కాలేయంలో కొవ్వు... ప్రమాదమా?
నా వయసు 65 ఏళ్లు. నాకు డయాబెటిస్, హైబీపీ ఉన్నాయి. ఒకసారి ఉన్నట్లుండి కడుపులో నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను.అప్పుడు డాక్టర్‌గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి ‘కాలేయంలో కొవ్వు చేరింద’ని చెప్పారు. కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
- సురేంద్రనాథ్, వరంగల్
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలోనూ లివర్‌లో కొవ్వు చేరడం సాధారణంగా జరుగుతుంది. కాలేయంలో కొవ్వు ఉన్నంత మాత్రాన పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కాలేయం పనితీరులో తేడా కనిపిస్తే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ, బరువును తగ్గించుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు అదే తగ్గిపోయే అవకాశం ఉంది.
నా వయసు 29 ఏళ్లు. గత ఐదేళ్ల క్రితం నేను చేయించిన రక్తపరీక్షలో హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ అని తేలింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ వైరస్ వల్ల ఎలాంటి హాని లేదని తెలిపారు. త్వరలో నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకున్న ఈ సమస్య వల్ల నేను చేసుకోబోయే భార్యకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పెళ్లి చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు.
- ఒక సోదరుడు, హైదరాబాద్
మీరు తెలిపిన వివరాలను చూస్తే మీకు ‘హెపటైటిస్-బి’ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. పరీక్షల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కాబట్టి మీరు ప్రస్తుతం క్యారియర్ దశలో ఉన్నారు. అంటే ఈ దశలో ఉన్నవారికి వైరస్ శరీరంలో ఉంటుంది. కానీ ఎలాంటి హానీ తలపెట్టదు. అయితే మీ రక్తం, వీర్యం ద్వారా హెపటైటిస్-బి ఇతరులకు సోకే అవకాశం ఉంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు చేసుకోబోయే భాగస్వామికి ఈ విషయం చెప్పండి. ఆమెకూ ‘హెపటైటిస్-బి’ పరీక్షలు నిర్వహించండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేనట్లయితే ఆమెకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పించండి. మీరు క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకోసారి ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ను చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏదైనా తేడా వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
డాక్టర్ పి. భవానీ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
Published Mon, Jul 20 2015 10:29 PM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement
Advertisement