సాక్షి, మహబూబాబాద్: వైద్యసేవల నిమిత్తం కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా అబార్షన్ చేయటం చట్టరీత్యానేరం. ఈ విషయం సామాన్యులకు తెలుసో, తెలియదో కానీ ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వైద్యులకు తెలియదని అనుకోవటం పొరపాటే. కానీ నిబంధనలు, చట్టాలు ఇవేమీ తమకు పట్టవంటూ కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. వీరికి తోడుగా గ్రామాల్లో ప్రాథమిక చికిత్స అందించే ఆర్‌ఎంపీలు సైతం ఇటువంటి ఆబార్షన్‌లనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఖమ్మంలో ఈ తరహా దందా రహస్యంగా సాగుతోంది. ఈ దందాలో గ్రామీణ ప్రాంతాలలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలే కీలకంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.
సామాజిక చైతన్యం లేకపోవటమే
నిరక్షరాస్యత, సామాజిక చైతన్యం లేని వాళ్లల్లో చాలా మంది ఆడ పిల్లలు వద్దనుకుంటున్నారు. పేదరికం తదితర కారణాలతో ఇక్కడి తల్లిదండ్రులు తమకు మగపిల్లాడు కావాలని కోరుకుంటున్నారు. దీని కోసం తమకు పుట్టబోయే సంతానం ఆడ, మగ తెలుసుకోవాలని ఆర్‌ఎంపీ డాక్డర్లను సంప్రదిస్తున్నారు. తమ దగ్గరికి వచ్చిన వారికి అవగహన కల్పించాల్సిన ఆర్‌ఎంపీలు డబ్బే ధ్యేయంగా, తమకు తెలిసిన స్కానింగ్ కేంద్రాల్లో రహస్యంగా పరీక్షలు చేయిస్తూ, ఆడపిల్ల అని తేలితే సొంతగా వారే ఆబార్షన్‌లు చేస్తున్నారు. అలాగే జిల్లాలో కొంతమంది అవాహితలు గర్భందాల్చిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవడానికి వీరిని సంప్రదిస్తున్నారు.
ఇదే ఆసరాగా వారి దగ్గర నుంచి డబ్బు దండుకోవటంతో పాటు, వారిని బెదిరించి అన్ని రకాలుగా వాడుకుంటున్నా సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా వైద్యధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామాల్లో అనాధికారికంగా కొనసాగుతున్నా పాలీ క్లీనిక్‌లను తరుచూ తనిఖీలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు.
భవిష్యత్... భయానకం
జిల్లాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 996 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. సకుటుం బ సమగ్ర సర్వే ప్రకారం 986 మంది మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్‌లో ఎదుర య్యే ప్రమాద ఘంటికల్ని తెలియజేస్తున్నాయి.
చట్టరీత్యా చర్యలు
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పై ప్రజలకు విస్తృతంగా అవగహన కల్పిస్తున్నాం. ముందుగా ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. ఆడపిల్ల మనజాతికి పునాది అని గ్రహించాలి. అలాగే ఎవరైన లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం గాని, అబార్షన్లు చేస్తున్నట్లు తేలితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నాం. చట్టవ్యతిరేఖ పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ధనసరి శ్రీరాం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment