printer
-
ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్
స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక జనాలకు ఎడాపెడా సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు ఎంతసేపూ ఫోన్లోనో, కంప్యూటర్లలోనో చూసుకోవడమే తప్ప పాతకాలంలోలా వాటిని ప్రింట్ చేయించి, ఆల్బమ్స్‌లో దాచుకునే అలవాటు దాదాపు అంతరించింది.అయితే, సెల్ఫీలను ప్రింట్ చేసుకుని, దాచుకోవాలనే ముచ్చట కూడా కొందరికి ఉంటుంది. ఆ ముచ్చట తీర్చడానికే జపానీస్ కెమెరాల తయారీ కంపెనీ ‘కేనన్’ తాజాగా సెల్ఫీ ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెల్ఫీ క్యూఎక్స్20’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రింటర్‌తో స్మార్ట్‌ఫోన్ నుంచి ఫొటోలను నేరుగా ముద్రించుకోవచ్చు.అలాగే, లాప్టాప్, డెస్క్‌టాప్‌లలో భద్రపరచుకున్న ఫొటోలను కూడా ముద్రించుకోవచ్చు. సెల్ఫీ లేఔట్ యాప్ ద్వారా ఈ ప్రింటర్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రింట్ తీసుకోవడానికి ముందు ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి, ఎంపిక చేసుకున్న ఫొటోల కొలాజ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ. 7,495 మాత్రమే! -
నిజమే..! ఇది మంత్రదండంలాంటి 'ఏఐ' ఉంగరమే..!!
ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఉంగరం. దీనిని వేలికి తొడుక్కుంటే, మంత్రదండం చేతిలో ఉన్నట్లే! వాయిస్ కమాండ్స్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. రిమోట్ కంట్రోల్‌తో పని లేకుండా, కమాండ్స్‌ను గుసగుసలుగా వినిపిస్తే చాలు. రిమోట్‌తో చేసే పనులన్నీ ఇదే చేసిపెడుతుంది.అమెరికన్ కంపెనీ ‘వీటచ్’ ఈ ఉంగరాన్ని ‘విజ్పీఆర్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇంటికి దూరంగా ఉన్నా, దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు టీవీ ఆఫ్ చేయడం మరచిపోయి, ఇంటికి తాళం వేసి బయటకు వచ్చేశారనుకోండి, ఈ ఉంగరాన్ని నోటి దగ్గరకు తెచ్చుకుని గుసగుసగా కమాండ్ వినిపిస్తే చాలు.ఇంట్లోని టీవీని వెంటనే ఆఫ్ చేసేస్తుంది. ఇది మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిని యాపిల్ హోమ్‌కిట్, గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సా, చాట్ జీపీటీ, శామ్సంగ్ స్మార్ట్థింగ్స్లలో దేనితోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర 199 డాలర్లు (రూ.16,632) మాత్రమే!చేతిలో పట్టేసే ప్రింటర్..కంప్యూటర్ ప్రింటర్లు సాధారణంగా భారీగా ఉంటాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు వాటిని తేలికగా తీసుకుపోవడం సాధ్యం కాదు. అయితే, చేతిలో పట్టేసే పరిమాణంలో ఉన్న ఈ ఇంక్జెట్ ప్రింటర్‌ను అమెరికన్ డిజైనర్ జాన్ బ్రాంకా రూపొందించాడు. ఈ ప్రింటర్‌ను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు.డెస్క్‌టాప్, లాప్టాల్లలోని ఫైళ్లతో పాటు టాబ్, మొబైల్ ఫోన్లలోని ఫైళ్లను కూడా దీని ద్వారా సులువుగా ముద్రించుకోవచ్చు. ‘స్క్రైబ్’ పేరుతో రూపొందించిన ఈ ప్రింటర్ కేవలం ప్రింటర్‌గా మాత్రమే కాకుండా, స్కానర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో గరిష్ఠంగా ఏ4 పరిమాణం వరకు మాత్రమే ఫైళ్లను ముద్రించుకోవడం సాధ్యమవుతుంది. దీని ధర 1250 డాలర్లు (రూ.1.04 లక్షలు).ఇవి చవవండి: తొలి సజీవ కంప్యూటర్ని.. మీరెప్పుడైనా చూశారా!? -
నొప్పి తెలియకుండా .. ఏఐ సాయంతో టాటూ ప్రింటర్ లాంచ్ చేసిన ఎల్జీ
పచ్చబొట్లకు ఫ్యాషన్ ప్రపంచంలో విపరీతమైన గిరాకీ ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా టాటూ స్టూడియోలు కళకళలాడుతుంటాయి. అయితే, టాటూ వేయించుకోవాలంటే ఖర్చును, నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. కోరుకున్న డిజైన్లలో పచ్చబొట్టు వేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. కోరుకున్న డిజైన్లలోని పచ్చబొట్లను చిటికెలో ముద్రించే ఈ టాటూ ప్రింటర్‌ను కొరియన్ బహుళజాతి సంస్థ ఎల్జీ ఇటీవల రూపొందించింది. చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉన్న ఈ టాటూ ప్రింటర్ శరీరంపైనే కాకుండా, దుస్తులపై కూడా కోరుకున్న డిజైన్లను క్షణాల్లోనే ముద్రిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టాటూ ప్రింటర్‌ను మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. యాప్ ద్వారా డిజైన్లను ఎంపిక చేసుకుని, టాటూను ముద్రించదలచుకున్న చోట దీన్ని ఉంచి, ఆన్ చేసుకోవడమే తరువాయిగా రకరకాల రంగుల్లో, రకరకాల డిజైన్లలో టాటూలను ముద్రించుకోవచ్చు. ‘ఎల్జీ హెచ్ అండ్ హెచ్ ఇంప్రింటు’ పేరుతో రూపొందించిన ఈ టాటూ ప్రింటర్‌ను ఎల్జీ కంపెనీ ఈ ఏడాది లాస్ వేగస్‌లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ప్రదర్శించనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది త్రీడీ ప్రింటర్. హాంకాంగ్‌కు చెందిన త్రీడీ ప్రింటర్ల తయారీ సంస్థ ‘ఎనీ క్యూబిక్’ దీనిని తాజాగా రపొందించింది. ఈ అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్ మోడల్ పేరు ‘ఎనీక్యూబిక్ కోబ్రా2’. ఇది మిగిలిన త్రీడీ ప్రింటర్లతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా కోరుకున్న వస్తువులను ముద్రించగలదు. దీనిని పది నిమిషాల్లోనే అసెంబుల్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న 4.5 అంగుళాల టచ్ స్క్రీన్ ద్వారా ప్రింట్ చేయాలనుకున్న వస్తువుల తీరుతెన్నులను సవరించుకోవచ్చు. ఇది లెవిక్యూ-2.0 ఆటో లెవెలింగ్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఈ ప్రింటర్ సెకనుకు 250 మిల్లీమీటర్ల వేగంతో వస్తువులను ముద్రిస్తుంది. ప్రాజెక్టులు, వర్క్‌షాపుల కోసం అనువుగా ఉండేలా దీనిని రపొందించారు. స్వల్పవ్యవధిలోనే ప్లాన్లు, డిజైన్లు చేయాలనుకునే ఇంజినీర్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని ధర 499 డాలర్లు (ర. 41,098) మాత్రమే! -
ఇదో కొత్త రకం ప్రింటర్.. ప్రింట్ చేసిన కాగితాన్ని 10 సార్లు వాడొచ్చు!
అచ్చేసిన కాగితాన్ని ఎన్నిసార్లు వాడొచ్చు? ఒకసారి అచ్చేసిన కాగితాన్ని ఏ పొట్లాలు కట్టుకోవడానికో తప్ప ఇంకెన్నిసార్లు వాడగలరేంటి అనుకుంటున్నారా? ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. ఇప్పటికీ సమాధానం తట్టడం లేదా? సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. అచ్చేసిన కాగితాన్ని అక్షరాలా పదిసార్లు వాడుకోవచ్చు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపడుతున్నారా? ఇంతవరకు అసాధ్యంగా ఉన్నదాన్నే ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి చూపించారు. అదెలాగో తెలుసుకుందాం... కంప్యూటర్లు వచ్చాక, ఆఫీసుల్లో ప్రింటర్ల వాడకం పెరిగింది. ఒకసారి ప్రింట్ చేసిన కాగితాన్ని మళ్లీ వాడుకునే అవకాశం ఉండకపోవడంతో కాగితాల వినియోగానికి కోతపెట్టే అవకాశం అసాధ్యమయ్యేది. అప్పటికీ కాగితం వినియోగాన్ని వీలైనంతగా తగ్గించేందుకు, కాగితానికి రెండువైపులా ముద్రించే ప్రింటర్లనూ తయారు చేశారు. ఇప్పుడు చాలా చోట్ల కాగితానికి రెండువైపులా ప్రింట్ చేసే ప్రింటర్లు వాడుకలోకి వచ్చాయి. వీటివల్ల కాగితాల వాడకం సగానికి సగం తగ్గింది. కాగితాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, ప్రింట్ చేసిన కాగితాలను పునర్వినియోగం చేసుకునేలా ఇజ్రాయెల్‌లోని ‘రీప్’ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుత సాధనాన్ని తయారు చేశారు. ఇది ప్రింటర్లాగానే కనిపిస్తుంది గాని, ప్రింటర్ కాదు. ఇది డీప్రింటర్. ప్రింట్ చేసిన కాగితం మీద ఉన్న ఇంకును పూర్తిగా పీల్చేసుకుని, క్షణాల్లోనే కాగితాన్ని మళ్లీ తెల్లగా మార్చేస్తుంది. ఈ డీప్రింటర్ ద్వారా ఇలా ఒక్కో కాగితాన్ని పదిసార్లు వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే, డీప్రింటర్ ద్వారా ఒకటికి పదిసార్లు కాగితాలను వాడుకోవాలంటే, సాధారణ కాగితాల వల్ల సాధ్యం కాదు. ఇంకును పీల్చుకోని విధంగా ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను ప్రింటర్లో వాడాక, ప్రింట్ అయిన కాగితాలను డీప్రింటర్లో వాడుకోవాల్సి ఉంటుంది. పదిసార్లు పునర్వినియోగానికి అవకాశం ఉండటం వల్ల ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను ప్రింటర్లలో విరివిగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయని, డీప్రింటర్ ద్వారా కాగితాల పునర్వినియోగం కూడా బాగా పెరుగుతుందని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగితాలను రీసైక్లింగ్ చేయడం కొత్త కాకున్నా, ప్రింటర్లో ఒకసారి అక్షరాలను ముద్రించేసిన కాగితాలను ఒకటికి పదిసార్లు వాడుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి. రీసైక్లింగ్ చేసిన కాగితాలను టిష్యూలు, టాయిలెట్ పేపర్లు, న్యాప్కిన్లు వంటివాటి తయారీకి ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అలాగే, వార్తపత్రికల కోసం కూడా రీసైకిల్డ్ పేపర్లను ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్నారు. డీప్రింటర్ వాడకం పెరిగితే, కాగితాల వాడకానికి ఇక కళ్లేలు పడగలవనే ఆశించవచ్చు. ∙జగదీశ్వర్ కుమార్ -
మార్కెట్లోకి హెచ్‌పీ స్మార్ట్ట్యాంక్ ప్రింటర్స్
సాక్షి, హైదరాబాద్: హ్యూలెట్ప్యాకర్డ్ (హెచ్‌పీ) సంస్థ..‘హెచ్‌పీ స్మార్ట్ట్యాంక్’ పేరుతో బుధవారం సరికొత్త ప్రింటర్లను విడుదల చేసింది. సులువుగా వా డు కోగలగడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సురక్షితం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా తయారైన ఈ కొత్త ప్రింటర్లు ప్రస్తుతం మూడు మోడళ్లలో లభిస్తున్నట్లు హెచ్‌పీ ప్రింటింగ్ విభాగం ప్రెసిడెంట్ సునీశ్ రాఘవన్ తెలిపారు. హెచ్‌పీ స్మా ర్ట్ ట్యాంక్ 521 కేవలం ప్రింటింగ్‌కు ఉపయోగపడుతుందని, హెచ్‌పీ 510, హెచ్‌పీ 580లు ప్రింట్, స్కానింగ్, కాపీ పనులు చేయగలవ ని చె ప్పారు. ఈ మూడు మోడళ్ల ధరలు రూ. 13,000 –19,000 మధ్యలో ఉంటాయని ఆయన తెలిపారు. చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్ -
కాగితం వృథాను అరికట్టే రోలర్జెట్ ప్రింటర్!
కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాక, ప్రింటర్ల వినియోగం కూడా పెరిగింది. ఆఫీసుల్లో వాడే ప్రింటర్ల వల్ల ఎంతో కొంత కాగితం వృథా అవుతుండటం మామూలే. ప్రింటర్ల వల్ల కాగితం వృథాను అరికట్టే ఉద్దేశంతో దక్షిణ కొరియాకు చెందిన డిజైనర్ జిసాన్ చుంగ్ ప్రయోగాత్మకంగా ‘రోలర్జెట్ ప్రింటర్’కు రూపకల్పన చేశాడు. పేపర్షీట్స్ బదులు పేపర్‌రోల్స్ వాడటానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దాడు. ప్రింటింగ్ పూర్తయ్యాక, ప్రింట్ అయినంత మేరకు దీని నుంచి కాగితాన్ని కత్తిరించి తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నమూనాగా రూపొందించిన ఈ ప్రింటర్ పనితీరు బాగున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెద్దస్థాయిలో దీని తయారీ చేపడితే, ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. -
ప్రింటేసి.. తుడిచేసి.. ఒకే పేపర్‌పై మళ్లీ మళ్లీ ప్రింటింగ్!
సాధారణంగా ప్రింటర్లో ఏమైనా ప్రింట్ చేశామంటే.. ఆ కాగితాలను అవసరం ఉన్నంతసే పు ఉంచేయడం.. ఆ తర్వాత పడేయడమే.. కానీ కా గితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగితే!? ఈ ఐడియా చాలా బాగుంది కదా.. అటు పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ ఉంటుంది, ఇటు ఖర్చూ తగ్గుతుంది. పైగా తరచూ కాగితాలు తెచ్చుకోవడం దగ్గరి నుంచి వాటిని పడేయడం దా కా ఎంతో శ్రమ కూడా తప్పుతుంది. ఈ క్రమంలోనే రీప్ సంస్థ.. కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్’ను రూపొందించింది. అంటే ప్రింటర్ ఇంకును ముద్రిస్తే.. ఈ డీ ప్రింటర్ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలను ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్ సర్క్యులర్ ప్రింట్ (ఆర్సీపీ)’ అని పేరు పెట్టారు. ప్రత్యేకమైన పేపర్.. లేజర్ క్లీనర్‌తో.. డీప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే.. అందుకోసం కాస్త మార్పులు చేసిన ప్రత్యేకమైన పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ పేపర్‌ను ప్రింటర్లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ముద్రితం అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్ ఇంకును ఆవిరి చేసేస్తుంది. దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. అంటే కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది. -
సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం!
స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి. స్మార్ట్ఫోన్లకు కెమెరాలు తప్పనిసరి హంగు. చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే జనాలు ఆగుతారా? ఎడాపెడా సెల్ఫీలతో పాటు ప్రయాణాల్లో కనిపించిన దృశ్యాలనల్లా ఫొటోలు తీసేయడం మామూలైపోయింది. వందలాదిగా తీసిన ఫొటోలను ప్రింట్ చేయడం కొంత కష్టమే! ఫొటో ల్యాబ్‌లకు వెళ్లాలి. స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి, నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ప్రింట్ చేయించుకోవాలి. ఇదంతా కొంత ప్రయాసతో కూడిన ప్రక్రియ. ఇప్పుడంత ప్రయాస అక్కర్లేదు. స్మార్ట్‌ఫోన్ కెమెరా ప్రింటర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా జపానీస్ ఫొటోగ్రఫీ బ్రాండ్ ‘ఫుజీ ఫిల్మ్’ స్మార్ట్ఫోన్ల నుంచి ఫొటోలను నేరుగా ప్రింట్ చేసేందుకు అనువైన స్మార్ట్‌ఫోన్ కెమెరా ప్రింటర్‌ను ‘ఇన్స్టాక్స్ మినీలింక్ 2’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ప్రింటర్ కూడా వెంట ఉంటే, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఫొటోలను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది జపాన్‌తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. చదవండి: అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి! -
ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి?
Machine Identification Code: దగ్గరున్న ప్రింటర్లోనో, ఏదో ఇంటర్నెట్ సెంటర్లోనో ఓ తప్పుడు కలర్ డాక్యుమెంట్‌ను ప్రింట్ చేశారు. ఎప్పుడో పాత తేదీని పెట్టుకున్నారు, పేర్లు మార్చారు. తీసుకెళ్లి ఏదో ధ్రువీకరణ కింద చూపించారు. కానీ ఎంత జాగ్రత్తపడ్డా.. ఎక్కడా లేశమాత్రం తేడా లేకుండా డాక్యుమెంట్‌ను ప్రింట్ చేసినా.. అడ్డంగా దొరికిపోయారు. దీనికి కారణం.. యెల్లో డాట్స్ (పసుపు రంగు చుక్కలు). ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? వాటితో లాభమేంటో తెలుసుకుందామా? ప్రింటర్లు నిఘా పెట్టినట్టా? వివిధ గుర్తింపుకార్డుల నుంచి ఇళ్లపత్రాలు, దొంగనోట్ల దాకా.. అక్రమార్కులు అన్నింటిలోనూ నకిలీలను, ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అసలు వాటికి, తప్పుడు పత్రాలకు తేడాను గుర్తించడం చాలా కష్టం కూడా. దీనికి చెక్ పెట్టేందుకే జపాన్‌లో పరిశోధకులు/అధికారులు కలిసి ‘యెల్లో డాట్స్’ను రంగంలోకి తెచ్చారు. ప్రింట్ చేసే ప్రతి పేజీలో.. లేజర్ కలర్ ప్రింటర్లు ప్రతిపేజీలో.. మనం గమనించలేనంత సూక్ష్మంగా, అంటే మిల్లీమీటర్లో పదో వంతు పరిమాణంలో ‘పసుపు రంగు’ చుక్కలను ముద్రిస్తాయి. పేజీలో కాస్త దూరం దూరంగా.. నిర్దిష్ట ఆకృతులు వచ్చేలా ఈ చుక్కలు ఉంటాయి. (ఉదాహరణకు బ్రెయిలీ లిపి మాదిరిగా అనుకోవచ్చు). సదరు ప్రింటర్ కంపెనీ, మోడల్, సీరియల్ నంబర్, సదరు పేజీని ప్రింట్ చేసిన తేదీ, సమయం వివరాలు ఆ ఆకృతుల్లో ఉంటాయి. దీన్ని ‘ప్రింటర్ స్టెగనోగ్రఫీ’ అని పిలుస్తున్నారు. పసుపు రంగే ఎందుకు? సాధారణంగా ఎరుపు, నీలం, నలుపు వంటి రంగులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి, అదే పసుపు రంగును, అందులోనూ లేతగా ఉంటే గుర్తించడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు ఈ రంగును ఎంచుకున్నారు. మనం ప్రింట్ చేసే కాగితాలపై అత్యంత సూక్ష్మంగా, దూరం దూరంగా పసుపు రంగు చుక్కలు ఉంటే.. సాధారణ కంటితో గుర్తించడం దాదాపు సాధ్యం కాదు కూడా. చదవండి: చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్ వివరాలను ఎలా గుర్తిస్తారు? పేజీల్లో ప్రింట్ అయ్యే పసుపు చుక్కల ప్యాటర్న్ (ఆకృతుల)ను గుర్తించేందుకు ‘ఈఎఫ్ఎఫ్ (ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్) ఆన్లైన్ డీకోడర్ల’ను వినియోగిస్తుంటారు. అందులో తేదీ, సమయం వివరాలు సులువు గానే తెలిసిపోతాయి. ఇక ప్రింటర్ మోడల్, సీరియల్ నంబర్ ఆధారంగా.. సదరు ప్రింటర్ కంపెనీ నుంచి వివరాలు తీసుకుంటారు. అధికారులు ఆ ప్రింటర్‌ను ఎవరు కొన్నారు, ఎక్కడ వినియోగిస్తున్నారనేది ట్రేస్ చేసి.. తప్పుడు డాక్యుమెంట్ మొత్తం చరిత్రను బయటికి తీస్తారు. ఇంకేం.. దొంగలు దొరికిపోయినట్టే. ఎప్పటి నుంచో ఉన్నా రహస్యమే.. 2017లో అమెరికాలో ఓ రహస్య పత్రం లీకైంది. దానిపై అక్కడి జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ చేపట్టి.. లీకేజీకి కారణమైన ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్‌ను గుర్తించి, అరెస్టు చేసింది. లీకైన పత్రాల కాపీలపై ఉన్న ఎల్లో డాట్స్ ఆధారంగానే ఆ కాంట్రాక్టర్‌ను పట్టేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశాన్ని రహస్యంగా ఉంచే ఉద్దేశంతో అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి? ► అయితే నకిలీలు, తప్పుడు పత్రాలను గుర్తించడం, ట్రాక్ చేయడంలో భాగంగా.. ఇలా ‘ఎల్లో డాట్స్’ను ముద్రించేలా కొన్ని పెద్ద ప్రింటర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు అమెరికా నిఘా సంస్థలు అంగీకరించడం గమనార్హం. ►ఈ ఎల్లో డాట్స్ ఆకృతుల్లోని సమాచారం ఏమిటని గుర్తించే కోడ్.. అటు ప్రభుత్వం, ఇటు ప్రింటర్ కంపెనీలఉన్నతాధికారులకు మాత్రమే తెలిసి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ చుక్కలను మనమూ చూడొచ్చు భూతద్దాలు వంటి వాటిని ఉపయోగించి పేజీలను పరిశీలిస్తే.. అతి చిన్నగా ఉండే ఈ పసుపు రంగు చుక్కలను గుర్తించవచ్చు. ఇంకా సులువుగా మొత్తం చుక్కలను చూడాలనుకుంటే.. పూర్తి చీకటిలో నీలి రంగు కాంతిని సదరు పేజీపై ప్రసరింపజేయాలని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల సదరు పసుపు రంగు చుక్కలు.. నల్లటి చుక్కల్లా కనిపిస్తాయని వివరిస్తున్నారు. ► కానన్, ఎప్సన్, డెల్, హ్యులెట్ ప్యాకర్డ్, ఐబీఎం, కొనికా, పానసొనిక్, జిరాక్స్, సామ్సంగ్ వంటి చాలా వరకు ప్రింటర్ తయారీ కంపెనీలు ‘ఎల్లో డాట్స్’ టెక్నాలజీని అమలు చేస్తున్నాయని ఈఎఫ్ఎఫ్ సంస్థ పేర్కొంది. ఏయే కంపెనీలకు చెందిన ఏ ప్రింటర్లలో దీనికి వాడుతున్నరన్న జాబితాలను తమ వెబ్సైట్లో కూడా పెట్టింది. బ్లాక్ అండ్ వైట్‌లో కష్టమే.. ఈ ఎల్లో డాట్స్ టెక్నాలజీ కేవలం కలర్ ప్రింటర్లకే పరిమితం. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లలో కేవలం నలుపు రంగును మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆ చుక్కలు సులువుగా కనిపిస్తాయి. సదరు డాక్యుమెంట్‌లోని అక్షరాలు, ఫొటోలు, ఇతర అంశాలు ఈ చుక్కలపై ఎఫెక్ట్ చూపించడంతో.. రహస్య కోడ్ దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
దొంగనోట్ల తయారీ ప్రింటర్ స్వాధీనం
డీఎస్పీ శ్రీనివాసులు మైదుకూరు టౌన్ : దొంగనోట్ల తయారీకి వినియోగించే ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల బద్వేలు రోడ్డులో దొంగనోట్లు చలామనీ చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు దొంగనోట్ల తయారీ కోసం ఉపయోగించే ప్రింటర్‌ను, కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన పి.చంద్రశేఖర్ హైదరాబాద్‌కు వెళ్లి ఆయిల్ ప్రింటింగ్ మిషన్లను తీసుకొచ్చి దొంగనోట్లను ముద్రించేవాడు. వాటిని అక్కడక్కడా ఎవ్వరికీ అనుమానం రాకుండా మార్పిడి చేసేవాడు. దొంగనోట్లకోసం ఉపయోగించే కాగితాలను, ప్రింటర్‌ను, రూ.23,500 దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతనాయక్, హెడ్‌కానిస్టేబుల్ భాగ్యంరెడ్డి, గుర్రప్పలు పాల్గొన్నారు. -
వ్యక్తిగత బ్యాంకు ఖాతా తప్పనిసరి
ఒంగోలు సెంట్రల్ : ప్రతి కుటుంబానికి వ్యక్తి గత ఖాతా తప్పనిసరని, అదే విధంగా జిల్లాలో ఎన్ని కుటుంబాలకు ఇప్పటి వరకూ వ్యక్తిగత ఖాతాలు ఉన్నాయో సర్వే నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎ.పద్మజ ఆదేశించారు. గురువారం స్థానిక టీటీడీ కార్యాలయంలో ఐకేపీకి సంబంధించిన ఏసీలు, ఏపీఎంలతో ఆమె సమావేశమయ్యారు. జన్‌ధన్ పథకం కింద వ్యక్తిగత ఖాతాను ప్రారంభించిన వారికి రూపే డెబిట్ కార్డు అందిస్తారని, అదేవిధంగా లక్ష రూపాయల వరకు సంవత్సరం పాటు వ్యక్తిగత బీమా కల్పిస్తారని చెప్పారు. అగస్టు నెలలో రూ.223 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ రూ.76 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆరు నెలల ముగింపు సందర్భంగా అర్హత కలిగిన ప్రతి గ్రూపునకు రుణం అందజేయాలన్నారు. తీసుకున్న రుణాలను రీపేమెంట్‌కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. ఉలవపాడు, సంతమాగులూరు, చినగంజాం మండలాల్లో రీపేమెంట్లు తక్కువగా ఉన్నాయన్నారు. మండలాల్లో బ్యాంక్ లింకేజిలో సమస్యలు ఉంటే బ్యాంక్ లింకేజి డీపీఎంకు తెలియజేయాలని సూచించారు. స్త్రీనిధి రికవరీలో బాగా వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 56 మండలాలు ఉంటే వీటిలో 50 మండలాల్లో 70 శాతం కుడా రికవరీ కావడం లేదన్నారు. స్త్రీనిధి సంమృద్ధి పథకంలో భాగంగా రూ. 9 కోట్ల లక్ష్యం నిర్దేశిస్తే కేవలం 12 శాతం అంటే కోటి 12 లక్షలు మాత్రమే డిపాజిట్లు సేకరణ జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జన్‌ధన్ పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాలన్నారు. గ్రామాల్లో బ్యాంకింక్ సేవలను ప్రజల ముంగిట తెచ్చేందుకు విలేజ్ లెవల్ ఎంట్రిప్రూనర్స్ను నియమించిన్నట్లు తెలిపారు. స్టేట్ బ్యాంక్‌కు 24 మందిని, ఆంధ్రాబ్యాంక్‌కు 10 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి కావాల్సిన నెట్వర్క్ కార్డు, ల్యాప్‌టాప్, ప్రింటర్, వెబ్కామెరా, తదితర సామగ్రిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మండల అధ్యక్షులు సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రెండు జీరో బ్యాలెన్స్ ఎకౌంట్లను తెరిపించాలన్నారు. గ్రూపులు ఆడిట్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. ఆడిట్ పూర్తి అయిన గ్రూపులకే గ్రేడింగ్‌లు ఉంటాయని, వడ్డీలేని రుణం వర్తిస్తుందన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2,200 మందికి 7 కోట్ల విలువైన యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్దేశించగా 19 మండలాలు మాత్రమే పూర్తి చేసాయన్నారు. మిగిలిన 28 మండలాల్లో కుడా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని పీడీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీఎం ఎల్.నరసింహారావు, డీపీఎంలు నరసింహారావు, విశాలాక్షి, ఎం.సుబ్బారావు, నారాయణ,తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు మహర్దశ
రూ.58.44 కోట్లతో 487 పంచాయతీలకు సొంత భవనాలు రూ.25 లక్షలతో మండలానికో ఎమ్మార్సీ భవనం రూ.2 కోట్లతో జిల్లా కేంద్రంలో డీఆర్సీ భవనం రూ.3.76 కోట్లతో 376 పంచాయతీల్లో కంప్యూటరీకరణ 142 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం చిత్తూరు(టౌన్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆర్‌జీపీఎస్‌ఏ’ (రాజీవ్ గాంధీ పంచాయతీ స్వశక్తీకరణ్ అభియాన్) పథకంతో జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలకు మహర్దశ కలగనుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 487 పంచాయతీలకు సొంత భవనాలు జిల్లాలో మొత్తం 1,363 పంచాయతీలున్నాయి. వాటిలో 487 పంచాయతీలకుసొంత భవనాలు లేవు. వాటన్నిటికీ రూ.58.44 కోట్లతో సొంత భవనాలను నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఐదు వేల మంది జనాభాకులోగా ఉండే పంచాయతీకి రూ.12 లక్షలు, దానికన్నా ఎక్కువగా ఉండే పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున మంజూరు చేసింది.మరమ్మతుల కోసం ఒక్కోదానికి రూ.3 లక్షలను మంజూరు చేసింది. వీటిని అంచెలంచెలుగా కంప్యూటరీకరణ చేపట్టనుంది. కంప్యూటర్ ఆపరేటర్లను కూడా ప్రభుత్వమే నియమించి వారికి జీతాలను చెల్లించనుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని రికార్డులను కంప్యూటరైజేషన్ చేయడం, గ్రామసభల నిర్వహణకు సంబంధించిన ఫొటోలు, మినిట్స్బుక్కులను స్కాన్‌చేసి నెట్లో పెట్టడం తదితర కార్యక్రమాలకు వీటిని ఉపయోగించుకునే వీలుకల్పిస్తోంది. ఫోన్బిల్లులనూ కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. రూ.18.25 కోట్లతో ఎమ్మార్సీ, డీఆర్సీ భవనాలు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించేందుకు అనువుగా ప్రతి మండలంలోనూ ఒక ఎమ్మార్సీ భవనాన్ని నిర్మించనుంది. దీనికోసం ఒక్కోదానికి రూ.25 లక్షలు, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్సీ భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలోని 65 మండలాల్లో నిర్మించే ఎమ్మార్సీ, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్సీ భవనానికి గాను మొత్తం రూ.18.25 కోట్లు ఖర్చు చేయనుంది. కంప్యూటరీకరణలో మనమే ఫస్ట్ జిల్లాలోని 1,363 గ్రామ పంచాయతీల్లో తొలిదశగా 448 కంప్యూటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో మండలానికొకటి చొప్పున 65 మండలాలకు 65 కంప్యూటర్లు, 2 జెడ్పీకి, మరో 2 డీపీవో కార్యాలయానికి, 3 డీఎల్పీవో కార్యాలయానికి, 376 పంచాయతీలకు మంజూరు చేసింది. ప్రతి పంచాయతీకి ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అవి పనిచేయడానికి బ్యాటరీతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లును చేపడుతున్నారు. వీటికోసం ప్రతి పంచాయతీకి ఇంచుమించు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టింది. భవనాలు ఉన్న పంచాయతీల్లో కంప్యూటరీకరణ కోసం రూ.3.76 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టింది. అయితే ఫోన్ కనెక్షన్ అందుబాటులో ఉండే 142 గ్రామ పంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించింది. పంచాయతీల కంప్యూటరీకరణలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 135 పంచాయతీలకు డంపింగ్ యార్డులు జిల్లాలోని 135 పంచాయతీలకు డంపిం గ్ యార్డుల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. దీనికోసం ప్రతేకంగా నిధులను మంజూరు చేసింది. చెత్తను సేకరించడానికి ట్రైసైకిళ్లు, యార్డు చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం, బోరుబావి తవ్వకం, చెత్తను కత్తిరించే యంత్రాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం తదితరాల కోసం నిధులను విడుదల చేసింది. -
ముంబై పోలీసులకు హైటెక్ బైక్
సాక్షి, ముంబై: నేరాలను మరింత సమర్థంగా అరికట్టేందుకు ముంబై పోలీసు శాఖ అత్యాధునిక పరిజ్ఞానం, వాహనాలు, పరికరాలను సమకూర్చుకుంటోంది. ఈ మేరకు అత్యాధునిక పరిజ్ఞానంతో తయారైన హైటెక్ బైక్ నగర పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చింది. వసయి యువకుడు ఒకరు పోలీసుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందిం చాడు. ఇందులో సీసీటీవీ కెమెరా, రికార్డర్, ల్యాప్‌టాప్, ప్రింటర్, ప్రథమ చికిత్స బాక్స్, కంప్యూటర్ డేటా స్టోరేజ్, వాకీటాకీ, మొబైల్ చార్జర్, జీపీఎస్, నైట్ విజన్ కెమెరా తదితర పరికరాలు ఉన్నాయి. వెంటనే కేసు నమోదుచేయడానికి అవసరమైన పుస్తక సామగ్రి కూడా ఉంది. నగరంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా ముందుగా పోలీసులు అక్కడికి చేరుకోవాలి. తర్వాత పరిస్థితులను అదుపులోకి తెచ్చి కేసు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే ఆపద సమయాల్లో తగిన పరికరాలు లేక పోలీసులు ఇబ్బందిపడుతున్నారు. అందుకే వసయి యువకుడు గాబ్రియల్ ఈ ఆధునిక బుల్లెట్‌ను ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చాడు. ఈ ఆధునిక బైక్ తయారీకి నిధులు మంజూరు చేయాలని ఆయన గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల కిందట మంత్రాలయ భవనానికి జరిగిన అగ్నిప్రమాదంలో గాబ్రియల్ దరఖాస్తు కాలిపోయింది. చివరకు నిధులు మంజూరు కావడంతో బైక్‌ను సిద్ధం చేశాడు. నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా కార్యాలయానికి వెళ్లి దీని పనితీరును వివరించాడు. దీన్ని పోలీసుశాఖకు అందజేయాలని ఉందని చెప్పాడు. అందుకు మారియా అంగీకరించారు. ఒక్కరే కూర్చుండే వీలున్న ఈ బైక్‌ను తయారు చేయడానికి రూ.ఐదు లక్షలు ఖర్చయ్యాయి. అందుకు నెల రోజుల సమయం పట్టిందన్నారు. అవసరమైన అనుమతులు లభించగానే ఈ బైక్‌ను బీట్మార్షల్స్కు అప్పగిస్తామని మారియా అన్నారు. -
వైన్ స్కాన్
ఆదిలాబాద్ : నిన్నా మొన్నటి వరకు సూపర్బజార్లు.. ఏదేని పెద్ద పెద్ద షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తే బార్కోడ్ సాయంతో ధర ప్రింట్ అయ్యేది. హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధర కంప్యూటర్లో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ విధా నం ఇక వైన్షాపుల్లోనూ రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ విధానాన్ని అమలుపర్చారు. బాటిల్ హోలోగ్రామ్‌లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను రూపొందిస్తున్నారు. అయితే.. దీన్ని కొత్త వైన్‌షాప్ హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు. బాటిల్ వివరాలు ప్రత్యక్షం.. పాత ఎక్సైజ్ పాలసీలో మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉండేది. ప్రస్తుతం హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి వైన్స్, ఏ రకం బ్రాండ్, దాని రేటు తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో జిల్లాలో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండేవారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడేది. ఇక బార్కోడ్ విధానం అమలైతే అధిక వసూలుకు బ్రేక్ పడనుంది. జిల్లాలో నాన్డ్యూటీపేడ్ (ఎన్డీపీ) లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమలైన పక్షంలో నాన్డ్యూటీపేడ్ లిక్కర్‌కు కూడా చెక్పడే ఆస్కారం ఉంది. అయితే బార్కోడ్ విధానం వైన్‌షాపు యజమానులకు లాభం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా ఓనర్ కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌కు అనుసంధానం చేస్తే సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. ఎన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయి.. ఏ బ్రాండ్ లిక్కర్ విక్రయాలు అమ్ముడుపోతున్నాయనే వివరాలు కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. అదే సమయంలో తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ ఆప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్డ్యూటీపేడ్ లిక్కరా లేదా డ్యూటీపేడ్ లిక్కరా అని తేలిపోతుంది. ఇదిలా ఉంటే.. మంగళవారం వైన్‌షాపులను ప్రారంభించిన వైన్ షాపు యజమానులు ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.50 వేల పైన ఖర్చవుతుందని, దాన్ని ఆపరేట్ చేసేందుకు జీతం ఇచ్చే వ్యక్తిని నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూమ్ పేరిట రూ.2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్లు మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలుచేస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలవుతుందా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా ప్రతి వైన్‌షాప్‌లో విధిగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలని, వినియోగదారుడికి బిల్లు జారీ చేయాలని చెప్పారు. సోమవారమే కొత్త పాలసీ ప్రారంభమైనందున వైన్‌షాప్ యజమానులు తొందరగా ఈ విషయంపై దృష్టి సారించాలని, తప్పనిసరిగా బార్కోడ్ విధానం అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు. -
పాకెట్లో ప్రింటర్..
మొబైళ్లు, కంప్యూటర్లు ఇలా వీటిల్లో అన్నీ మినీ మోడళ్లు.. కొత్త కొత్త సదుపాయాలు వచ్చేస్తున్నాయి. ప్రింటర్ల విషయానికొచ్చేసరికి అలాంటివి తక్కువే. ఆ ఆలోచనతోనే ఇజ్రాయెల్‌కు చెందిన జుటా ల్యాబ్స్ మన పాకెట్లో పట్టేసే ప్రింటర్‌ను తయారుచేసింది. అంటే.. మనకు బయట ఎక్కడో సడన్‌గా ఓ పేజీ ప్రింట్ కావాలి. ప్రింటర్ల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. ఈ వైర్లెస్ ప్రింటర్ ను బయటకు తీసి.. ప్రింట్ చేసేయొచ్చు. దీన్ని స్మార్ట్‌ఫోన్ లేదా పీసీకు బ్లూటూత్ ద్వారా అనుసంధానించి.. పనిచేయించొచ్చు. నాలుగు అంగుళాల ఎత్తు, నాలుగు అంగుళాల వ్యాసమున్న ఈ బుల్లి ప్రింటర్ ఒక నిమిషంలో 1.2 పేజీలు ప్రింట్ చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇది మార్కెట్లోకి రానుంది. -
షార్ట్ సర్క్యూట్‌తో వస్తువుల దగ్ధం
కొండపాక /నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జిల్లాలో ఆదివారం రెండు చోట్ల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్రామంలోని ఒక ట్రాన్స్ఫార్మర్ మీదగా వెళ్లిన వైర్లు కాలి ఒకదానికి ఒకటి అతుక్కుపోయి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీనికి కారణంగా స్థానిక ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్)లో కంప్యూటర్, ప్రింటర్, కౌంటింగ్ మిషన్ల తగలబడుతుండడంతో బయటికి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో ఇరుగురు పొరుగువారు గమనించి బ్యాంక్ వాచ్‌మన్ జలీల్‌ను సమాచారం అందించారు. ఆయన వచ్చి తాళాలు తీసి స్థానికుల సాయంతో మంటలను ఆర్పేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు బ్యాంక్ మేనేజర్ ఉదయ్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్‌లు బ్యాంక్‌కు చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదేవిధంగా కుకునూర్‌పల్లి పీహెచ్‌సీతో సహా కొన్ని ఇళ్లల్లో మీటర్‌తో పాటు వైర్లు కాలి బూడిదయ్యాయి. గ్రామంలో మొత్తం 20 టీవీల వరకు కాలిపోయినట్లు సర్పంచ్ ఐలంయాదవ్ తెలిపారు. ఈ సంఘటనపై బ్యాంక్ అధికారులు కుకునూర్‌పల్లి స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్టు ఎస్ఐ యాదిరెడ్డి తెలిపారు. రాంచంద్రాపూర్‌లో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన కుమార్ ఇంట్లో ఆదివారం టీవీ, సెల్‌ఫోన్‌కు సంబంధించిన చార్జీలు కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఏడాది కాలంగా గ్రామంలో తరుచూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నట్లు తెలిపారు. ఇళ్లలో స్విచ్ ఆఫ్ చేసినా కరెంట్ సరఫరా అవుతోందన్నారు. దీని కారణంగా నష్టం వాటిళ్లుతున్నటుల బాధితుడు తెలిపారు.