కోపం, చిరాకు పెరుగుతున్నాయి?
నా వయసు 60 ఏళ్లు. లైంగిక కలయిక సమయంలో నొప్పిగానూ, యోనిలో మంటగానూ ఉంటోంది. సెక్స్‌పై ఆసక్తి లేదు. మతిమరపు, కోపం ఎక్కువ. చిరాకుగా ఉంటోంది. దీనివల్ల మావారు రోజూ అన్నిరకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈ బాధలు చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి నా బాధను అర్థం చేసుకొని, సలహా ఇవ్వగలరు.
- పద్మ, ఒంగోలు
మీ వయసులో... అంటే అరవై ఏళ్లప్పుడు ఆడవాళ్ల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి చాలా తగ్గడంతో యోనిలో స్రావాలూ తగ్గిపోతాయి. దాంతో అక్కడి లోపలి పొర పొడిబారిపోవడం వల్ల, యోని రంధ్రం చిన్నగా అవ్వడం వల్ల, కలయిక సమయంలో నొప్పి, మంట వస్తాయి. మొదట మీరు కలయిక సమయంలో కెవై జెల్లీ, ల్యూబిక్ జెల్లీ వంటి లూబ్రికేటింగ్ జెల్స్ వాడి చూడండి. అప్పటికీ ఇబ్బంది ఉంటే రెండువారాల పాటు కొంత ఈస్ట్రోజెన్ క్రీమ్‌ను వేలి సహాయంలో రోజూ యోనిలో రాసుకోండి. ఇలా వారం, పదిరోజులు ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మీ వయసు 60 ఏళ్లు కాబట్టి... బీపీ, షుగర్ సంబంధిత వ్యాధులు లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజెన్ మాత్రలు వాడవచ్చు. మీరు సిగ్గుపడకుండా ఒకసారి మీ దగ్గరలోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీరు వెలిబుచ్చే సందేహాలకు వారేమీ అనుకోరు. నిజానికి డాక్టర్లు ఉన్నది మీలాంటి వారికి సహాయం చేయడం కోసమే.
నా వయసు 28. పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- ప్రణీత, వరంగల్
మీరు రాసిన లేఖలో మీ బరువు ఎంతో రాయలేదు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిలో స్ట్రెస్, టెన్షన్ అధికబరువు పోషకాహార లేమి హార్మోన్లలో అసమతుల్యత పాలిసిస్టిక్ ఓవరీస్ గర్భసంచికి సంబంధించిన కారణాలు - పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ వంటివి కొన్ని. మీ సమస్యకు కారణం తెలుసుకోడానికి కొన్ని వైద్యపరీక్షలతో పాటు థైరాయిడ్, ప్రోలాక్టిన్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ వంటి హార్మోన్ టెస్ట్‌లు, స్కానింగ్ ద్వారా ఓవరీస్‌లోని సిస్ట్‌లు, యూటెరస్ పరీక్షలు చేయాలి. పీరియడ్స్ కరెక్ట్‌గా రావడానికి మందులతోపాటు జీవనశైలిలో మార్పులూ చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం, తగినంత ఎక్సర్‌సైజ్ చేయడమే లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్‌లో ప్రధానంగా చేయాల్సిన మార్పులు. పీరియడ్స్‌ను సరిచేయడంలో హార్మోన్ ట్యాబ్లెట్లు తాత్కాలికంగా సహాయపడినప్పటికీ దీర్ఘకాలంలో జీవనశైలి మార్పులే పూర్తిస్థాయి ఆరోగ్యాన్నిస్తాయి. పీరియడ్స్ సక్రమంగా రానప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కూడా కష్టమే కాబట్టి ఆ పరిస్థితి వచ్చే వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే డాక్టర్‌ని కలిసి తగిన చికిత్స తీసుకోండి.
గైనకాలజీ కౌన్సెలింగ్
Published Wed, Jul 1 2015 11:05 PM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement