కొన్ని పళ్లు అరిగిపోయాయి...అన్ని పళ్లూ కట్టించుకోక తప్పదా? | Dental problems - questions and answers | Sakshi
Sakshi News home page

కొన్ని పళ్లు అరిగిపోయాయి...అన్ని పళ్లూ కట్టించుకోక తప్పదా?

Published Sat, Oct 12 2013 1:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

కొన్ని పళ్లు అరిగిపోయాయి...అన్ని పళ్లూ కట్టించుకోక తప్పదా?

కొన్ని పళ్లు అరిగిపోయాయి...అన్ని పళ్లూ కట్టించుకోక తప్పదా?

నా వయసు 60 సంవత్సరాలు. బీపీ, షుగర్ ఉన్నాయి. పళ్లు బాగా అరిగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని పళ్లు పీకించాను. మిగిలిన పళ్లతో  అంత బాగా నమిలి తినలేకపోతున్నాను. డాక్టర్‌ను కలిస్తే అన్ని పళ్లూ పీకేసి, కొత్తవి కడదాం అన్నారు. భయమేసి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. నేను అన్ని పళ్లూ పీకించాలంటారా? సలహా ఇవ్వండి.
 - ఎస్. జయలక్ష్మి, హైదరాబాద్

 
ఎవరికైనా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంతోపాటు నోటిలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.  పళ్లను... నమలడానికి దశాబ్దాల తరబడి వాడుతుంటాం. కాబట్టి అరిగిపోవడం సాధారణమే. కొంతమందికి ఎక్కువగా, మరికొంతమందికి తక్కువగా అరుగుతుంటాయి. ఇక బీపీ, షుగర్  లాంటి దీర్ఘకాలిక సమస్యలు తోడైనప్పుడు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా సరిగా పనిచేయక సహజసిద్ధమైన దంతపరిరక్షక వ్యవస్థ దెబ్బతింటుంది.  

అందువల్ల పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్లకు సంబంధించిన జబ్బులు వంటివన్నీ పళ్లు పూర్తిగా దెబ్బతినడానికి కారణమవుతాయి. షుగర్ పేషెంట్లలో అసిటోన్ స్మెల్ అనే నోటి దుర్వాసన కూడా ఉంటుంది. అందుకే యాభై సంవత్సరాలలోపు కంటే ఆపై వయసున్నవారే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా దంతవైద్యుడిని కలిసి తగిన సలహాలు, సూచనలు పొందాలి.

ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకుంటుండాలి. అరిగిన లేదా విరిగిన పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, తొడుగులు వేయడం ద్వారా బాగా నమిలి తినే శక్తిని తిరిగి తీసుకురావచ్చు. చిగుళ్ల జబ్బులు నయం చేసే క్యూరటాస్, ఫ్లాప్ ట్రీట్‌మెంట్, ప్రత్యేక లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
 
 పళ్లు ఊడినా లేదా తీసేసినా, వెంటనే కృత్రిమ దంతాలను అమర్చుకోవడం తప్పనిసరి. ఒకటిరెండు పళ్లు పోతే ఏమైందిలే, మిగిలిన పళ్లతో మేనేజ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ, ఏదైనా ఒక దవడలో ఒక పన్ను లేకుంటే 25 శాతం నమిలే శక్తిని కోల్పోతారని ఒక అంచనా.
 
 ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. వాటిని ఎంత బాగా నమిలి, జీర్ణం చేసుకోగలుగుతున్నాం, ఎంత ఒంటబట్టించుకోగలుగుతున్నాం అనేది కీలకం. అందుకే నమిలే శక్తి బాగా ఉన్నంతకాలం ఎవరూ ముసలితనాన్ని ఫీలవరు.  నోటి ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోగలిగినంతకాలం వృద్ధాప్యం రాదు. వీరిపట్ల ప్రతి ఒక్కరూ కాస్తంత అవగాహన కలిగి ఉండాలి. స్పెషలిస్టును కలిసి, చికిత్స చేయించుకోండి.
 
 డాక్టర్ పార్థసారథి,
 కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement