సాక్షి, ముంబై: నేరాలను మరింత సమర్థంగా అరికట్టేందుకు ముంబై పోలీసు శాఖ అత్యాధునిక పరిజ్ఞానం, వాహనాలు, పరికరాలను సమకూర్చుకుంటోంది. ఈ మేరకు అత్యాధునిక పరిజ్ఞానంతో తయారైన హైటెక్ బైక్ నగర పోలీసు శాఖకు అందుబాటులోకి వచ్చింది. వసయి యువకుడు ఒకరు పోలీసుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందిం చాడు. ఇందులో సీసీటీవీ కెమెరా, రికార్డర్, ల్యాప్‌టాప్, ప్రింటర్, ప్రథమ చికిత్స బాక్స్, కంప్యూటర్ డేటా స్టోరేజ్, వాకీటాకీ, మొబైల్ చార్జర్, జీపీఎస్, నైట్ విజన్ కెమెరా తదితర పరికరాలు ఉన్నాయి. వెంటనే కేసు నమోదుచేయడానికి అవసరమైన పుస్తక సామగ్రి కూడా ఉంది.
నగరంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా ముందుగా పోలీసులు అక్కడికి చేరుకోవాలి. తర్వాత పరిస్థితులను అదుపులోకి తెచ్చి కేసు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే ఆపద సమయాల్లో తగిన పరికరాలు లేక పోలీసులు ఇబ్బందిపడుతున్నారు. అందుకే వసయి యువకుడు గాబ్రియల్ ఈ ఆధునిక బుల్లెట్‌ను ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చాడు. ఈ ఆధునిక బైక్ తయారీకి నిధులు మంజూరు చేయాలని ఆయన గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల కిందట మంత్రాలయ భవనానికి జరిగిన అగ్నిప్రమాదంలో గాబ్రియల్ దరఖాస్తు కాలిపోయింది.
చివరకు నిధులు మంజూరు కావడంతో బైక్‌ను సిద్ధం చేశాడు. నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా కార్యాలయానికి వెళ్లి దీని పనితీరును వివరించాడు. దీన్ని పోలీసుశాఖకు అందజేయాలని ఉందని చెప్పాడు. అందుకు మారియా అంగీకరించారు. ఒక్కరే కూర్చుండే వీలున్న ఈ బైక్‌ను తయారు చేయడానికి రూ.ఐదు లక్షలు ఖర్చయ్యాయి. అందుకు నెల రోజుల సమయం పట్టిందన్నారు. అవసరమైన అనుమతులు లభించగానే ఈ బైక్‌ను బీట్‌మార్షల్స్‌కు అప్పగిస్తామని మారియా అన్నారు.
ముంబై పోలీసులకు హైటెక్ బైక్
Published Fri, Aug 15 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement