ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఈ దంత సమస్యలేమిటి?
నా వయసు 25. ఒక పన్ను పుచ్చింది. ఈ మధ్యే చికిత్స చేయించుకున్నాను. మా నాన్నగారు నా చిన్నప్పటినుంచి చాలా పంటి జబ్బులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేను ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా నాకూ పంటిసమస్యలు వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు.
-డి.అశోక్, హైదరాబాద్
మనం దేనిని ఉపయోగించినా లేకపోయినా, పళ్లను, నోటిని మాత్రం నిత్యం నిరంతరం ఉపయోగిస్తునే ఉంటాము. దానికితోడు రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి ప్రభావితమవుతుంటాయి. మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు... నోటి ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. పంటికి అతుక్కుపోయే అహార పదార్థాలు... అంటే చాక్లెట్లు, స్వీట్లు, బేకరీ ఫుడ్ వంటివి పళ్లకు అనర్థదాయకం. పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా సులభంగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈమధ్య అందరూ జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఇది పంటిపైన, పంటిసందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. ఫలితంగా అన్ని రకాల దంతసమస్యలూ మొదలవుతాయి. వీటితోపాటుగా మరెన్నో అంశాలు కూడా నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వంశపారంపర్య సమస్యలు, మనం నివసించే పరిసరాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లాంటివెన్నో పంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
మరో ముఖ్యవిషయం... రోజూ ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు కొంతమంది. అతి జాగ్రత్తకు పోయి పళ్లని దాదాపు అరగంటసేపు బరాబరా తోమేస్తుంటారు మరికొంతమంది. నిజానికి ఈ రెండు పద్ధతులూ సరైనవి కావు. రోజూ నిద్రలేవగానే, ఆ తర్వాత పడుకునే ముందు నాలుగు నిమిషాలపాటు శుభ్రంగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది.
ఖరీదైన పేస్టు, వింత వింత బ్రష్‌ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టి పెడుతూ శాస్త్రీయమైన పద్ధతిలో... వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్‌పిక్స్, పిన్నులు లాంటివి పళ్లల్లో పెట్టి కెలుక్కోకూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటు మౌత్‌వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కూడా వాడుతుండాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు.
ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి డెంటిస్ట్‌ను కలిసి చెకప్ చేయించుకోవటం, రెగ్యులర్‌గా చేసుకునే క్లీనింగ్, స్కేలింగ్, పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను చాలామేరకు నివారించవచ్చు.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్