- రూ.58.44 కోట్లతో 487 పంచాయతీలకు సొంత భవనాలు
- రూ.25 లక్షలతో మండలానికో ఎమ్మార్సీ భవనం
- రూ.2 కోట్లతో జిల్లా కేంద్రంలో డీఆర్సీ భవనం
- రూ.3.76 కోట్లతో 376 పంచాయతీల్లో కంప్యూటరీకరణ
- 142 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం
చిత్తూరు(టౌన్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆర్‌జీపీఎస్‌ఏ’ (రాజీవ్ గాంధీ పంచాయతీ స్వశక్తీకరణ్ అభియాన్) పథకంతో జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలకు మహర్దశ కలగనుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
487 పంచాయతీలకు సొంత భవనాలు
జిల్లాలో మొత్తం 1,363 పంచాయతీలున్నాయి. వాటిలో 487 పంచాయతీలకుసొంత భవనాలు లేవు. వాటన్నిటికీ రూ.58.44 కోట్లతో సొంత భవనాలను నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఐదు వేల మంది జనాభాకులోగా ఉండే పంచాయతీకి రూ.12 లక్షలు, దానికన్నా ఎక్కువగా ఉండే పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున మంజూరు చేసింది.మరమ్మతుల కోసం ఒక్కోదానికి రూ.3 లక్షలను మంజూరు చేసింది. వీటిని అంచెలంచెలుగా కంప్యూటరీకరణ చేపట్టనుంది. కంప్యూటర్ ఆపరేటర్లను కూడా ప్రభుత్వమే నియమించి వారికి జీతాలను చెల్లించనుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని రికార్డులను కంప్యూటరైజేషన్ చేయడం, గ్రామసభల నిర్వహణకు సంబంధించిన ఫొటోలు, మినిట్స్‌బుక్కులను స్కాన్‌చేసి నెట్‌లో పెట్టడం తదితర కార్యక్రమాలకు వీటిని ఉపయోగించుకునే వీలుకల్పిస్తోంది. ఫోన్‌బిల్లులనూ కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది.
రూ.18.25 కోట్లతో ఎమ్మార్సీ, డీఆర్సీ భవనాలు
స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించేందుకు అనువుగా ప్రతి మండలంలోనూ ఒక ఎమ్మార్సీ భవనాన్ని నిర్మించనుంది. దీనికోసం ఒక్కోదానికి రూ.25 లక్షలు, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్‌సీ భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలోని 65 మండలాల్లో నిర్మించే ఎమ్మార్సీ, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్‌సీ భవనానికి గాను మొత్తం రూ.18.25 కోట్లు ఖర్చు చేయనుంది.
కంప్యూటరీకరణలో మనమే ఫస్ట్
జిల్లాలోని 1,363 గ్రామ పంచాయతీల్లో తొలిదశగా 448 కంప్యూటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో మండలానికొకటి చొప్పున 65 మండలాలకు 65 కంప్యూటర్లు, 2 జెడ్పీకి, మరో 2 డీపీవో కార్యాలయానికి, 3 డీఎల్‌పీవో కార్యాలయానికి, 376 పంచాయతీలకు మంజూరు చేసింది. ప్రతి పంచాయతీకి ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అవి పనిచేయడానికి బ్యాటరీతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లును చేపడుతున్నారు. వీటికోసం ప్రతి పంచాయతీకి ఇంచుమించు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టింది. భవనాలు ఉన్న పంచాయతీల్లో కంప్యూటరీకరణ కోసం రూ.3.76 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టింది. అయితే ఫోన్ కనెక్షన్ అందుబాటులో ఉండే 142 గ్రామ పంచాయతీలకు బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించింది. పంచాయతీల కంప్యూటరీకరణలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
135 పంచాయతీలకు డంపింగ్ యార్డులు
జిల్లాలోని 135 పంచాయతీలకు డంపిం గ్ యార్డుల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. దీనికోసం ప్రతేకంగా నిధులను మంజూరు చేసింది. చెత్తను సేకరించడానికి ట్రైసైకిళ్లు, యార్డు చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం, బోరుబావి తవ్వకం, చెత్తను కత్తిరించే యంత్రాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం తదితరాల కోసం నిధులను విడుదల చేసింది.