Machine Identification Code: దగ్గరున్న ప్రింటర్‌లోనో, ఏదో ఇంటర్నెట్ సెంటర్‌లోనో ఓ తప్పుడు కలర్ డాక్యుమెంట్‌ను ప్రింట్ చేశారు. ఎప్పుడో పాత తేదీని పెట్టుకున్నారు, పేర్లు మార్చారు. తీసుకెళ్లి ఏదో ధ్రువీకరణ కింద చూపించారు. కానీ ఎంత జాగ్రత్తపడ్డా.. ఎక్కడా లేశమాత్రం తేడా లేకుండా డాక్యుమెంట్‌ను ప్రింట్ చేసినా.. అడ్డంగా దొరికిపోయారు. దీనికి కారణం.. యెల్లో డాట్స్ (పసుపు రంగు చుక్కలు). ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? వాటితో లాభమేంటో తెలుసుకుందామా?
ప్రింటర్లు నిఘా పెట్టినట్టా?
వివిధ గుర్తింపుకార్డుల నుంచి ఇళ్లపత్రాలు, దొంగనోట్ల దాకా.. అక్రమార్కులు అన్నింటిలోనూ నకిలీలను, ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అసలు వాటికి, తప్పుడు పత్రాలకు తేడాను గుర్తించడం చాలా కష్టం కూడా. దీనికి చెక్ పెట్టేందుకే జపాన్‌లో పరిశోధకులు/అధికారులు కలిసి ‘యెల్లో డాట్స్’ను రంగంలోకి తెచ్చారు.
ప్రింట్ చేసే ప్రతి పేజీలో..
లేజర్ కలర్ ప్రింటర్లు ప్రతిపేజీలో.. మనం గమనించలేనంత సూక్ష్మంగా, అంటే మిల్లీమీటర్‌లో పదో వంతు పరిమాణంలో ‘పసుపు రంగు’ చుక్కలను ముద్రిస్తాయి. పేజీలో కాస్త దూరం దూరంగా.. నిర్దిష్ట ఆకృతులు వచ్చేలా ఈ చుక్కలు ఉంటాయి. (ఉదాహరణకు బ్రెయిలీ లిపి మాదిరిగా అనుకోవచ్చు). సదరు ప్రింటర్ కంపెనీ, మోడల్, సీరియల్ నంబర్, సదరు పేజీని ప్రింట్ చేసిన తేదీ, సమయం వివరాలు ఆ ఆకృతుల్లో ఉంటాయి. దీన్ని ‘ప్రింటర్ స్టెగనోగ్రఫీ’ అని పిలుస్తున్నారు.
పసుపు రంగే ఎందుకు?
సాధారణంగా ఎరుపు, నీలం, నలుపు వంటి రంగులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి, అదే పసుపు రంగును, అందులోనూ లేతగా ఉంటే గుర్తించడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు ఈ రంగును ఎంచుకున్నారు. మనం ప్రింట్ చేసే కాగితాలపై అత్యంత సూక్ష్మంగా, దూరం దూరంగా పసుపు రంగు చుక్కలు ఉంటే.. సాధారణ కంటితో గుర్తించడం దాదాపు సాధ్యం కాదు కూడా.
చదవండి: చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్
వివరాలను ఎలా గుర్తిస్తారు?
పేజీల్లో ప్రింట్ అయ్యే పసుపు చుక్కల ప్యాటర్న్ (ఆకృతుల)ను గుర్తించేందుకు ‘ఈఎఫ్‌ఎఫ్ (ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్) ఆన్‌లైన్ డీకోడర్ల’ను వినియోగిస్తుంటారు. అందులో తేదీ, సమయం వివరాలు సులువు గానే తెలిసిపోతాయి. ఇక ప్రింటర్ మోడల్, సీరియల్ నంబర్ ఆధారంగా.. సదరు ప్రింటర్ కంపెనీ నుంచి వివరాలు తీసుకుంటారు. అధికారులు ఆ ప్రింటర్‌ను ఎవరు కొన్నారు, ఎక్కడ వినియోగిస్తున్నారనేది ట్రేస్ చేసి.. తప్పుడు డాక్యుమెంట్ మొత్తం చరిత్రను బయటికి తీస్తారు. ఇంకేం.. దొంగలు దొరికిపోయినట్టే.
ఎప్పటి నుంచో ఉన్నా రహస్యమే..
2017లో అమెరికాలో ఓ రహస్య పత్రం లీకైంది. దానిపై అక్కడి జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ చేపట్టి.. లీకేజీకి కారణమైన ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్‌ను గుర్తించి, అరెస్టు చేసింది. లీకైన పత్రాల కాపీలపై ఉన్న ఎల్లో డాట్స్ ఆధారంగానే ఆ కాంట్రాక్టర్‌ను పట్టేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశాన్ని రహస్యంగా ఉంచే ఉద్దేశంతో అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.
చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి?
► అయితే నకిలీలు, తప్పుడు పత్రాలను గుర్తించడం, ట్రాక్ చేయడంలో భాగంగా.. ఇలా ‘ఎల్లో డాట్స్’ను ముద్రించేలా కొన్ని పెద్ద ప్రింటర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు అమెరికా నిఘా సంస్థలు అంగీకరించడం గమనార్హం.
►ఈ ఎల్లో డాట్స్ ఆకృతుల్లోని సమాచారం ఏమిటని గుర్తించే కోడ్.. అటు ప్రభుత్వం, ఇటు ప్రింటర్ కంపెనీలఉన్నతాధికారులకు మాత్రమే తెలిసి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆ చుక్కలను మనమూ చూడొచ్చు
భూతద్దాలు వంటి వాటిని ఉపయోగించి పేజీలను పరిశీలిస్తే.. అతి చిన్నగా ఉండే ఈ పసుపు రంగు చుక్కలను గుర్తించవచ్చు. ఇంకా సులువుగా మొత్తం చుక్కలను చూడాలనుకుంటే.. పూర్తి చీకటిలో నీలి రంగు కాంతిని సదరు పేజీపై ప్రసరింపజేయాలని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల సదరు పసుపు రంగు చుక్కలు.. నల్లటి చుక్కల్లా కనిపిస్తాయని వివరిస్తున్నారు.
► కానన్, ఎప్సన్, డెల్, హ్యులెట్ ప్యాకర్డ్, ఐబీఎం, కొనికా, పానసొనిక్, జిరాక్స్, సామ్సంగ్ వంటి చాలా వరకు ప్రింటర్ తయారీ కంపెనీలు ‘ఎల్లో డాట్స్’ టెక్నాలజీని అమలు చేస్తున్నాయని ఈఎఫ్‌ఎఫ్ సంస్థ పేర్కొంది. ఏయే కంపెనీలకు చెందిన ఏ ప్రింటర్లలో దీనికి వాడుతున్నరన్న జాబితాలను తమ వెబ్‌సైట్లో కూడా పెట్టింది.
బ్లాక్ అండ్ వైట్‌లో కష్టమే..
ఈ ఎల్లో డాట్స్ టెక్నాలజీ కేవలం కలర్ ప్రింటర్లకే పరిమితం. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లలో కేవలం నలుపు రంగును మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆ చుక్కలు సులువుగా కనిపిస్తాయి. సదరు డాక్యుమెంట్‌లోని అక్షరాలు, ఫొటోలు, ఇతర అంశాలు ఈ చుక్కలపై ఎఫెక్ట్ చూపించడంతో.. రహస్య కోడ్ దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment