కాకుండా శరీర ఆరోగ్యం విషయంలో కూడా వర్తిస్తుంది.
బహుశ మీ ఎక్స్‌రే చూసినప్పుడ డాక్టర్ గారికి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండటం, పంటికి ఆధారంగా ఉన్న ఎముక అరిగిపోవటం లాంటివి కనిపిస్తే... చిగుళ్లను దృఢంగా చేయడానికి చిన్నపాటి చిగుళ్ల సర్జరీలు చేసుకోమని సలహా ఇస్తుంటారు. ఇప్పటికీ చాలామంది ఇటువంటి సలహా పొందినప్పుడు చికిత్సకు మొగ్గు చూపరు. కారణం వీలైనంత వరకు చికిత్స లేకుండా దానంతట అదే మందులతోనో, ఇంజెక్షన్ల ద్వారానో, వివిధ రకాలైన టూత్ పేస్టుల వంటి వాటితో తగ్గించేసుకుందామనే భావన ఎక్కువగా ఉండటమే.
అందుకే మార్కెట్లో దొరికే లేదా అడ్వటైజ్‌మెంట్లలో కనిపించే ప్రతి టూత్‌పౌడరునీ, పేస్టునీ కొని ప్రయత్నం చేస్తుంటారు. సమయం గడిచే కొద్దీ సమస్య మరింత ముదిరిపోయి, తర్వాత ఇబ్బంది పడతారు. మీరు కలిసిన స్పెషలిస్టు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుమానంగా అనిపిస్తే మరొక డెంటిస్ట్‌తో సరి చూసుకోవచ్చు. (క్రాస్ వెరిఫికేషన్) ఒకరికి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పు లేదు. కాని జబ్బు ఉందని తెలిసినప్పుడు చిన్నదైనా, పెద్దదైనా చికిత్సని ఏదో ఒక వంకతో వాయిదా వేయడం మంచిది కాదు.
డాక్టర్ పార్థసారథి,
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్