ప్రమాదంలో విరిగిన పంటిని తిరిగి అమర్చడం సాధ్యమేనా?
మా బాబు వయసు 14 సంవత్సరాలు. క్రికెట్ ఆడుతుంటే ముఖానికి బంతి తగిలి ముందు పన్ను ఒకటి విరిగిపోయింది. అది మేము వెంటనే గమనించలేదు. నోటిలోనుంచి రక్తం కారుతుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. డాక్టర్ గారు పరీక్ష చేసి పన్ను ఊడిందని, దాన్ని తీసుకువచ్చి ఉంటే అతికించేవాడినని చెప్పారు. ఇది నిజమేనంటారా? ఊడిన పంటిని తిరిగి అమర్చవచ్చా? ఏం చేయాలో సలహా ఇవ్వండి.
-వి. అపర్ణ, ఖమ్మం
పిల్లల్లో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణం. ఆడుకునేటప్పుడు కాని, లేదా యాక్సిడెంట్ల వల్లగాని ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు పళ్లు కూడా విరిగిపోవడమో, ఊడిపోవడమో జరుగుతుంటాయి. దెబ్బ తగిలిన చోట రక్తం కారుతుండడంతో నొప్పి, బాధతో రక్తాన్ని చూసి భయపడి పోతుంటారు. కంగారులో ఇంకేమీ పట్టించుకోకుండా డాక్టరు దగ్గరకి పరుగెడతారు. పరీక్షలు చేసిన తర్వాత గానీ, అక్కడేం జరిగిందో తల్లిదండ్రులకి కానీ, దెబ్బలు తగిలించుకున్న పిల్లలకు కానీ సరిగా గమనించే అవకాశం లేదు.
పళ్లు సాంతం ఊడిపోయి కిందపడిపోతే వాటిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఊడిన పంటిని అదే స్థానంలో బిగించవచ్చు. అలా పంటిని సహజంగానే తిరిగి పొందవచ్చు. కానీ దెబ్బ తగిలిన వెంటనే ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి... దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే కంగారు పడకుండా ధైర్యాన్నివ్వాలి. శ్వాస సరిగా తీసుకోగలుగుతున్నారా లేదో పరిశీలిస్తూ వీలైతే చల్లని నీటితో కళ్లు తుడవటమో లేదా నీళ్లు ముఖం మీద చిలకరించటమో చేసి, వారు పూర్తిగా స్పృహలోకి వచ్చేలా చేయాలి.
పళ్లు ఊడిన చోట రక్తం వస్తుంటే శుభ్రమైన వస్త్రాన్ని లేదా కర్చీఫ్‌ను లేదా దూది ఉండను ఉంచి పళ్లతో గట్టిగా అదిమి ఉంచమని చెప్పాలి. ఈలోగా దెబ్బలు తగిలిన ప్రదేశంలో జాగ్రత్తగా వెదికి, పన్ను కనుక కనపడితే దానిని శుభ్రంగా కడిగి, ఒక చిన్న కవరులోగానీ, భరిణలోగానీ చల్లటి నీటిలో లేదా చల్లటి పాలలో భద్రపరిచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఇలా తీసుకెళ్లిన పంటిని దంతవైద్యుడు అదే స్థానంలో తిరిగి బిగించగలుగుతారు.
కొంతమందికి పళ్లు పూర్తిగా ఊడిపోకుండా ఒక పక్కకు తిరిగి పోవటమో, కదిలిపోవటమో జరగవచ్చు. మరికొన్ని సందర్భాలలో పన్ను కొద్దిగా లేదా సగం దాకా విరిగిపోవటం చూస్తుంటాం. ఇలా కదిలి పోయిన పళ్లను తిరిగి యథాస్థానంలో అమర్చవచ్చు. విరిగిన పళ్లను ఒకటి లేదా రెండు సిట్టింగ్‌లలోనే బిల్డప్ చేయడం ద్వారా గానీ లేదా తొడుగు వేయడం ద్వారా కానీ చూడటానికి మామూలుగా కనిపించేలా చేయవచ్చు.
మీ బాబు విషయంలో కంగారు పడవద్దు. దానికి దీటైన కృత్రిమ దంతాన్ని అమర్చడం ఆధునిక దంత వైద్యంలో సాధ్యమే. ఫిక్స్‌డ్ విధానంలో శాశ్వతంగా బిగించే పళ్లు మిగిలిన పళ్ల రంగులో కలిసిపోయి, చూడటానికి కూడా ఎంతో సహజంగా కనిపిస్తాయి. వెంటనే డెంటల్ స్పెషలిస్ట్‌ను కలిసి సమస్యను చర్చించండి.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్