Dr Parthasarathy
-
ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఈ దంత సమస్యలేమిటి?
నా వయసు 25. ఒక పన్ను పుచ్చింది. ఈ మధ్యే చికిత్స చేయించుకున్నాను. మా నాన్నగారు నా చిన్నప్పటినుంచి చాలా పంటి జబ్బులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేను ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా నాకూ పంటిసమస్యలు వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు. -డి.అశోక్, హైదరాబాద్ మనం దేనిని ఉపయోగించినా లేకపోయినా, పళ్లను, నోటిని మాత్రం నిత్యం నిరంతరం ఉపయోగిస్తునే ఉంటాము. దానికితోడు రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి ప్రభావితమవుతుంటాయి. మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు... నోటి ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. పంటికి అతుక్కుపోయే అహార పదార్థాలు... అంటే చాక్లెట్లు, స్వీట్లు, బేకరీ ఫుడ్ వంటివి పళ్లకు అనర్థదాయకం. పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా సులభంగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈమధ్య అందరూ జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది పంటిపైన, పంటిసందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. ఫలితంగా అన్ని రకాల దంతసమస్యలూ మొదలవుతాయి. వీటితోపాటుగా మరెన్నో అంశాలు కూడా నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వంశపారంపర్య సమస్యలు, మనం నివసించే పరిసరాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లాంటివెన్నో పంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మరో ముఖ్యవిషయం... రోజూ ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు కొంతమంది. అతి జాగ్రత్తకు పోయి పళ్లని దాదాపు అరగంటసేపు బరాబరా తోమేస్తుంటారు మరికొంతమంది. నిజానికి ఈ రెండు పద్ధతులూ సరైనవి కావు. రోజూ నిద్రలేవగానే, ఆ తర్వాత పడుకునే ముందు నాలుగు నిమిషాలపాటు శుభ్రంగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఖరీదైన పేస్టు, వింత వింత బ్రష్‌ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టి పెడుతూ శాస్త్రీయమైన పద్ధతిలో... వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్‌పిక్స్, పిన్నులు లాంటివి పళ్లల్లో పెట్టి కెలుక్కోకూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటు మౌత్‌వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కూడా వాడుతుండాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి డెంటిస్ట్‌ను కలిసి చెకప్ చేయించుకోవటం, రెగ్యులర్‌గా చేసుకునే క్లీనింగ్, స్కేలింగ్, పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను చాలామేరకు నివారించవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ప్రమాదంలో విరిగిన పంటిని తిరిగి అమర్చడం సాధ్యమేనా?
మా బాబు వయసు 14 సంవత్సరాలు. క్రికెట్ ఆడుతుంటే ముఖానికి బంతి తగిలి ముందు పన్ను ఒకటి విరిగిపోయింది. అది మేము వెంటనే గమనించలేదు. నోటిలోనుంచి రక్తం కారుతుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. డాక్టర్ గారు పరీక్ష చేసి పన్ను ఊడిందని, దాన్ని తీసుకువచ్చి ఉంటే అతికించేవాడినని చెప్పారు. ఇది నిజమేనంటారా? ఊడిన పంటిని తిరిగి అమర్చవచ్చా? ఏం చేయాలో సలహా ఇవ్వండి. -వి. అపర్ణ, ఖమ్మం పిల్లల్లో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఆడుకునేటప్పుడు కాని, లేదా యాక్సిడెంట్ల వల్లగాని ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు పళ్లు కూడా విరిగిపోవడమో, ఊడిపోవడమో జరుగుతుంటాయి. దెబ్బ తగిలిన చోట రక్తం కారుతుండడంతో నొప్పి, బాధతో రక్తాన్ని చూసి భయపడి పోతుంటారు. కంగారులో ఇంకేమీ పట్టించుకోకుండా డాక్టరు దగ్గరకి పరుగెడతారు. పరీక్షలు చేసిన తర్వాత గానీ, అక్కడేం జరిగిందో తల్లిదండ్రులకి కానీ, దెబ్బలు తగిలించుకున్న పిల్లలకు కానీ సరిగా గమనించే అవకాశం లేదు. పళ్లు సాంతం ఊడిపోయి కిందపడిపోతే వాటిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఊడిన పంటిని అదే స్థానంలో బిగించవచ్చు. అలా పంటిని సహజంగానే తిరిగి పొందవచ్చు. కానీ దెబ్బ తగిలిన వెంటనే ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి... దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే కంగారు పడకుండా ధైర్యాన్నివ్వాలి. శ్వాస సరిగా తీసుకోగలుగుతున్నారా లేదో పరిశీలిస్తూ వీలైతే చల్లని నీటితో కళ్లు తుడవటమో లేదా నీళ్లు ముఖం మీద చిలకరించటమో చేసి, వారు పూర్తిగా స్పృహలోకి వచ్చేలా చేయాలి. పళ్లు ఊడిన చోట రక్తం వస్తుంటే శుభ్రమైన వస్త్రాన్ని లేదా కర్చీఫ్‌ను లేదా దూది ఉండను ఉంచి పళ్లతో గట్టిగా అదిమి ఉంచమని చెప్పాలి. ఈలోగా దెబ్బలు తగిలిన ప్రదేశంలో జాగ్రత్తగా వెదికి, పన్ను కనుక కనపడితే దానిని శుభ్రంగా కడిగి, ఒక చిన్న కవరులోగానీ, భరిణలోగానీ చల్లటి నీటిలో లేదా చల్లటి పాలలో భద్రపరిచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఇలా తీసుకెళ్లిన పంటిని దంతవైద్యుడు అదే స్థానంలో తిరిగి బిగించగలుగుతారు. కొంతమందికి పళ్లు పూర్తిగా ఊడిపోకుండా ఒక పక్కకు తిరిగి పోవటమో, కదిలిపోవటమో జరగవచ్చు. మరికొన్ని సందర్భాలలో పన్ను కొద్దిగా లేదా సగం దాకా విరిగిపోవటం చూస్తుంటాం. ఇలా కదిలి పోయిన పళ్లను తిరిగి యథాస్థానంలో అమర్చవచ్చు. విరిగిన పళ్లను ఒకటి లేదా రెండు సిట్టింగ్‌లలోనే బిల్డప్ చేయడం ద్వారా గానీ లేదా తొడుగు వేయడం ద్వారా కానీ చూడటానికి మామూలుగా కనిపించేలా చేయవచ్చు. మీ బాబు విషయంలో కంగారు పడవద్దు. దానికి దీటైన కృత్రిమ దంతాన్ని అమర్చడం ఆధునిక దంత వైద్యంలో సాధ్యమే. ఫిక్స్డ్ విధానంలో శాశ్వతంగా బిగించే పళ్లు మిగిలిన పళ్ల రంగులో కలిసిపోయి, చూడటానికి కూడా ఎంతో సహజంగా కనిపిస్తాయి. వెంటనే డెంటల్ స్పెషలిస్ట్‌ను కలిసి సమస్యను చర్చించండి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
కొన్ని పళ్లు అరిగిపోయాయి...అన్ని పళ్లూ కట్టించుకోక తప్పదా?
నా వయసు 60 సంవత్సరాలు. బీపీ, షుగర్ ఉన్నాయి. పళ్లు బాగా అరిగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని పళ్లు పీకించాను. మిగిలిన పళ్లతో అంత బాగా నమిలి తినలేకపోతున్నాను. డాక్టర్‌ను కలిస్తే అన్ని పళ్లూ పీకేసి, కొత్తవి కడదాం అన్నారు. భయమేసి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. నేను అన్ని పళ్లూ పీకించాలంటారా? సలహా ఇవ్వండి. - ఎస్. జయలక్ష్మి, హైదరాబాద్ ఎవరికైనా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంతోపాటు నోటిలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. పళ్లను... నమలడానికి దశాబ్దాల తరబడి వాడుతుంటాం. కాబట్టి అరిగిపోవడం సాధారణమే. కొంతమందికి ఎక్కువగా, మరికొంతమందికి తక్కువగా అరుగుతుంటాయి. ఇక బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు తోడైనప్పుడు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా సరిగా పనిచేయక సహజసిద్ధమైన దంతపరిరక్షక వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్లకు సంబంధించిన జబ్బులు వంటివన్నీ పళ్లు పూర్తిగా దెబ్బతినడానికి కారణమవుతాయి. షుగర్ పేషెంట్లలో అసిటోన్ స్మెల్ అనే నోటి దుర్వాసన కూడా ఉంటుంది. అందుకే యాభై సంవత్సరాలలోపు కంటే ఆపై వయసున్నవారే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా దంతవైద్యుడిని కలిసి తగిన సలహాలు, సూచనలు పొందాలి. ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకుంటుండాలి. అరిగిన లేదా విరిగిన పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, తొడుగులు వేయడం ద్వారా బాగా నమిలి తినే శక్తిని తిరిగి తీసుకురావచ్చు. చిగుళ్ల జబ్బులు నయం చేసే క్యూరటాస్, ఫ్లాప్ ట్రీట్మెంట్, ప్రత్యేక లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పళ్లు ఊడినా లేదా తీసేసినా, వెంటనే కృత్రిమ దంతాలను అమర్చుకోవడం తప్పనిసరి. ఒకటిరెండు పళ్లు పోతే ఏమైందిలే, మిగిలిన పళ్లతో మేనేజ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ, ఏదైనా ఒక దవడలో ఒక పన్ను లేకుంటే 25 శాతం నమిలే శక్తిని కోల్పోతారని ఒక అంచనా. ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. వాటిని ఎంత బాగా నమిలి, జీర్ణం చేసుకోగలుగుతున్నాం, ఎంత ఒంటబట్టించుకోగలుగుతున్నాం అనేది కీలకం. అందుకే నమిలే శక్తి బాగా ఉన్నంతకాలం ఎవరూ ముసలితనాన్ని ఫీలవరు. నోటి ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోగలిగినంతకాలం వృద్ధాప్యం రాదు. వీరిపట్ల ప్రతి ఒక్కరూ కాస్తంత అవగాహన కలిగి ఉండాలి. స్పెషలిస్టును కలిసి, చికిత్స చేయించుకోండి. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
బాబు చేత బ్రష్ చేయించడం ఎలా?
మా బాబు వయసు ఐదు సంవత్సరాలు. పళ్లు సరిగ్గా తోముకోడు. పేస్ట్ తినేస్తుంటాడు. పొద్దున్నే చాక్లెట్లు తింటాడు. నేను దంతసమస్యలతో ఎంతో బాధపడ్డాను. వాడికి కూడా అలాగే అవుతుందేమోనని కంగారుగా ఉంది. ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - పి. అనిత, గూడూరు చిన్నపిల్లలతో బ్రష్ చేయించటం, చాక్లెట్లు మానిపించటం అంత సులభం కాదు. క్రమపద్ధతిలో నేర్పితే తప్ప చిన్నప్పటినుంచి మంచి అలవాట్లు రావు. మీరు చెబుతున్న సమస్య డెబ్భై శాతం మంది పిల్లల్లో ఉండేదే. చిన్నప్పటి నుంచే... మార్కెట్లో దొరికే బేబీ బ్రష్‌లతో తల్లిదండ్రులే పిల్లలకు బ్రష్ చేయిస్తుండాలి. మొదట్లో మారాం చేసినా, తర్వాత అలవాటవుతుంది. బ్రష్ చేసుకునేటప్పుడు పిల్లలు ఆ పేస్ట్ మింగటం, అదేపనిగా పేస్ట్ తినటం సాధారణమే. దీనివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినదు. ఎందుకంటే అంత హానికరమైన రసాయనాలేమీ టూత్ పేస్ట్‌లో ఉండవు. పిల్లలెవరైనా పళ్లు తోముకోవటానికి పేచీపెడుతున్నారంటే అందుకు కారణం... బ్రషింగ్ చేసే విధానం వల్ల అసౌకర్యం ఉండటమో, పంటిలో రంధ్రాలుండటమో, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలుండటమో కారణం అయి ఉండాలి. అందుకే మూడు సంవత్సరాల వయసు నుంచి పిల్లల్ని క్రమం తప్పకుండా, ఆరు నెలలకోసారి డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి, చెకప్ చేయిస్తుండాలి. సరైన సమయంలో సమస్యను గుర్తిస్తే చికిత్స అవసరం లేకుండానే సరిచేయించవచ్చు. చక్కటి నోటి ఆరోగ్యానికీ, అందమైన చిరునవ్వుకూ ఈ వయసులోనే బీజం పడుతుంది. అందుకే పన్నెండేళ్ల లోపు తీసుకునే జాగ్రత్తలే కీలకం. ఎత్తుపళ్లు, వంకరపళ్లు, పిప్పిపళ్లు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు... వీటన్నిటిపైనా వంశపారంపర్య ప్రభావం ఉంటుంది. ఆహారపు అలవాట్లు, తల్లిదండ్రులనుసరించే దంత సంరక్షణ పద్ధతులు... ఇవన్నీ నోటి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలెప్పుడూ తల్లిదండ్రులనే రోల్‌మోడల్స్‌గా తీసుకుంటారు. పెద్దవాళ్లు సరిగా బ్రష్చేసుకోకుంటే పిల్లలు కూడా అలానే అలవాటు పడతారు. పిల్లలకు చాక్లెట్లు ఎక్కువగా తినడం నేర్పించేది నిజానికి పెద్దవాళ్లే. మనం అనుభవించిన సమస్యలు పిల్లలు అనుభవించకూడదనుకుంటే మొదట పెద్దవాళ్లు మారాలి. వాళ్లను చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఆధునిక దంతవైద్యంలో దంతసమస్యలు రాకుండా చేయగలిగే చికిత్సాపద్ధతులు ఉన్నాయి. ఫ్లోరైడ్ అప్లికేషన్స్, ఫిజర్ సీలెంట్స్ లాంటి చికిత్సల ద్వారా పిల్లల్లో పిప్పిపళ్లు రాకుండా నివారించవచ్చు. అలాగే ఎత్తుపళ్లు, వంకరపళ్లులాంటి సమస్యలు వస్తాయని ముందుగా పసిగట్టగలిగితే, చిన్న చిన్న చికిత్సలతోనే నయం చేయవచ్చు. అందమైన చిరునవ్వు ఎలా పొందవచ్చో తెలియచేయవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
గారను క్లీన్ చేయిస్తే పళ్లు వదులైపోతాయా?
నా వయసు 25. నాకు పన్ను మీద పన్ను ఉంటుంది. డాక్టర్ని కలిస్తే వాటిలో ఒక పన్ను తీసేసి క్లిప్పుతో సరిచేస్తానన్నారు. ఇంట్లో వాళ్లు పన్నుమీద పన్ను ఉంటే అదృష్టం అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. సలహా ఇవ్వగలరు. - బి. రమ్యశ్రీ, హైదరాబాద్ ఇది చాలామందికి వుండే సమస్యే. వంకరపన్ను వల్ల అందమైన చిరునవ్వు దూరమవుతుంది. చిగుళ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వంకరటింకర పళ్లున్నవారిలో చిగుళ్లనుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్న వయసులోనే వీటిని సరిచేయించడం మంచి ది. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం వస్తుందన్నది పూర్తి అశాస్త్రీయమైనది. మూఢనమ్మకం కూడా. మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్టును కలిసి మీ సమస్యను దూరం చేసుకోండి. నా వయసు 32. చిన్నప్పటినుంచి గుట్కా, పాన్‌పరాగ్ తినడం అలవాటు. దాంతో పళ్లన్నీ నల్లగా అయ్యాయి. నవ్వాలంటే ఇబ్బందిగా ఉంటోంది. నేను పళ్లను క్లీన్ చేయించి, ఇకపై ఈ దురలవాటును మానేయాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల పళ్లన్నీ వదులై ఊడిపోతాయని కొందరు అంటున్నారు. నిజమేనా? తగిన సలహా ఇవ్వవలసింది. - టి. అరుణ్, నెల్లూరు పాన్‌పరాగ్, పాన్‌మసాలా, గుట్కా, జర్దా, వక్కపొడి, తంబాకు నమలడం తదితర అలవాట్లన్నీ నోటి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వీటివల్ల కేవలం పళ్లే కాకుండా నోటిలోని భాగాలన్నీ దెబ్బతింటాయి. పంటిపై ఉండే ఎనామిల్‌పై పొగాకు ఉత్పత్తులలో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇంకిపోయి పంటిపైన ఒక నల్లటిపొరలాగ పేరుకుపోయి క్రమేపీ పంటిరంగు మారిపోతుంది. అంతేకాదు, వీటిలో ఉండే రసాయనాల దుష్ర్పభావం వల్ల లోపలి దవడలు, నాలుక మొద్దుబారిపోతాయి. ఫలితంగా నోరు పెద్దగా తెరవలేకపోవడం, ఆహారాన్ని నమలలేకపోవడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం తదితర సమస్యలతోబాటు నోటిక్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పు తెలుసుకుని గుట్కా మానేయాలని నిర్ణయించుకోవటం అభినందనీయం. మీ స్నేహితులు చెప్పినట్లుగా గార పట్టిన పళ్లను క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్లు వదులైపోవు. స్పెషలిస్ట్‌ను కలిస్తే స్కేలింగ్, పాలిషింగ్‌తో పంటిపైన ఉండే గారను తొలగించి, బాగున్న పళ్లను బ్లీచింగ్ వంటి చికిత్సలతో మరింత తెల్లగా చేస్తారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం మరచిపోవద్దు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
చిన్న సమస్యకు అంత పెద్ద చికిత్స అవసరమేనా?
నా వయసు 35. ఈ మధ్య పళ్లు లాగుతున్నట్లు అనిపిస్తే డెంటిస్ట్ దగ్గరకెళ్లాను. ఆయన ఎక్స్‌రే తీసి చిగుళ్లకు చిన్న సర్జరీ చేయాలని, లేకుంటే పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందన్నారు. నాకైతే సమస్య అంత పెద్దగా అనిపించడం లేదు. డాక్టర్గారేమో ఆపరేషన్ చేస్తానంటున్నారు. ఎందుకో అనుమానంగా ఉంది. ఇది నిజమేనంటారా? సలహా ఇవ్వండి. - బి. లక్ష్మి, కాకినాడ దంత సమస్యల్లో చాలా వరకు నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేవేనని చెప్పుకోవచ్చు. మనందరికీ ప్రతి ఆరునెలలకోసారి రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలవడం అనే అలవాటు లేకపోవడం, దంత సమస్యల పట్ల అవగాహన తక్కువగా ఉండటంతోపాటు బాగా నొప్పి ఉంటేనే జబ్బు వచ్చినట్లుగానూ, నొప్పి, బాధ లేకపోతే చిన్న సమస్యగా భావిస్తాం. అందువల్లే చాలా దంత సమస్యలు డాక్టర్ గారు ఎక్స్‌రే, స్కానింగ్ తీసినప్పుడు బయట పడతాయి. ఇవి కేవలం నోటి ఆరోగ్యానికే కాకుండా శరీర ఆరోగ్యం విషయంలో కూడా వర్తిస్తుంది. బహుశ మీ ఎక్స్‌రే చూసినప్పుడ డాక్టర్ గారికి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండటం, పంటికి ఆధారంగా ఉన్న ఎముక అరిగిపోవటం లాంటివి కనిపిస్తే... చిగుళ్లను దృఢంగా చేయడానికి చిన్నపాటి చిగుళ్ల సర్జరీలు చేసుకోమని సలహా ఇస్తుంటారు. ఇప్పటికీ చాలామంది ఇటువంటి సలహా పొందినప్పుడు చికిత్సకు మొగ్గు చూపరు. కారణం వీలైనంత వరకు చికిత్స లేకుండా దానంతట అదే మందులతోనో, ఇంజెక్షన్ల ద్వారానో, వివిధ రకాలైన టూత్ పేస్టుల వంటి వాటితో తగ్గించేసుకుందామనే భావన ఎక్కువగా ఉండటమే. అందుకే మార్కెట్లో దొరికే లేదా అడ్వటైజ్మెంట్లలో కనిపించే ప్రతి టూత్పౌడరునీ, పేస్టునీ కొని ప్రయత్నం చేస్తుంటారు. సమయం గడిచే కొద్దీ సమస్య మరింత ముదిరిపోయి, తర్వాత ఇబ్బంది పడతారు. మీరు కలిసిన స్పెషలిస్టు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుమానంగా అనిపిస్తే మరొక డెంటిస్ట్‌తో సరి చూసుకోవచ్చు. (క్రాస్ వెరిఫికేషన్) ఒకరికి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పు లేదు. కాని జబ్బు ఉందని తెలిసినప్పుడు చిన్నదైనా, పెద్దదైనా చికిత్సని ఏదో ఒక వంకతో వాయిదా వేయడం మంచిది కాదు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్