కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది.
ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది.